కథ : విస్కీ

 కథ : విస్కీ

ఆ గదిలో ఒక మూలన చిన్నబెడ్. దానికి ఆనుకుని వేలాడుతూ ఏదో మెషిన్ ఉన్నాయి. ఇంకో మూల రెండు కంప్యూటర్ మానిటర్ల ముందు ఒక నర్స్ కూర్చొని ఉంది. నన్ను బెడ్ పైన కూర్చోబెట్టి నోరు బాగా తెరవమంది. ఏదో స్ప్రే నోట్లో కొట్టింది. క్షణాల్లో నా గొంతులోపల మందంగా అనిపించి స్పర్శ కోల్పోయింది. డాక్టర్ హడావిడిగా లోపలికొచ్చి నన్ను ఎడమవైపుకు తిరిగి పడుకోమన్నాడు. చెప్పినట్టు చేసి దిక్కులు చూస్తుంటే... ఒక నర్స్ నా నోట్లో ఒక కప్పులాంటి పరికరం పెట్టి నా తలని గట్టిగా అదిమి పట్టుకుంది. ఇంకో నర్స్ బెడ్ పక్కన ఉండే మెషిన్ నుండి ఒక నల్లని పొడుగాటి పైప్ తీసి దానికేదో జెల్ పూసి డాక్టర్ చేతికి ఇచ్చింది.

ఎంతమంది నోట్లో పెట్టారో? బాగా కడిగారో? లేదో? అనుకునేలోపే నా నోట్లో దూర్చేశాడు. అది కాస్త నా గొంతును కరుకుగా రాసుకుంటూ కడుపు దాకా వెళ్ళిపోయింది. ఎప్పుడో పుస్తకంలో చదివిన సామెత ఇప్పుడు నిజంగానే అనుభవిస్తున్నా. కడుపులో చేయిపెట్టి దేవినట్టుంది అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. కాసేపు అటుఇటు గెలికి, మానిటర్లో చూసి రెండు నిమిషాల తరువాత పైప్ బయటకి తీశాడు. గొంతులో నొప్పి. నోరంతా చేదు. ఛస్తే మళ్ళీ ఎండొస్కోపి చేయించుకోవద్దు అనుకుంటూ నోరు శుభ్రం చేసుకుని  డాక్టర్ పక్కకొచ్చి కూర్చున్నా. 

పోర్ట్ బాగా పరీక్షించి కడుపులో ఇన్ఫెక్షన్ సోకిందన్నాడు. కొన్ని మందులు రాసి ‘బయట చిరు తిండి, కారం- మసాలాలు, ఎసిడిటీ కలిగించేవి ఏవీ తినకూడదు. వాటితో పాటు ముఖ్యంగా చాయ్, ఆల్కహాల్ ఒక రెండు నెలల వరకు ముట్టకూడద’ని సెలవిచ్చాడు. చివరి వాఖ్యం విన్నాక గుండె పగిలినంత పనయింది నాకు. ఎందుకంటే చాయ్ నాకు ఆక్సిజన్ లాంటిది. ఆల్కహాల్ నాలో ప్రవహించే నెత్తురు వంటిది. ఈ రెండు లేకుండా రెండు నెలలు గడపాలా? హతవిధీ! ఈ కర్మ పగవాడికి కూడా రాకూడదు అనుకుంటూ మందులు తీసుకుని ఇంటిదారి పట్టా. 

దారిలో ఒకటే ఆలోచన నా మెదడుని పీక్కుతింటుంది. మా కాలేజీ బ్యాచ్ ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొందరికి పిల్లలు కూడా. ఇంకో మూడురోజుల్లో నన్ను మినహాయించి చివరిగా మిగిలినవాడి పెళ్ళి కూడా జరగబోతుంది. నాకెలాగూ ఇప్పట్లో పెళ్ళి జరిగే యోగం, చేసుకోవాలనే కోరిక లేవు. కాబట్టి దాని గురించి నాకే బాధ లేదు. నా వర్రీ అంతా ఈ పెళ్ళిలో పీకలదాకా మందు తాగలేకపోతానే అని. నా ఫ్రెండ్స్ అంతా బీర్లు, విస్కీలు తాగుతుంటే, నేను మాత్రం వాళ్ళ ముఖాలు చూసుకుంటూ లేత కొబ్బరినీళ్ళు తాగాలి. ఎస్! డాక్టర్ కూల్ డ్రింక్స్ కూడా తాగొద్దని చెప్పాడు. ఇవన్నీ తలుచుకుంటుంటే మనసెంత ఉక్కిరిబిక్కిరి అవుతుందో నాకు మాత్రమే తెలుసు. 

