నిధుల వేటలో రాష్ట్ర సర్కార్​

నిధుల వేటలో రాష్ట్ర సర్కార్​

స్కీమ్​లకు పైసల సర్దుబాటుపై మల్లగుల్లాలు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కార్ నిధుల వేటలో పడింది. ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుండటంతో స్కీమ్​లకు పైసలు రిలీజ్ చేసేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే సర్కారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో కనీసం ఐదారు నెలలు స్కీమ్ లకు రెగ్యులర్​గా ఎంతో కొంత నిధులను సర్దుబాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే జూన్ కల్లా రూ.25 వేల కోట్ల ఫండ్స్ సమకూర్చాలని ఆఫీసర్లకు టార్గెట్ పెట్టింది. ‘‘లిక్కర్ సేల్స్ పెంచుతారో.. రిజిస్ర్టేషన్లు ఎక్కువ చేయిస్తరో.. భూములు అమ్ముతారో.. రెగ్యులరైజేషన్ స్పీడప్ చేస్తరో.. అప్పులు పుట్టిస్తరో.. ఏం చేస్తరో తెలియదు. స్కీమ్​ల కోసం రూ.25 వేల కోట్లు సమకూర్చాల్సిందే’’ అని అధికారులకు రిసోర్స్ మొబిలైజేషన్ మీద ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఎలక్షన్ టైం కల్లా సాచురేషన్ తీసుకురావాలని.. అందుకోసం నిధులు తప్పనిసరిగా అవసరమని స్పష్టం చేసినట్లు సమాచారం. 

ఎన్నికలే టార్గెట్​గా నిధుల వేట 

ఎన్నికలే టార్గెట్​గా నిధులను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే వేగంగా భూములను అమ్ముతోంది. కొత్తగా జీవో 58, 59 కింద 2020 జూన్ నాటికి కబ్జాలో ఉన్న భూముల రెగ్యులరైజేషన్​కు అనుమతులు ఇచ్చింది. రెగ్యులరైజేషన్ తో కనీసం రూ.3 వేల కోట్లు రాబట్టుకోవాలని ప్లాన్ చేశారు. లిక్కర్ సేల్స్​తో రాబోయే 3, 4 నెలల్లో ఇప్పుడు వస్తున్న దానికంటే రూ.2,500 కోట్లు ఎక్కువగా వచ్చేలా సేల్స్ పెంచాలని టార్గెట్​ పెట్టారు. భూముల అమ్మకంతో రూ. 8 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు తీసుకురావాలని చూస్తున్నారు. రిజిస్ర్టేషన్లు కూడా పెంచాలని.. రియల్ బూమ్ వచ్చేలా ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించారు. కమర్షియల్ ట్యాక్స్​వసూలు, జీఎస్టీ ఎగవేతలను గుర్తించడం ద్వారా మరికొంత సమకూర్చాలని ఆఫీసర్లకు సర్కార్ టార్గెట్ పెట్టింది. 

వస్తున్న ఆదాయం.. వడ్డీలకు, కిస్తీలకే  

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, ఇందులో ఎక్కువ మొత్తం అప్పుల కిస్తీలు, వడ్డీలు, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్​లు, రెగ్యులర్​గా నెలా నెలా ఇవ్వాల్సిన ఆసరా పెన్షన్​లకే సరిపోతున్నది. ప్రభుత్వానికి ప్రతినెలా యావరేజ్ గా ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.11 వేల కోట్లు వస్తోంది. ఇక అప్పులు కూడా యావరేజ్​గా రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్లు తీసుకుంటుంది. మొత్తం రూ.15 వేల కోట్లు అనుకుంటే అందులో ఆసరాకు దాదాపు రూ.1,000 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్​లకు రూ.4 వేల కోట్లు, అప్పుల కిస్తీలకు రూ.4 వేల కోట్లు, వాటి వడ్డీలకు రూ.1,800 కోట్లు చెల్లిస్తోంది. ఇక వివిధ ఇరిగేషన్​ ప్రాజెక్టులకు గతంలో బకాయి పడ్డ బిల్లులను కొంత మొత్తంలో క్లియర్ చేస్తున్నారు. దీంతో ఇతర ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత ఉంది.