రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత

రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఆదిలాబాద్ లో 10.5 డిగ్రీలు నిర్మల్ జిల్లాలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో నిన్న  7.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్ లో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పనులకు వెళ్లేవారు, మున్సిపల్ కార్మికులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. 

రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటుతున్న చలి తీవ్రత తగ్గడం లేదంటున్నారు స్థానికులు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చలి, పొగ మంచుతో  సీజనల్  వ్యాధులతో పాటు శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయంటున్నారు.

తెల్లవారు జామున పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహాలు కనిపించడం లేదంటున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నారాయణఖేడ్ తో పాటు పలు మండలాల్లో  చలి తీవ్రత పెరుగుతుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.