Asia Cup 2025: ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్.. ద్వైపాక్షిక సిరీస్‌కు నో ఛాన్స్: క్రీడా మంత్రిత్వ శాఖ

Asia Cup 2025: ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్.. ద్వైపాక్షిక సిరీస్‌కు నో ఛాన్స్: క్రీడా మంత్రిత్వ శాఖ

యూఏఈ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ తొలగింది. పాకిస్తాన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ లకు భారత ప్రభుత్వం స్పష్టంగా నిరాకరించింది. అయితే ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ లు ఆడుతుందని స్పష్టం చేసింది. "ఒకరి దేశంలో జరిగే ద్వైపాక్షిక మ్యాచ్ ల విషయానికి వస్తే భారత జట్టు పాకిస్థాన్ కు వెళ్ళదు. అదే విధంగా పాకిస్థాన్ ఇండియాకు రావడానికి అనుమతి లేదు. అయితే బహుళ జట్లు ఆడే టోర్నీలో మాత్రం పాకిస్థాన్ తో ఇండియా ఆడుతుంది". అని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.

క్రికెట్ విషయానికొస్తే.. ఆతిథ్య దేశంతో సంబంధం లేకుండా రెండు జట్లు తటస్థ వేదికలలో ఆడేందుకు ఇండియా, పాకిస్థాన్ అంగీకరించాయి. దీని ప్రకారం యూఏఈలో ఆసియా కప్ జరగనుండడంతో ఒకరి దేశానికీ మరొకరు వెళ్లే అవసరం లేదు. రెండు జట్లు కూడా దుబాయ్ వేదికగా జరగబోయే తటస్థ వేదికపై ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. మొదటగా ఆసియా కప్ కు ఇండియా ఆతిధ్య మిచ్చిన ఆ తర్వాత యూఏఈకి మార్చబడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇండియా, పాకిస్థాన్ దుబాయ్ వేదికగా తలపడ్డాయి. 

క్రికెట్‎లో ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‎కు ఉండే క్రేజ్ వేరే. మరే మ్యాచుకు ఉండని ఆదరణ దాయాదుల పోరుకు ఉంటుంది. టెస్ట్, వన్డే, టీ20  ఫార్మాట్ ఏదైనా సరే.. ఇండియా, పాక్ జట్లు తలపడుతున్నాయంటే ఈ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్సే కాకుండా.. యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి పోరే మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. సెప్టెంబర్ 14 న దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ జరగనుంది. రెండు జట్లు ఫైనల్ కు వస్తే మూడు మ్యాచ్ లు చూసే అవకాశం కలుగుతుంది. 

కొంతకాలంగా పహల్గాంలో మారణహోమం సృష్టించినా కూడా పాకిస్తాన్‎తో ఆసియా కప్‎లో కూడా భారత్ ఆడకూడదనే డిమాండ్స్  రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‎తో ఎక్కడ ఎప్పుడు పోటీ పడ్డ భారతే గెలుస్తుందని.. అందులో డౌటే లేదని.. కాకపోతే ఇటీవల ఇరుదేశాల చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్‎లో పాక్‏తో మ్యాచ్ ఆడొద్దని బీసీసీఐకి సూచిస్తున్నారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ లో పాకిస్థాన్ ఛాంపియన్స్ పై ఇండియా ఛాంపియన్స్ రెండు మ్యాచ్ లు ఆడకుండా లీగ్ మధ్యలోనే వైదొలిగింది.