ఓల్డ్ పెన్షన్ స్కీం కోసం దేశవ్యాప్త ఉద్యమం
ఎన్ఎంఓపీఎస్ సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నాగపూర్‌లో సంకల్పయాత్ర.. భారీగా హాజరైన ఉద్యోగులు
హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా ఓట్ ఫర్ ఓపీఎస్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఎన్ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ వెల్లడించారు. ప్రభుత్వాలు సీపీఎస్ ఉద్యోగ, టీచర్ల పాత పింఛన్ అమలు చేయకపోతే, రాబోయే ఎన్నికల్లో పాత పింఛన్ ఇచ్చే వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఎన్ఎంఓపీఎస్ ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు డిమాండ్‌తో బీఆర్ అంబేద్కర్ ఎయిర్ పోర్ట్ నుంచి జీరో మైల్ ఫ్రీడమ్ పార్కు వరకూ ఉద్యోగులు ఓపీఎస్ సంకల్ప యాత్ర పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహారాష్ట్ర రాజ్య జునీ పెన్షన్ సంఘటన్ నేత వితేష్ ఖండేకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థితప్రజ్ఞ చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ఇటీవల కర్ణాటకలో మొదలైన ఓట్ ఫర్ పింఛన్ ఉద్యమం నాగపూర్లోనూ కొనసాగాలని కోరారు. ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు కేఆర్ సియాగ్ పాత పింఛన్ ఇచ్చే రాష్ర్టాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
ఇప్పటికే పాత పింఛన్ ప్రకటించిన రాష్ర్టాల పింఛన్ నిధి పట్ల పీఎఫ్ఆర్ఎఫ్డీఏ.. ఉద్యోగుల సొమ్మును ఉద్యోగులకు ఇవ్వకుండా చట్టం లేదనే సాకును చూపుతూ దేశంలోని 84 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ సంస్కరణలన్నీ కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయని, ఉద్యోగులకు గౌరవమైన భృతి కల్పించడం లేదన్నారు. దేశంలో ఎన్ఎంఓపీఎస్ ఇప్పటికీ 14 రాష్ర్టాల్లో గ్రాట్యుటీ, ఫ్యామిలీ పింఛన్ సాధించిందని, ఐదు రాష్ర్టాల్లో పాత పింఛన్ సాధించిందని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ నుంచి సీపీఎస్ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, ట్రెజరర్ నరేశ్ గౌడ్, యూపీ నుంచి విజయ్ కుమార్ బంధు తదితరులు పాల్గొన్నారు.