ఏంటి వీడింత ఎమోషనల్ అయిపోతున్నాడు? బర్రె కుడితి తాగినట్టు రోజు తాగుతాడేమో అనుకునేరు. అంత సినిమా లేదు నా దగ్గర. నేను తాగేదే నాకున్న నలుగురు కాలేజీ ఫ్రెండ్స్ కలిసినప్పుడు. మేమంతా మూడునాలుగు నెలలకోసారి హైదరాబాద్​లో కలుస్తాం. అప్పుడు రెండు బీర్లు లేదా మూడు పెగ్గులు. వాళ్ళతో తప్ప నేనెవరితో దాదాపు తాగను. అయినా ఈ నలుగురు తప్ప నేను తెలిసిన వాళ్లెవ్వరు ‘నన్ను బాగున్నావా?’ అని అడిగింది లేదు. ఓ పండుగకో, పబ్బానికో, పుట్టినరోజులకో పిలిచింది లేదు. కొందరైతే నన్ను మరిచేపోయారు. అలాగెందుకు అనడిగితే పాపం టైమ్ లేదంటారు. బిజీ పీపుల్. వాళ్ళ దగ్గర నాకోసం మాత్రమే టైమ్ లేదని నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను పట్టించుకునే అతి తక్కువమంది స్నేహితుల్లో ఒకడి పెళ్ళి జరుగుతుంటే మందు ఎదురుగా పెట్టుకుని ఒక్కచుక్క కూడా తాగలేకపోవడం కన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా?

పెళ్ళిరోజు రానే వచ్చింది. మేం ఆ పల్లెటూరు చేరుకునే సరికి పొద్దున పదకొండు అయ్యింది. పెళ్ళి మండపం వరకు నడిచి మా పెళ్ళికొడుకుగాడికి మేం వచ్చామని ముఖం చూపించి అటెండెన్స్ వేయించుకున్నాం. భోజనాలకి ఇంకా చాలా టైం పడుతుందని కబురందింది. సరేపోనీ ఫంక్షన్ హాల్లో కూర్చుందామంటే మా ఫ్రెండ్ గాడి ప్రి–వెడ్డింగ్ వీడియోని చెవులు పగిలిపోయే హై వాల్యూమ్​లో అప్పటికే వందసార్లు చూపించారు. విసుగొచ్చి కట్టగట్టుకుని అందరం వైన్ షాప్ బాట పట్టాం. ఒక విస్కీ, మూడు బీర్లు, నాలుగు ప్లాస్టిక్ పెగ్​ గ్లాస్​లు, ఒక సోడా, థమ్సప్ తీసుకున్నాం. నంజుకోవడానికి వేగించిన పల్లీలు, శనగలు, ఉడకబెట్టి మసాలా కారం చల్లిన గుడ్లు, మూంగ్ దాల్ పాకెట్లు కొని సంచిలో వేసుకున్నాం. కంగారు పడకండి ఈ రోజుకి నాకు కొబ్బరినీళ్ళే విస్కీ. ఒక బాటిల్ నిండా తెచ్చుకున్నా. ఇవన్నీ తీసుకుపోయి మా పెళ్ళికొడుకుగాడి పొలంలో ఒక చాప వేసుకుని తిష్టవేశాం.

