హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ మరో రెండు, మూడ్రోజుల్లో ప్రారంభిస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఈ నెల 30న కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదలయ్యే చాన్స్ ఉందని, ఫిబ్రవరి 4 లేదా 5 వరకు స్టూడెంట్లకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తామని వర్సిటీ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం ‘వెలుగు’కు చెప్పారు. ఈసారి అన్ని రౌండ్లకు కలిపి ఒకేసారి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీ నుంచే ఫస్ట్ రౌండ్ కౌన్సెలింగ్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, కోర్టు కేసులు, ఇతర కారణాలతో స్టార్ట్ చేయలేకపోయారు. దీనిపై కాళోజీ వర్సిటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులను అడగగా, ప్రస్తుతం నేషనల్ కోటా ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతోందని, ఈ నెల చివరిలోగా స్టేట్ కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
