టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీపై ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర సర్కార్‌‌‌‌

టీచర్‌‌‌‌ పోస్టుల భర్తీపై ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర సర్కార్‌‌‌‌
  • అధికారుల చర్చలు.. ఉన్నతస్థాయిలో సమీక్షలు
  • ఇంకా నిర్ణయం ఫైనల్‌‌ కాలేదంటున్న విద్యాశాఖ ఆఫీసర్లు
  • సీఎం ప్రకటించి ఆరు నెలలైనా పోస్టుల భర్తీపై స్పష్టత కరువు 
  • అభ్యర్థుల్లో ఆందోళన.. కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఫైర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై గందరగోళం కొనసాగుతోంది. టీఆర్టీ ద్వారా పోస్టులను నింపాలా లేక జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలా అనే దానిపై స్పష్టత రావడం లేదు. టీచర్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసి 6 నెలలవుతున్నా, ఈ పోస్టులను ఎలా నింపాలో అధికారులు తెల్చుకోలేకపోతున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. చర్చల పేరుతో కావాలనే ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. 

రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని వివిధ డిపార్ట్‌‌మెంట్లలో మొత్తం 11,150 పోస్టులను భర్తీ చేయనున్నట్టు గతంలో సర్కారు ప్రకటించింది. వీటిలో 9,300 వరకు టీచర్ పోస్టులను నింపనున్నారు. వీటిలో ప్రధానంగా ఎస్జీటీ పోస్టులు 6,360, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌‌ఏ) పోస్టులు 2,179 ఉండగా, లాంగ్వేజ్ పండిట్ 669, పీఈటీ162, ఆర్ట్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టులు 441 ఉన్నాయి. అయితే, జిల్లాస్థాయి పోస్టులన్నీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సర్కారు పెద్దలు వెల్లడించారు. కానీ, స్కూల్ ఎడ్యుకేషన్‌‌లో మాత్రం దానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 2017లో టీచర్ రిక్రూట్‌‌మెంట్ టెస్టు(టీఆర్టీ)ను టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టి పోస్టులను భర్తీ చేశారు. ఈ సందర్భంగా 8,792 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాల సంఖ్య 10 నుంచి 33కు పెరగడంతో మరోసారి పోస్టుల భర్తీపై చర్చ మొదలైంది. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సర్కారు చేసిన ప్రకటనతో మళ్లీ డీఎస్సీ ఉంటుందని అధికారులు చెప్పుకొచ్చారు. కానీ, విద్యాశాఖ అధికారులు డీఎస్సీ నిర్వహించేందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో మళ్లీ టీఆర్టీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీఎస్‌‌పీఎస్సీ అధికారులతోనూ విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అయితే, డీఎస్సీ లేదా టీఆర్టీ.. వీటిలో ఏ విధానంలో భర్తీ చేస్తే ఇబ్బందులు ఉండవనే దానిపై ఉన్నత స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిపై ఇంకా ఏ నిర్ణయం ఫైనల్ కాలేదని అధికారులు చెప్తున్నారు. 

భర్తీ ప్రక్రియ స్పీడప్ చేశాం.. 
టీచర్ పోస్టుల భర్తీపై సర్కారు సీరియస్‌‌గా ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనా అన్నారు. టీఎస్‌‌పీఎస్సీ అధికారులతో చర్చించామని, పోస్టుల భర్తీని స్పీడప్ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం బడుల్లో ఉన్న టీచర్లతోనే ఖాళీలను సర్దుబాటు చేశామని, అవసరమైతే విద్యా వాలంటీర్లను తీసుకుంటామన్నారు. పోస్టుల వివరాలు ప్రకటించినా ఇప్పటికీ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదని డీవైఎఫ్‌‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జావిద్ అన్నారు. డీఎస్సీ, టీఆర్టీనా అంటూ చర్చల పేరుతో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని పేర్కొన్నారు.