గత పదేళ్ళలో ఇదే మొదటిసారి నా స్నేహితులు తాగుతుంటే నేను చూస్తూ కూర్చోవడం. ఇదో కొత్తరకం అనుభూతని నాకు నేనే నచ్చజెప్పుకున్నా. తాగుడు మొదలయింది. పాత జ్ఞాపకాలు, నవ్వులు, వెక్కిరింతలు, తిట్లతో కూడిన ముచ్చట్లు మాట్లాడుకుంటూ కొన్ని గంటల్లో విస్కీ బాటిల్ మొత్తం ఖాళీ చేశారు. మా స్నేహితుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీనుగాడి గురించి. వాడు తాగాక చేసే వీరంగం మామూలుగా ఉండదు. విస్కీ అయిపోగానే తెచ్చిన మూడు బీర్లలో రెండు వాడే తాగాడు. వాడి ముఖం చూశాక కచ్చితంగా వీడు ఇవ్వాళ ఏదో ఒక పెంట చేస్తాడని ఫిక్స్ అయిపోయా. అప్పటికే బాగా ఆలస్యమైంది. బాగా ఆకలేస్తోంది. నేను తప్ప అందరూ మత్తుగా మైకంలో ఊగుతున్నారు. ఎలాగోలా ఫంక్షన్ హాల్ చేరుకుని చివరి భోజనాల పంక్తిలో కూర్చున్నాం.
శ్రీనుగాడు నా పక్కనే కూర్చున్నాడు. బగారన్నం, మటన్ వడ్డించగానే తల పైకెత్తకుండా తినడం మొదలెట్టారు మావాళ్ళు. శ్రీనుగాడు రెండోసారి అన్నం పెట్టించుకుని మటన్ వేయమని సైగ చేశాడు. వడ్డించేవాడు ‘లేద’ని అడ్డంగా తలుపాడు. అంతే! మావోడికి కోపం తన్నుకొచ్చింది.

“ఓయ్! మటన్ దెమ్మంటే తేవేందసో?” అని అరిచాడు. వడ్డించేవాడు కంగారుగా మా వద్దకొచ్చి, “సారు! మీరు లేటొచ్చిర్రు. మటన్ అయిపోయింది. పప్పేసుకుంటరా?” అన్నడు.
“ఏందీ మటన్ అయిపోయిందా? పప్పేసుకోవాల్నా? ఛల్! నాకీ తిండే వద్దసల్.” అని కోపంగా ఊగిపోతూ ఆకు మడిచేశాడు.నేను వాడిని సముదాయిస్తూ, “రేయ్! లొల్లివెట్టకుండ తినుబే ఏదో ఒకటి” అన్నా. “వాడసలేం మాట్లాడుతున్నడో అర్థమైతందారా నీకు? నేనేమన్న ఆస్తులడిగినాన్రా? జర్రింత మటన్ ముక్కలడిగిన గంతే. పెట్టనికే ఏడుస్తున్నడేమిరా వీడు. దోస్తులకి మటన్ వెట్టని పెండ్లి గిదేం పెండ్లిరా? ఛల్!  నాకవసరంలె. మీరు మీరు ఏమన్న తిని సావుండ్రి. నేను వోతున్న” “ఎటు?” “ఎటోఅటు ఏట్లకి” అని అలిగి వెళ్ళిపోయాడు.మాకిది మామూలే అనుకుని తిన్నంక మండపం ముందు వేసిన కుర్చీల్లో కూర్చున్నాం. చల్లటి ఫ్యాన్ గాలికి మిగిలిన ఇద్దరు కూర్చున్న చోటే నిద్రలోకి జారుకున్నారు. చుట్టూ చూశాను. శ్రీనుగాడి జాడలేదు. వెళ్ళి ఇరవై నిమిషాలైంది ఇంకా రాలేదు. నిజంగానే ఏట్లోకే పోయాడేమోనని కంగారుపడి రోడ్డు మీదకి వచ్చి అటుఇటు చూశా. ఇంతలో సుమారు పాతికేళ్ళ వయసు కుర్రాడు నావైపు పరిగెత్తుకుంటూ వచ్చి నా ముందు ఆగి రొప్పుతున్నాడు. ఏంటని అతని వైపే చూస్తూ నిలబడ్డా.

