మార్కెట్​ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం​

మార్కెట్​ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం​
  • మార్కెట్​ కమిటీ పోస్టుల కోసం ఎమ్మెల్యేల పంతం​
  • నాలుగేళ్లుగా ఊరిస్తున్న నామినేటెడ్​ పదవులు

నిజామాబాద్, వెలుగు: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్​కమిటీ పాలకవర్గం ఎంపిక కొలిక్కి రావడం లేదు. 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన కమిటీ పదవుల కోసం నలుగురు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. వారి మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు ప్రచారం జరుగుతున్నా.. కమిటీ ఏర్పాటు కొలిక్కి రావడం లేదు. తము సిఫార్సు చేసిన వ్యక్తులకే పదవులు ఇవ్వాలని ఎవరికి వారే పట్టుబట్టడంతో భర్తీకి అడుగు ముందుకు పడడం లేదు. దాదాపు నాలుగేళ్ల నుంచి పాలకవర్గాన్ని నియమించలేదు. దీంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. 

రూ.23 కోట్ల ఇన్​కమ్​..

రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం తర్వాత నిజామాబాద్​మార్కెట్​కమిటీ ఇన్​కమ్ లో ​ మూడో స్థానంలో ఉంది. ఏటా రూ.2,300 కోట్ల టర్నోవర్​ జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల విలువలో ఒక శాతం పన్ను మార్కెట్​కు జమ చేస్తారు. తద్వారా మార్కెట్​కు ప్రతీ సంవత్సరం రూ.23 కోట్ల ఆదాయం వస్తుంది. 50 మంది లైసెన్స్​ ట్రేడర్లు, 92 మంది ఏజెంట్లు, డిప్యూటీ డైరెక్టర్ ​స్థాయిలోని కార్యదర్శి (సెలక్షన్ ​గ్రేడ్), 100 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా పసుపు వ్యాపారం సాగుతుంది. 

2019, జులై నుంచి ఖాళీ

చైర్మన్, వైస్​ చైర్మన్​తో పాటు కమిటీలో 18 మంది డైరెక్టర్లు ఉంటారు. 2019, జులై వరకు దివ్య కులాచారి చైర్​పర్సన్​ పదవిలో ఉన్నారు.​ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్​కు అనుచరుడైన దినేశ్​ కులాచారి భార్యకు ఈ పదవి ఇచ్చారు. పదవీకాలం పూర్తికాగానే ఆయన బీజేపీలోకి వెళ్లారు. బాజిరెడ్డి మరో ఫాలోవర్, నవీపేటకు చెందిన చంద్రశేఖర్​రెడ్డికి వైస్​ చైర్మన్​ పదవి కట్టబెట్టారు

ఉమ్మడి లిస్టు సాధ్యమేనా?

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని నామినేటెడ్​ పోస్టులను ఎవరికైనా ఇవ్వొచ్చు. నిజామాబాద్​ మార్కెట్​ కమిటీ  పరిధి 4 నియోజకవర్గాలకు విస్తరించి ఉన్నందున నలుగురు ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో గవర్నమెంట్​కు సిఫార్సు లేఖ ఇస్తేనే సానుకూల ఆర్డర్​ వెలువడుతుంది. ఇప్పుడు జిల్లాలో కీలకమైన పోస్టు విషయంలో నలుగురు ఎమ్మెల్యేల పంతం ఆశావహులకు తలనొప్పిగా మారింది. అర్బన్​ఎమ్మెల్యే గణేశ్​గుప్తా తన ఫాలోవర్​ కోసం చైర్మన్​పదవి డిమాండ్​ చేస్తున్నాడు. మాక్లూర్, నందిపేట మండలాల పక్షాన ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డి తన అనుచరుడిని పదవిలో కూర్చొబెట్టాలని మొండిగా ఉన్నారు. రూరల్​నియోజకవర్గం కమిటీలో అధిక భాగం ఉన్నందున ఈసారి కూడా తను ప్రతిపాదించిన వ్యక్తులకు రెండు పదవులు ఇచ్చి, డైరెక్టర్ పోస్టులు ఇతరులు తీసుకోవాలని బాజిరెడ్డి ప్రపోజల్​ పెడుతున్నారు. దీనికి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదు. జిల్లా పోస్ట్​తమ నియోజకవర్గానికే ఇవ్వాలని బోధన్ ​ఎమ్మెల్యే షకీల్​సైతం వాదన వినిపిస్తున్నారు.

ఈ-నామ్​గుర్తింపు

ప్రపంచంలో ఏ దేశమైనా ఆన్​లైన్​ ద్వారా నిజామాబాద్​మార్కెట్​లో పసుపు కొనుగోలు చేసే సౌలత్​ఉంది. 2017లోనే భారత ప్రభుత్వం ఈ మార్కెట్​కు  ఈ–నామ్​గుర్తింపునిచ్చింది. దేశవ్యాప్త ఐడెంటిటీ ఉన్న కమిటీ పాలకవర్గంలో పదవులు పొందడానికి లీడర్లు తహతహలాడుతున్నారు. చైర్మన్, వైస్​చైర్మన్​ పోస్టులకు భారీ డిమాండ్​ఉంటుంది. ఎమ్మెల్యేలు తమకు నమ్మకమైన ఫాలోవర్లకు ఈ పదవులు ఇప్పిస్తారు. ఈ పదవుల కోసం కొన్ని సందర్భాల్లో అనధికార వేలం కూడా నిర్వహిస్తారు. సదరు పదవులు తమ నియోజకవర్గాలకు దక్కించుకోవాలని నిజామాబాద్​అర్బన్, రూరల్, ఆర్మూర్, బోధన్​ఎమ్మెల్యేలు పట్టుదలగా ఉన్నారు.