- అనుకూలంగా వెదర్..
- ఇవాళ (మే16) అండమాన్‌లోకి ప్రవేశం
- జూన్ తొలివారం నాటికి రాష్ట్రంలోకి వచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు:ఎల్‌నినో ఆందోళనలు, వర్షాభావ పరిస్థితుల అంచనాల మధ్య భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు సూపర్ ఫాస్ట్ వేగంతో కదులుతున్నాయని తెలిపింది. మే 26 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల రాకపై శుక్రవారం ఐఎండీ తాజా అంచనాలు విడుదల చేసింది.
మే 26 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని చెబుతున్న ఐఎండీ.. ఓ నాలుగు రోజులు అటూఇటుగా నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కాగా, నిరుడు మే 27న రుతుపవనాలు వస్తాయని ఐఎండీ అంచనా వేయగా.. అంచనాలకన్నా వారం ముందే అంటే మే 21నే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి.
దీంతో రాష్ట్రంలోకి కూడా జూన్ తొలి వారంలోనే రుతుపవనాలు ఎంటరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. నిరుడు మే 26నే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించిన నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా త్వరగానే రుతుపవనాలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
- వాతావరణ పరిస్థితులు అనుకూలం
నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఇప్పటికే రుతుపవనాల మేఘాలు కమ్ముకున్నాయని, శనివారం నాటికి అవి అండమాన్నికోబార్దీవుల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం అందుకు వెదర్ సిస్టమ్స్ కూడా ఏర్పడుతున్నాయని తెలిపింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నదని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడిందని వెల్లడించింది.
శనివారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కొత్తగూడెం, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం ఆరు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌లో 44.3, నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 44.3, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 44.1, జగిత్యాల జిల్లా రాఘవపేట, నిర్మల్ జిల్లా కుంటాలలో 44 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. 8 జిల్లాల్లో 43 డిగ్రీలకుపైగా, 14 జిల్లాల్లో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీ పరిధిలో అత్యధికంగా మల్లాపూర్‌లో 42.5 డిగ్రీలు, సరూర్‌నగర్, దూధ్ఖానాలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
