మళ్లీ ముంచిన వాన.. రోడ్డెక్కిన  రైతన్న 

మళ్లీ ముంచిన వాన.. రోడ్డెక్కిన  రైతన్న 

మళ్లీ ముంచిన వాన.. రోడ్డెక్కిన  రైతన్న 
అకాల వర్షాలకు సెంటర్లలో తడిసిన 
వడ్లు, మక్కలు కొనుగోళ్లలో ఆలస్యంపై అన్నదాతల ఆందోళన 
రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు  
నెల రోజులైనా కాంటా పెట్టడం లేదని ఆగ్రహం  
తడిసిన వడ్లు, మక్కలను ఆంక్షలు లేకుండా కొనాలని డిమాండ్

వెలుగు, నెట్​వర్క్ : 
చెడగొట్టు వానలు రైతులను మరోసారి ముంచాయి. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షాలకు నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి తదితర జిల్లాల్లోని వందలాది సెంటర్లలో వడ్లు, మక్కలు తడిసిపోయాయి. పలుచోట్ల వడ్లు, మక్కలు వరదలో కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా సెంటర్లలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సెంటర్లలో వడ్లు పోసి నెల రోజులైనా కాంటాలు పెట్టడం లేదు. ఈ క్రమంలో గతంలో కురిసిన వానలకు వడ్లు తడిసిపోగా, రకరకాల కొర్రీలు పెడుతూ వాటిని మిల్లర్లు కొనడం లేదు.

ఇప్పుడు మళ్లీ వర్షాలకు వడ్లు, మక్కలు తడవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. స్టేట్, నేషనల్​ హైవేలను దిగ్బంధించి నిరసన తెలిపారు. వడ్లు సెంటర్లకు తెచ్చి నెల దాటినా కొనకపోవడం.. కనీసం బార్దాన్, పర్దాలు ఇవ్వకపోవడం వల్లే మరోసారి వడ్లు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన వడ్లు, మక్కలను ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. 

కొట్టుకుపోయిన వడ్లు, మక్కలు.. 

* నిర్మల్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి నర్సాపూర్, పెంబి, కడెం, ఖానాపూర్, సారంగాపూర్, నిర్మల్, సోన్ మండలాల్లోని కొనుగోలు సెంటర్లలో వడ్ల కుప్పలు తడిసిపోయాయి.

* వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలంలో మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి నేషనల్ హైవే 365పై ఆరబోసిన మక్కలు కొట్టుకుపోయాయి. నల్లబెల్లిలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పది రోజులైనా కొనుగోళ్లు ప్రారంభించలేదు. సెంటర్ వద్ద ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, కనీసం పరదాలు ఇవ్వలేదని.. దీంతో తమకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయి. తూకం వేసిన బస్తాలు మిల్లులకు చేరకపోవడంతో తడిసి ముద్దయ్యాయి. నెల కింద వడ్లు తెచ్చి పోసినా ఇప్పటివరకు కొనలేదని, వారం నుంచి  బార్దాన్ ఇయ్యట్లేదని, లారీలు రావట్లేదని.. అందువల్లే తమ మక్కలు, వడ్లు తడిసిపోయాయని పలువురు రైతులు వాపోయారు.  

* మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో గాంధీనగర్​లోని జీసీసీ కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వర్షం సడెన్ గా రావడంతో రైతులు కనీసం పరదాలు కూడా కప్పలేకపోయారు. జీసీసీ నుంచి రైతులకు కనీసం పరదాలు కూడా ఇవ్వలేదు. 

* మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి, బట్వాన్ పల్లి, దుబ్బపల్లి గ్రామాల్లో వరద ధాటికి వడ్లు కొట్టుకుపోయాయి.

190 బస్తాలు తడిసినయ్.. 

