సర్పంచ్ కాలర్ పట్టుకున్న కానిస్టేబుల్

సర్పంచ్ కాలర్ పట్టుకున్న కానిస్టేబుల్

గంభీరావుపేట, వెలుగు: సర్పంచ్​కాలర్ ను ఓ కానిస్టేబుల్​పట్టుకోవడంతో అతడిపై స్థానికులు చేయి చేసుకున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ సత్యనారాయణ శోభాయాత్రను అడ్డుకున్నారని, తమను తిట్టారంటూ దీక్షాపరులు సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడికి చేరుకున్న సర్పంచ్ శోభాయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని కానిస్టేబుల్​ను ప్రశ్నించారు. సర్పంచ్ కాలర్ ను కానిస్టేబుల్ పట్టుకోవడంతో అక్కడే ఉన్న స్థానికులు అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. కానిస్టేబుల్ మద్యం మత్తులో శోభాయాత్రను అడ్డుకొని గొడవకు కారణమయ్యాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తూ హనుమాన్ దీక్షాపరులు ధర్నాకు దిగారు. వీరికి బీజేపీ నాయకులు, యువకులు మద్దతు తెలిపారు. సుమారు 2 గంటలపాటు ధర్నా నిర్వహించడంతో ఎక్కడి వెహికల్స్​అక్కడే నిలిచిపోయాయి. ఎల్లారెడ్డిపేట సీఐ మొగలి ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పినా ధర్నా విరమించలేదు. డీఎస్పీ చంద్రశేఖర్ ధర్నా వద్దకు  చేరుకొని కానిస్టేబుల్ పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.