జడ్చర్ల చైర్​పర్సన్​పై అవిశ్వాసానికి రంగం సిద్ధం

జడ్చర్ల చైర్​పర్సన్​పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
  • నోటీసు ఇచ్చేందుకు సొంత పార్టీ కౌన్సిలర్ల ప్లాన్

జడ్చర్ల, వెలుగు : బీఆర్ఎస్ కు చెందిన జడ్చర్ల మున్సిపల్​ చైర్​పర్సన్​ను గద్దె దింపేందుకు ఆ పార్టీ కౌన్సిలర్లే ప్లాన్​ చేస్తున్నారు. ఇప్పటికే సమావేశమైనవారు, రెండు, మూడు రోజుల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జడ్చర్ల మున్సిపాల్టీలో 27 మంది కౌన్సిలర్లు ఉండగా, అందులో బీఆర్ఎస్​​నుంచి 20 మంది, కాంగ్రెస్​ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. చైర్ పర్సన్​గా దోరేపల్లి లక్ష్మి, వైస్​ చైర్​పర్సన్​గా పాలాది సారికను ఎన్నుకున్నారు. పాలకవర్గంపై రెండేండ్ల నుంచి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

బీఆర్ఎస్​ కౌన్సిలర్లు, చైర్​పర్సన్​ వర్గీయుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. చైర్​పర్సన్​ వర్గీయుల ఒంటెద్దు పోకడతో తాము నష్టపోతున్నామని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి దృష్టికి పలువురు కౌన్సిలర్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అసంతృప్తికి గురైన ఆ పార్టీకి చెందిన 19 మంది కౌన్సిర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

నాలుగు రోజుల కింద రహస్యంగా సమావేశమై అవిశ్వాసంపై మాజీ ఎమ్మెల్యేతో చర్చించినట్లు సమాచారం. ఆయన దీనికి మద్దతు ఇవ్వకపోవడంతో పాటు కౌన్సిలర్ల సొంత నిర్ణయానికే వదిలేసినట్లు ఓ కౌన్సిలర్ ద్వారా తెలిసింది. రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకొని, ఒకేసారి చైర్​పర్సన్, వైస్​ చైర్​పర్సన్​పై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.