నా వడ్లు కాంటా పెట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా లారీలు రాలేదు. అగ్రికల్చర్ మేడమ్​ను రోజు కలుస్తున్నం. లారీలు వస్తయి అంటున్నరు కానీ వస్తలేవు. వానకు 190 బస్తాల వడ్లు తడిసినయి. బస్తాలన్నీ నీళ్లల్ల ఉన్నయ్. ఇంతవరకు ఏ ఒక్క ఆఫీసర్​మా దిక్కు సూడలే. దీనికి సర్కారే బాధ్యత వహించాలె. తడిసిన వడ్లను కటింగ్​లేకుండా కొనుగోలు చేయాలె.  

- రాజన్న, హాజీపూర్,  మంచిర్యాల జిల్లా

* హనుమకొండ జిల్లా కమలాపూర్ సెంటర్​లో కాంటా వేసిన వడ్లను తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయి. తడిసిన వడ్ల బస్తాలను మిల్లులకు తరలించేదిలేదని నిర్వాహకులు చెప్పడంతో.. సబ్ మార్కెట్ యార్డు ఎదుట రైతులు బైఠాయించారు. తడిసిన వడ్లు, మక్కలను కొనుగోలు చేయాలని పరకాల గ్రేన్​మార్కెట్​ ముందు రైతులు ధర్నా చేశారు. 

* వడ్ల కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా ఆందోల్​లో రైతులు హైవే మీద వడ్లు పోసి నిప్పు పెట్టారు. ఆందోల్​మండలం పోసానిపేటకు చెందిన రైతులు జోగిపేట  తహసీల్దార్‌ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. హైవే మీద వస్తున్న రెండు లారీలను రైతులు అడ్డుకొని, వాటిని తమ గ్రామానికి పంపి వడ్లు మిల్లులకు తరలించాలని తహసీల్దార్‌ వెంకటేశంను కోరారు. ఇదే జిల్లా గుమ్మడిదల టోల్​గేట్​వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 

* లారీలు అన్ లోడ్ చేయడం లేదని మెదక్ జిల్లా శివ్వంపేటలోని శ్రీసాయి వెంకటరమణ  రైస్ మిల్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. 

* నిర్మల్ జిల్లా కడెంలో నిర్మల్–మంచిర్యాల రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ఖానాపూర్ లోని ఐబీ వద్ద రైతులు రోడ్డుకు అడ్డంగా ధాన్యం బస్తాలు పెట్టి నిరసన తెలిపారు.

* వడ్లు బస్తాలు మిల్లులకు తరలించకపోవడంతో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మార్కెట్ యార్డులో రైతులు రాస్తారోకో చేశారు. వడ్లు దించుకోవడం లేదని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేట రైసుమిల్లు వద్ద రైతులు ధర్నా చేశారు. 

* మెదక్ ​జిల్లా శివ్వంపేట మండలం మగ్ధుంపూర్ రైతులు తూప్రాన్–-నర్సాపూర్ ​రోడ్డు మీద వడ్లు పోసి నిరసన తెలిపారు.  

* సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని మునిగడప ఐకేపీ సెంటర్ లో 20 రోజులైనా వడ్లు కాంటా పెట్టడం లేదని రైతులు ధర్నా చేశారు. కాంటా పెట్టిన వడ్లను మిల్లులకు తరలించడం లేదని చిన్నకోడూర్​మండలం రామునిపట్లలో రాజీవ్ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. వడ్లను మిల్లులకు తరలించకపోవడాన్ని నిరసిస్తూ నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. 

* మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చెల్కపల్లిలో ఎన్​హెచ్​63పై వడ్ల బస్తాలు అడ్డం పెట్టి రైతులు రాస్తారోకో చేశారు. నెన్నెల మండలం గొల్లపల్లి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వంటావార్పు చేసి నిరసన తెలిపారు. వేమనపల్లి సెంటర్​లో కొనుగోళ్లు ఆలస్యం కావడంపై మండిపడ్డ రైతులు.. టార్పాలిన్ల కోసం పీఏసీఎస్​ఆఫీసు తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించారు.