థర్మల్ పవర్ ప్లాంట్ల జోలికి వద్దు.. రెండో దశ ఎన్టీపీసీ ఒప్పందంపై సర్కార్ వెనక్కి!

థర్మల్ పవర్ ప్లాంట్ల జోలికి వద్దు.. రెండో దశ ఎన్టీపీసీ ఒప్పందంపై సర్కార్ వెనక్కి!
  • ఐదేండ్లలో భారీగా పెరగనున్న యూనిట్ కాస్టే కారణం
  • ఎన్టీపీసీని పట్టించుకోని గత బీఆర్ఎస్ సర్కార్
  • కొత్త పవర్ పాలసీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు
  • ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అసెంబ్లీలో ముసాయిదా
  • హైడల్, సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యం

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ వినియోగం, యూనిట్ ధరను దృష్టిలో పెట్టుకుని థర్మల్ పవర్ ప్లాంట్ల జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. అందులో భాగంగా ఎన్టీపీసీ రెండో దశ విద్యుత్ ఒప్పందం చేసుకోవద్దనే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తున్నది. విద్యుత్ ఉత్పత్తి, కొనుగోళ్లపై కొత్త పాలసీ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కొత్త విద్యుత్ విధాన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో పెట్టే అవకాశం ఉంది. 2032 వరకు అవసరమయ్యే విద్యుత్ అంచనాలతో పాలసీ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా 15,623 మెగావాట్ల విద్యుత్ పీక్ లోడ్ డిమాండ్ ఉన్నది. 2031 – 32 నాటికి 27,059 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటుందని విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 

ప్రత్యామ్నాయ మార్గాల వైపు  ప్రభుత్వం ఫోకస్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ప్లాంట్ పూర్తి కావాలంటే ఇంకా ఐదేండ్ల సమయం పడ్తుంది. ప్రస్తుతం ఎన్టీపీసీలో ఒక యూనిట్ ధర రూ.5.90 ఉంది. రెండో దశ ప్లాంట్ పూర్తయ్యే సరికి యూనిట్ కాస్ట్ రూ.8 నుంచి రూ.9 దాకా పెరుగుతుందని ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి. ఈ భారం మొత్తం ప్రజలపై పడుతుందని, అలాంటప్పుడు అంత ఖరీదైన విద్యుత్ కోసం ఒప్పందం చేసుకోకపోవడమే మంచిదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. థర్మల్ ప్లాంట్లకు బదులు తక్కువ ధరకు విద్యుత్ సప్లై చేసే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. థర్మల్ పవర్ జోలికి వెళ్లకుండా సోలార్, హైడల్, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజ్ వినియోగించుకునేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది.

భారీగా పెరగనున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుబడి అంచనా


తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే పెట్టుబడి పెడితే  అయిదేండ్ల కిందటే ఎన్టీపీసీ విద్యుత్ అందుబాటులోకి వచ్చేది. విద్యుత్ కొనుగోళ్ల ఖర్చు కూడా తగ్గేది. కానీ, గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్టీపీసీ ప్లాంట్ల స్థాపనలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వం తలపెట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్లాంట్ ఏర్పాటులో జరిగిన అవినీతి కారణంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి రూ.6 కోట్ల ఖర్చయ్యే పెట్టుబడి అంచనా కాస్త.. ఇప్పుడు రూ.10 కోట్లకు చేరింది. ఈ ప్లాంట్ పూర్తి కావాలంటే రూ.15వేల కోట్ల భారం పడ్తున్నట్టు ప్రాథమికంగా తేలింది.

దేశానికే ఆదర్శంగా ఉండేలా పవర్ పాలసీ

తక్కువ ధరతో పాటు లాభసాటి వ్యాపార మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను కొత్త విద్యుత్ పాలసీలో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. అధునాతన పద్ధతులతో పాటు విద్యుత్ చట్టాలకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తున్నది. తక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి చేయడం, రెన్యూవబుల్ ఎనర్జీ తయారీ, లో కాస్ట్​కు పవర్ సరఫరా చేసే ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించడం, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో పవర్ ప్రొడ్యూస్, సప్లై వ్యవస్థలతో కొత్త పాలసీ తయారు చేయిస్తున్నది. ప్రజలపై భారం పడకుండా.. దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణ పవర్ పాలసీ ఉండేలా ముసాయిదా తయారీకి కసరత్తు చేస్తున్నది. ఎక్కువ మొత్తంలో రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి, సప్లై చేసేందుకు ముందుకొచ్చే ప్రైవేటు కంపెనీలతో డీల్ చేసుకోవాలని భావిస్తున్నది.

హాస్టళ్లు, కాలేజీలపై సోలార్ ప్లాంట్లు

రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్లు రెండేండ్లలోనే అందుబాటులోకి వస్తాయి. సోలార్ పవర్​పై సర్కార్ ఎక్కువ ఫోకస్ పెడ్తున్నది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 దాకా సోలార్ పవర్ వినియోగించుకోవాలని భావిస్తున్నది. అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కొత్త పాలసీలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సర్కార్ భావిస్తున్నది. గవర్నమెంట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, హాస్టళ్లు, ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ యూనిట్లు నెలకోల్పేలా కొత్త విద్యుత్ పాలసీని పరిశీలిస్తున్నది. ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు, నిపుణుల సూచనలు తీసుకోవాలని భావిస్తున్నది.

హైడల్ పవర్​పై ఫోకస్

రాష్ట్రంలో ఉన్న మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా పంప్డ్ స్టోరేజీ విద్యుత్​ను ఉత్పత్తి చేసే అవకాశాలపై ప్రభుత్వం స్టడీ చేస్తున్నది. ఇప్పటికే ఉన్న రిజర్వాయర్లతో పాటు నిర్మాణంలో ఉన్న వాటి పరిధిలో 6,732 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి. హిమాచల్​లో హైడల్ పవర్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వమే అక్కడ భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నది. పెట్టుబడుల భారం తగ్గేందుకు ప్రైవేటు కంపెనీలతో కలిసి ముందుకెళ్లాలని అనుకుంటున్నది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్​తో దీనిపై చర్చించినట్టు సమాచారం

పదేండ్లైనా పట్టించుకోని బీఆర్ఎస్ సర్కార్

పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన ఎన్టీపీసీ 4వేల మెగావాట్ల విద్యుత్ పదేండ్లు అయినా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇప్పటి దాకా 1,600 మెగావాట్ల ప్లాంట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇటీవలే ప్రారంభించిన రెండో దశ 2,400 మెగావాట్ల ప్లాంట్ పూర్తి కావాలంటే మరో ఐదేండ్లు పడ్తుంది. అందులో 85% కరెంట్​ను రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాలనుకుంటున్నది. దీంతో యూనిట్ కాస్ట్ భారీగా పెరుగుతుంది. పదేండ్లలో అందుబాటులోకి వచ్చిన అధునాత టెక్నాలజీతో పాటు రెన్యూబుల్ ఎనర్జీ ఉత్పత్తి కారణంగా ఒక్కో యూనిట్ రూ.2 నుంచి రూ.4లోపు వస్తున్నది. అలాంటప్పుడు ఎన్టీపీసీ వద్ద ఎక్కువ ధర పెట్టి కరెంట్ కొంటే డిస్కమ్​లు భారీగా నష్టపోతాయని రాష్ట్ర సర్కార్ కు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. దాదాపు 25 ఏండ్ల పాటు ఉండే కొనుగోలు ఒప్పందంతో రాష్ట్ర ప్రజలపై ఆర్థికభారం పడే అవకాశం ఉంది.