అన్నదాతలు ఆలోచిస్తూ అడుగులు వేయాలి

అన్నదాతలు ఆలోచిస్తూ అడుగులు వేయాలి

రైతులు యాసంగి సీజన్​లో వరి వేయొద్దని, ఒకవేళ వేసినా ప్రభుత్వానికి సంబంధం లేదని, కొనుగోలు సెంటర్లు పెట్టబోమని ప్రకటించిన రాష్ట్ర సర్కారు.. కేంద్రం వడ్లు సేకరించకుంటే ఉద్యమించేందుకు సిద్ధమవుతుండటం బాధాకరం. ఇది రైతులను మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే కన్పిస్తోంది. వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లోనూ వడ్ల కొనుగోళ్లపై ఇదే తరహా పోరాటాలు చేసిన టీఆర్ఎస్​ ప్రభుత్వం ధాన్యం సేకరణ ఆలస్యం చేసి రైతుల ప్రాణాలు బలిగొంది. ఈ యాసంగిలో వరి సాగు చేయొద్దని సీఎం కేసీఆర్‌‌‌‌, వ్యవసాయ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సహా మొత్తం కేబినెట్, ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యవసాయ శాఖ పదే పదే రైతులను హెచ్చరించారు. కేంద్రం బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌ కొనుగోలు చేయబోమని చెప్తున్నదని, కాబట్టి వరి సాగు వద్దే వద్దని చెప్పారు. అప్పుడు వరి సాగే వద్దన్న ప్రభుత్వం.. ఇప్పుడు వడ్లు కొనుగోలు చేయాలని కేంద్రంపై పోరాటం చేస్తామంటూ రైతుల పేరుతో రాజకీయాలకు సిద్ధపడుతోంది. ప్రభుత్వ తీరును రైతులంతా నిశితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈసారి వడ్లకు ప్రభుత్వ మద్దతు ధరతో సంబంధం లేకుండా మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. అన్నదాతలు ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేయాలి.

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్​అన్ని దేశాలపై పడింది. అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా కనీస మద్దతు ధర కంటే ఎక్కువే ఉన్నాయి. ఉదాహరణకు పల్లికి ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర రూ.5500 కాగా ప్రస్తుతం మార్కెట్​లో రూ.9 వేల వరకు ఉంది. పత్తి, మిర్చి లాంటి పంటలకు కూడా మద్దతు ధరతో పోలిస్తే మార్కెట్​ధరే బాగుంది. వంట నూనె కిలో వంద నుంచి 250 రూపాయలకు ఎగబాకుతున్న ఈ సందర్భంలో ధాన్యం ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ధరకు మించి ఎక్కువ రేటు ​వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వడ్ల ఉప ఉత్పత్తులైన తవుడు, నూకల రేట్లు పెరుగుతున్నాయి. బియ్యం పైపొర నుంచే రైస్​బ్రాన్​ ఆయిల్​తయారు చేస్తారు. కాబట్టి ఈసారి ధాన్యానికి ధర ఎక్కువే పలికే అవకాశం ఉంది. పైగా ఉత్పత్తి గతం కంటే తగ్గనుంది. రైతులు పండించిన పంటకు మార్కెట్​లో మంచి ధర రానున్న ఈ నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బ తీస్తూ మద్దతు ధర మాత్రమే లభించే అవకాశం ఉందని అధికార పార్టీ అపోహలు సృష్టిస్తోంది. ఇది చాలా దురదృష్టకరం. రైతులను మానసికంగా కుంగదీస్తూ వారి పంటకు ధర రావడంలో మోకాలు అడ్డు పెడుతోంది. 

అగ్గువకు అమ్ముకోవద్దు..

డాలర్​తో రూపాయి మారక విలువ తగ్గడం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగిన సందర్భంలో దేశీయంగా అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ ఈ పరిస్థితుల్లో ఆహార పంటల ధరలో భారీ పెరుగుదల కన్పిస్తోంది. క్రూడ్ ఆయిల్ కి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉత్పత్తిలో వడ్లు పట్టగా వచ్చే నూకలు ఒక ముఖ్యమైన ముడిసరుకు. నూకలకు మార్కెట్​లో ధర పెరిగిన విషయం రైతులు గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో వడ్ల రైతులతో రాజకీయ నాయకులు ఆడుతున్న రాక్షస క్రీడని అన్నదాతలు పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఆరుగాలం శ్రమించి వేల రూపాయలు పెట్టబడి పెట్టి పండించిన వడ్లను ఎట్టి పరిస్థితుల్లో అగ్గువకే తెగ నమ్ముకునే ప్రయత్నం చేయొద్దు. పంట నూర్పిడి తర్వాత టార్పాలిన్ లాంటి వాటిని సమకూర్చుకొని ధాన్యాన్ని సరైన పద్ధతిలో నిల్వ ఉంచుకోవాలి. దొడ్డు రకం వడ్లకు క్వింటాలు రూ. 2500, సన్నరకం ధాన్యానికి రూ. 3000 లేదా అంతకు మించి మాత్రమే అమ్ముకునేందుకు ప్రయత్నించాలి.

గోదాముల్లో నిల్వకు చాన్స్​ఇయ్యాలె..

రైతుల మేలుకోసం రాష్ట్రంలో పెద్ద మొత్తంలో గోదాముల నిర్మాణం చేపట్టామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం వరి ధాన్యాన్ని రైతులు గోదాముల్లో నిల్వ ఉంచుకునే వెసులుబాటు కల్పించాలి. వాటి ద్వారా ప్రభుత్వం బ్యాంకుల నుంచి వారికి రుణాలు ఇవ్వడానికి సహకరించాలి. ధాన్యం నిల్వ ఉంచడానికి పట్టాదారు పాస్ పుస్తకం కావాలని, మరొకటి తేవాలని ఇబ్బంది పెట్టకుండా.. సాధారణ రైతులతోపాటు కౌలు రైతులకు సైతం రైతు బంధు సమితుల ధ్రువీకరణతో పంటను అమ్ముకునే వరకు గోదాముల్లో నిల్వ ఉంచుకునే అవకాశం ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల రైతులు ఈసారి యాసంగిలో కూడా గతం కంటే అధిక మొత్తంలో సన్న రకం వరి వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో  తెలంగాణ వ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతున్నది. తద్వారా 83 లక్షల టన్నుల బియ్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాబట్టి పండిన ధాన్యానికి మార్కెట్​లో మంచి ధర వస్తుందని గమనించి కంటికి రెప్పలా కాపాడుకొని 
అమ్ముకుంటేనే రైతులకు మేలు. 

ఒకేసారి మార్కెట్​కు వద్దు..

సన్నరకం బియ్యం ఉప ఉత్పత్తుల నుంచి తయారయ్యే వంట నూనెకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉంది. అలాగే బాయిల్డ్ రైస్ తవుడు మొత్తం వంట నూనె తయారీకి అధిక మొత్తంలో ఉపయోగిస్తారు. యుద్ధం నేపథ్యంలో మార్కెట్ లో వంట నూనె ధర ఇప్పుడు రెట్టింపు అయింది. బియ్యం, నూకలు, తవుడు అన్నింటి ధరలు పెరిగిన నేపథ్యంలో ధాన్యానికి మార్కెట్​లో మంచి ధర వచ్చే అవకాశం ఉంది. 10 సంవత్సరాల కంటే ముందు కనీస మద్దతు ధర కంటే వరి ధాన్యానికి చాలా ఎక్కువ ధర మార్కెట్ లో లభించిన విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పండే బియ్యానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. చేపల చెరువుల రైతులు, కోళ్ల పరిశ్రమ, డెయిరీ పరిశ్రమలో వాడే దాణాలోనూ ధాన్యం ఉప ఉత్పత్తులనే ఎక్కువగా వాడుతారు.  రైతు సోదరులందరూ ఒకేసారి మార్కెట్ కి వెళ్లకుండా దశల వారీగా ధాన్యం అమ్ముకునే ప్రయత్నం చేయాలి. ఒకేసారి మార్కెట్​కు వెళ్లడం ద్వారా దళారులు సిండికేట్​గా మారి ధర తగ్గించే ప్రమాదముంది. పండిన పంట నిల్వ కోసం సమయం కేటాయించి వివిధ పద్ధతులు పాటిస్తూ.. వర్షాలకు తడవకుండా, రంగు మారకుండా జాగ్రతలు తీసుకోవాలి. 

- తూడి దేవేందర్​ రెడ్డి, ప్రెసిడెంట్, వైఎస్సార్​టీపీ రైతు విభాగం