లోకల్ బాడీల్లో ఎన్నికలకు మూడేండ్లుగా అనుమతివ్వని సర్కార్

లోకల్ బాడీల్లో ఎన్నికలకు మూడేండ్లుగా అనుమతివ్వని సర్కార్
  • మూడేండ్లుగా ఎన్నికలకు అనుమతి ఇవ్వని సర్కార్
  • రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకుంటలే 
  • మరో 14 నెలల్లో ముగియనున్న స్థానిక సంస్థల టర్మ్ 
  • ఎన్నికలు పెడితే వ్యతిరేకత బయటపడుతుందని టీఆర్ఎస్ భయపడుతున్నట్లు విమర్శలు 

హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ అనుమతివ్వడం లేదు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లలో 6 వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నిసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాదాపు మూడేండ్ల నుంచి ఏదో ఒక కారణం చెబుతూ ఎన్నికలను ఆలస్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితర కలిపి మొత్తం 6,024 సీట్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోయిన వారం మరోసారి సర్కార్ కు లేఖ రాశామని చెప్పారు. కాగా, రాష్ర్టంలో 2017 డిసెంబర్ లో లోకల్ బాడీల ఎన్నికలు జరిగాయి. 2018 జనవరి, ఫిబ్రవరిలో ప్రమాణస్వీకారాలు జరిగాయి. అంటే లోకల్ బాడీల టర్మ్ ఇంకో 14 నెలలు మాత్రమే మిగిలి ఉంది. 

ఎన్నికల సామగ్రి రెడీ.. 

ప్రభుత్వం ఎన్నికలకు అనుమతి ఇస్తుందనే ఉద్దేశంతో పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ అవసరమైన సామగ్రి సిద్ధం చేసుకుంది. బ్యాలెట్ పేపర్లు ముద్రించడంతో పాటు ఇతర స్టేషనరీ సమకూర్చుకుంది. వీటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ సామగ్రిని ఇటీవల హిమాయత్ నగర్ లోని పంచాయతీ రాజ్ ఆఫీస్ కు చేర్చారు. సీట్లు ఖాళీగా ఉన్న చోట ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల అధికారులు రెడీగా ఉన్నారు. 

వ్యతిరేకత బయటపడ్తదనే వాయిదా!  

లోకల్ బాడీల్లో వేలాది సీట్లు ఖాళీగా ఉన్నా.. మూడేం డ్ల సంది ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పంచాయతీలకు నిధులు సకాలంలో ఇవ్వకపోవడం, పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడం, నిధులపై ఫ్రీజింగ్ పెట్టడం తదితర అంశాల్లో సర్కార్ పై సర్పంచ్ లు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో స్థానిక సంస్థల్లోని ప్రజాప్రతినిధుల్లో సర్కార్ పై ఉన్న వ్యతిరేకత బయటపడుతుందనే ఎన్నికలు నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో జరిగిన లోకల్ బాడీల ఎన్నికల్లో 95 శాతం టీఆర్ఎస్సే గెలుచుకుంది. ఇతర పార్టీల నుంచి గెలిచినోళ్లు సైతం అధికార పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ గెలిచే చాన్స్​లు ఉన్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

త్వరలో నిర్వహిస్తం..  

లోకల్ బాడీల్లోని ఖాళీ సీట్లకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీనిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయమై ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసినం. రెండేండ్ల పాటు కరోనా, ఇటీవల మునుగోడు బై పోల్ ఉండడంతో ఎన్నికల నిర్వహణకు అనుమతి రాలేదు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తం. అనుమతి ఇస్తే వచ్చే నెలలో లేదా జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తం. 
- పార్థసారథి,   కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం