చాక్​పీస్​, చీపురుకట్టకూ చెక్​ రాయాల్సిందే!

చాక్​పీస్​, చీపురుకట్టకూ చెక్​ రాయాల్సిందే!

చాక్​పీస్​, చీపురుకట్టకూ చెక్​ రాయాల్సిందే!

స్కూల్​ గ్రాంట్స్​ ఖర్చులో సర్కారు కొత్త రూల్స్

నాగర్ కర్నూల్, వెలుగు : సర్కారు బడిలో బోర్డుపై రాసేందుకు రూ.50 పెట్టి చాక్​పీస్​ల బాక్స్​ కొనాలన్నా, రూంలు ఊడ్చేందుకు రూ.100 పెట్టి చీపురుకట్ట కొనాలన్నా చెక్​పేమెంట్ ద్వారానే​చేయాలట! స్కూల్​గ్రాంట్స్​ ఖర్చు చేసేందుకు సర్కారు పెట్టిన ఈ కొత్త నిబంధనలతో ​హెచ్​ఎంలతోపాటు స్కూల్​మెయింటనెన్స్​కమిటీ చైర్మన్​లు తిప్పలు పడ్తున్నారు. తెలంగాణ వచ్చాక స్కూల్​గ్రాంట్, స్కూల్​మెయింటనెన్స్​ గ్రాంట్​లను తగ్గించిన రాష్ట్ర సర్కారు, ప్రస్తుతం ఇస్తున్న పదో, పరకో పైసల ఖర్చుకు పెట్టిన కొత్త రూల్స్​పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇచ్చేదే అరకొర నిధులు..

తెలంగాణ ఏర్పాటుకు ముందు స్కూల్ గ్రాంట్, మెయింటనెన్స్ గ్రాంట్స్​కింద స్టూడెంట్ల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రైమరీ స్కూళ్ల​కు ఏడాదికి రూ.20వేల దాకా, యూపీఎస్​లకు రూ.20 నుంచి రూ.25వేల దాకా, హైస్కూళ్లకు రూ.25 నుంచి రూ.35వేల దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్టూడెంట్ల సంఖ్యను బట్టి స్కూల్​మెయింటెన్స్​ గ్రాంట్​ ఇస్తున్నారు. 50లోపు స్టూడెంట్లుంటే రూ.10వేలు, 50 నుంచి 100 మంది స్టూడెంట్స్​ ఉంటే  రూ.20వేలు, 100 నుంచి 150 మంది స్టూడెంట్స్​ ఉంటే రూ.30వేలు, 150, ఆపైన స్టూడెంట్లు ఉంటే రూ.40వేలు ఇస్తున్నారు. ఈ  పైసలతో జెండా పండుగలు, ఇతర దినోత్సవాలు నిర్వహించడంతో పాటు, రిజిస్టర్లు, రికార్డులు, చాక్​పీసులు, పెన్నులు, ఎగ్జామ్​ పేపర్లు, చీపుర్లు, ఫినాయిల్​.. ఇలా సర్వం కొనాల్సి  ఉంటుంది. 

సవాలక్ష నిబంధనలు.. 

గతంలో స్కూళ్లకు దగ్గరలో ఉన్న బ్యాంకులో  స్కూల్​మేనేజ్​మెంట్​కమిటీ(ఎస్ఎంసీ) చైర్మన్​కు,  హెచ్ఎం​కు జాయింట్​ అకౌంట్​ తీసుకుంటే, సర్కారు నుంచి వచ్చే పైసలు అందులో పడేవి. ఎస్​ఎంసీ తీర్మానం తర్వాత  స్కూల్​ గ్రాంట్స్​, మెయింటన్స్​ డబ్బులను అకౌంట్​ నుంచి తీసుకొని ఖర్చు పెట్టుకునేవారు.  కానీ, ఇప్పుడు మారిన రూల్స్​ ప్రకారం.. డబ్బులను హెచ్​ఎం, ఎస్​ఎంసీ చైర్మన్​ విత్​డ్రా చేయడానికి లేదు. కేవలం కెనరా బ్యాంకులో మాత్రమే స్కూల్​అకౌంట్ తీయాలని, అన్నింటికీ చెక్కు రూపంలోనే చెల్లించాలని రూల్​పెట్టారు.  పది రూపాయల ఖర్చయినా దాన్ని చెక్కు ద్వారా చేయాల్సిందే. ఎవరూ చెక్​లు తీసుకోకపోవడంతో హెచ్​ఎంలు తలపట్టుకుంటున్నారు. ప్రతి చిన్న ఖర్చుకూ చెక్​ పట్టుకొని కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. 

స్కూల్​కు పెట్టాల్సిన ఖర్చు చిన్నదే అయినా బ్యాంక్​దాకా వెళ్లేందుకే ఎక్కువ ఖర్చు అవుతోందని హెచ్ఎంలు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో  ఇదే పరిస్థితి నెలకొంది. మోడల్ స్కూల్స్, ట్రైబల్​ స్కూల్స్, స్పోర్ట్స్​స్కూళ్లకు సైతం ఈ రూల్​విధించారు.​ కాగా, ఈ అకడమిక్​ఇయర్​కు సంబంధించిన డబ్బులు నవంబర్​లో విడుదలయ్యాయి. అప్పటికే ఆరు నెలలు గడిచిపోవడంతో హెచ్​ఎంలు తమ జేబుల్లోంచి మెయింటనెన్స్​ పెట్టుకున్నారు. ఇప్పుడు వారు ఖర్చు పెట్టిన డబ్బును కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు.