సర్పంచ్, మాజీ సర్పంచ్ ​వర్గాల మధ్య భగ్గుమన్న విభేదాలు

సర్పంచ్, మాజీ సర్పంచ్ ​వర్గాల మధ్య భగ్గుమన్న విభేదాలు
  • ఇరువర్గాల తోపులాటతో ఉద్రిక్తత

మెదక్ (శివ్వంపేట), వెలుగు : మెదక్​ జిల్లాలోని శివ్వంపేటలో బీఆర్ఎస్​ లీడర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కొద్ది రోజులుగా అధికార పార్టీకే చెందిన ప్రస్తుత సర్పంచ్, మాజీ సర్పంచ్ ​మధ్య కొనసాగుతున్న గొడవలు బుధవారం బహిర్గతమయ్యాయి. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొన్ని నెలలుగా శివ్వంపేట జడ్పీటీసీ మద్దతుదారుడైన సర్పంచ్​ శ్రీనివాస్ గౌడ్​, ఎంపీపీ హరికృష్ణ మద్దతుదారుడైన మాజీ సర్పంచ్​భర్త నవీన్​ గుప్తాకు పడడం లేదు. ఇరువర్గాల వారు వాట్సాప్​ గ్రూప్​లలో విమర్శలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల కింద సర్పంచ్, మాజీ సర్పంచ్​భర్త ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. శివ్వంపేటలోని ప్రభుత్వ దవాఖాన స్థలంలో మార్కెట్ నిర్మించారంటూ మాజీ సర్పంచ్ భర్త నవీన్ గుప్తా ప్రస్తుత సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ పై ఇటీవల కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం డీఎల్పీఓ యాదయ్య  శివ్వంపేటకు ఎంక్వైరీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముందే సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు, మాజీ సర్పంచ్ స్రవంతి  భర్త నవీన్ గుప్తా వర్గీయులు గొడవ పడ్డారు. ఇరు వర్గాల వారు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు.  ఈ క్రమంలో తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి సముదాయించారు.

సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మంత్రి హరీశ్​రావు అనుమతితోనే హాస్పిటల్​కు సంబంధించిన పాడుబడిన బిల్డింగ్ డిస్మెంటల్ చేసి చిరు వ్యాపారుల కోసం మోడ్రన్​వెజిటెబుల్​ మార్కెట్ ​నిర్మించామన్నారు. దీంతో రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితిలో కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునే బాధ వారికి తప్పిందన్నారు. అందరికీ ఉపయోగపడే మంచి పని చేస్తే ఫిర్యాదు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ స్రవంతి భర్త నవీన్ గుప్తా మాట్లాడుతూ మంచిగా ఉన్న హోమియోపతి హాస్పిటల్​ స్టాఫ్​ క్వార్టర్స్ ను ఎలాంటి అనుమతులు లేకుండా డిస్మెంటల్ చేసి మార్కెట్​కట్టారన్నారు. మెయింటెనెన్స్​ పేరుతో వ్యాపారుల వద్ద వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణకు వచ్చిన డీఎల్పీఓకు అడ్డుపడ్డారన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్​కు నివేదిక పంపిస్తామని డీఎల్పీఓ యాదయ్య తెలిపారు.