
ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ పారిపోవడాన్ని 'ఇంటెలిజెన్స్ వైఫల్యం'పై పంజాబ్- హర్యానా హైకోర్టు మంగళవారం (మార్చి 21న ) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 80వేల మంది పోలీసు సిబ్బంది ఉండి కూడా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అమృత్‌పాల్ సింగ్‌ఎలా తప్పించుకున్నాడని నిలదీసింది.
‘మీ వద్ద 80 వేల మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారంతా ఏం చేస్తున్నారు..? అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?’ అంటూ పంజాబ్- హర్యానా హైకోర్టు పంజాబ్(Punjab) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పరారీలో ఉన్న ఖలిస్థానీ(Khalistan) సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. అతడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, విడుదలకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.ఎస్.షెకావత్ విచారణ చేపట్టారు. అయితే, అమృత్‌పాల్ పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. అమృత్‌పాల్ సింగ్ తప్పించుకోవడం పోలీసుల నిఘా వైఫల్యమేనని పేర్కొంది.
ఆపరేషన్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలంటూ పంజాబ్ పోలీసులను ఆదేశించింది. అమృత్‌పాల్ పంజాబ్ సరిహద్దులు దాటి ఉంటాడని పోలీసులు అనుమానిస్తోన్న వేళ.. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. అమృత్‌పాల్ సింగ్‌పై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించామని పంజాబ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. మరోవైపు... అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ దాటేసి పారిపోయి ఉంటాడన్న అనుమానాలతో అంతర్జాతీయ సరిహద్దులను సైతం అప్రమత్తం చేసింది కేంద్రం.
‘వారిస్ పంజాబ్ దే’ సిక్కు గ్రూప్ చీఫ్‌గా.. అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి దానిని స్థాపించింది సందీప్ సింగ్ అలియాస్ దీప్ సింగ్ అనే పంజాబీ నటుడు కమ్ ఉద్యమకారుడు. పంజాబీల హక్కుల సాధన -పరిరక్షణ విషయంలో కేంద్రంతో పోరాడేందుకు ఈ గ్రూప్‌ను స్థాపించాడు. సందీప్ నుంచి వారసత్వంగా విభాగపు బాధ్యతలు తీసుకున్నాడు అమృత్‌పాల్ సింగ్. అయితే హక్కుల గ్రూప్‌ను కాస్త.. ఉగ్రవాదంపై మళ్లించినట్లు అమృత్‌పాల్ సింగ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ఉదమ్యం ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు నిఘా వర్గాలు ఆలస్యంగా గుర్తించాయి. గత నెలలో తన అనుచరులను ఉసిగొల్పి ఓ పోలీస్ స్టేషన్‌పై మారణాయుధాలతో దాడికి దిగి.. తన ప్రధాన అనుచరుడిని విడిపించుకున్నాడు. ఈ దాడిలో ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.
అదుపులోనే శాంతిభద్రతలు : మాన్
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. అమృత్‌పాల్ ఆచూకీ కోసం పోలీసులు చేపడుతోన్న ఆపరేషన్‌పై సీఎం మాన్ తొలిసారి స్పందించారు. రాష్ట్రంలో శాంతిసామరస్యాలతోపాటు దేశ పురోగతే తన ప్రాధాన్యాలని చెప్పారు.