
- బీసీ గురుకులాల్లో 2,591 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
- ఆర్ అండ్ బీలో ప్రమోషన్లు, కొత్తగా 472 పోస్టుల మంజూరు
- రోడ్ల రిపేర్లకు అదనంగా రూ.1,865 కోట్లు
- కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు !
- రాష్ట్ర కేబినెట్ ఆమోదం
హైదరాబాద్, వెలుగు: పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరీల్లో 3,966 పోస్టులు, బీసీ గురుకులాల్లో వివిధ విభాగాల్లో 2,591 పోస్టుల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లతో పాటు కొత్తగా 472 అడిషనల్ పోస్టులు మంజూరు చేసింది. కాలనుగుణంగా చేపట్టే రోడ్ల రిపేర్ల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,865 కోట్లు అదనంగా ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం రాష్ట్ర కేబినెట్ ప్రగతి భవన్లో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని కేబినెట్లో చర్చించారు.
డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్ ఆదేశించింది. వీటితోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త సర్కిల్ లు, కొత్త డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
డీఈఈ నుంచి సీఈ వరకు నిర్ణయాధికారాలు
కింది స్థాయి డీఈఈ నుంచి పైస్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. డీఈఈకి ఒక్క పనికి రూ.2 లక్షలు (ఏడాదికి 25 లక్షలు), ఈఈకి రూ. 25 లక్షల వరకు (ఏడాదికి రూ.1.5 కోట్లు), ఎస్ఈ పరిధిలో రూ.50 లక్షలు (ఏడాదికి రూ.2 కోట్లు), సీఈ పరిధిలో రూ. 1 కోటి వరకు (ఏడాదికి రూ.3 కోట్ల వరకు) పనులు చేసేందుకు ఆమోదం తెలిపింది. అవసరమైతే నామినేషన్ పద్ధతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకు ఏడాదికి రూ. 129 కోట్లు ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇదే పద్ధతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది. రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో తక్షణమే పనులు చేపట్టేందుకు రూ. 635 కోట్ల నిధులను కేటాయించింది.
రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్ అండ్ బీ శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను మంజూరు చేసింది. ఇందులో కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు,12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డీఈఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. నియామక ప్రక్రియ చేపట్టడంతో పాటు వెంటనే పదోన్నతులు పూర్తి చేయాలని ఆదేశించింది.
ఢిల్లీ టూర్ తర్వాతే అసెంబ్లీ సమావేశాలు!
ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇటీవల నిర్ణయించినందున సమావేశాలను ఏ తేదీ నుంచి మొదలుపెట్టాలనే దానిపై రాష్ట్ర కేబినెట్లో చర్చించారు. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత సమావేశాలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించారు. దళితబంధు, సొంత జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం వంటి వాటికి నిధుల సర్దుబాటు, అమలుపై డిస్కస్ చేశారు. ఈ యాసంగి రైతుబంధు సొమ్ము రూ.7,500 కోట్లు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి జమ చేయాలనే దానిపైనా చర్చించారు. ఈ నెలాఖరులో లేదా జనవరిలో రైతుబంధు ఇచ్చే విధంగా ప్లాన్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. పోడు భూములకు పట్టాలు, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులపై కూడా చర్చించారు.