దీనంగా మొహంపెట్టి “అన్నా! ఎవడైనా బ్లూ షర్ట్ ఏస్కున్నోడు.. ప్యాషన్ ప్లస్ బండిమీద ఇటుదిక్కేమైన వచ్చిండా?” అని అడిగాడు. “నేను బ్ల్యూ షర్ట్ ఏస్కుకున్నోని కోసమే ఎతుకుతున్న తమ్ముడు. కానీ మావోడు బైక్ తీస్కరాలే. నీకేమైంది అంత టెన్షన్ పడుతున్నవ్?” “నా బైక్ ఎవడో ఎత్తుకవోయిండన్నా.” నాకు అనుమానమొచ్చి ఇంకొన్ని పోలికలు చెప్పమన్నా. మొత్తం విన్నాక ఆ కుర్రాడిని దగ్గరికి రమ్మని పిలిచా. అమాయకంగా మొహం పెట్టి నా పక్కనొచ్చి నిలబడ్డాడు. భుజాన చేయివేసి “చూడు తమ్ముడు. నీ బండి వోయిన విషయం ఊర్ల ఎవ్వరికి జెప్పలేదుగా?” అని అడిగా. 
“లేదన్న.” “వెరీ గుడ్! ఈ విషయం మన మధ్యన్నే ఉండని. నీ బండి నీకు ఇప్పించే బాధ్యత నాది. కొంచెం ఓపిక వట్టు.” “నా బండి గురించి నీకెందుకన్నా గంత కన్సర్న్?” “నా కన్సర్న్ నీ బండిమీద గాదు తమ్ముడు. గా బండి నడిపేటోడి మీద.” “అంటే?” “అవును. నీ బండి ఎత్తుకవోయింది నేనెతుకుతున్న నా దోస్తుగాడే.” ఆశ్చర్యంలో కళ్ళు పెద్దవి చేసి, భుజం మీద నా చేయి తీసిపడేసి పక్కకు జరిగి “ఏం తమాషగుందా అన్న నీకు? ఇట్లెవని బండంటే వాని బండి ఎత్తుకవోతరా ఎవరైనా?” అని కసిరాడు.“వాడు అట్లాంటోడు గాదు తమ్ముడు. బాగా తాగున్నడు. పొరపాటున

వాని బండన్కొని తీస్కవోయింటడు.” “అట్లెట్లనుకుంటరన్న? నువ్వు మరీ జోకులేస్తున్నవ్?” “హ్మ్! వాడు తాగితే గింతే తమ్ముడు, మామూలుగుండదు. వాడెక్కువ దూరం గూడ పోలేడులేగానీ, గీ సుట్టుపక్కల ఏడ్నో ఉంటడు పా పోయి ఎతుకుదం.”  “నా బండికెవైనయ్యిందో మీరే కట్టియ్యాల ముందే జెప్తున్న.” “ఏం గాదులేగాని, అయినా నీ బండి మావోడెట్ల తీస్కపోయిండు?”రోడ్డు పక్కనుండే చిన్న హోటల్ వైపు వేలు చూపించి “బండి ఆ హోటల్ ముంగటాపి లోపలికోయొచ్చేలోపే ఎత్తుకవోయిండు” అని చెప్పాడు. “బండికి తాళమెందుకు వదిలేశినవ్ తమ్ముడు?” “ఏందో అన్న. ఇయాల నా గాచారం బాలేదు. నా కర్మ.”

“సరే సరే! అంత పెద్ద మాటలెందుకుగాని పా తొందరెతుకుదం.” ఊర్లో ఉన్న గల్లీలన్ని వెతికాం. కనిపించలేదు. దారిన కనిపించిన వాళ్ళందరిని అడిగాం.. ఆచూకీ దొరకలేదు. మేము కూర్చుని తాగిన చోట చూశాం లాభం లేదు. ఆపకుండా శీనుగాడికి ఫోన్ చేస్తూనే ఉన్నా. ఎత్తడం లేదు. అలాగే వెతుకుతూ ఊరి చివర పొలాల వరకు వచ్చాం. అలసిపోయి ఒక కల్వర్ట్ పైన కూర్చున్నాం. ఉన్నట్టుండి ఆ కుర్రాడు ఏడవడం మొదలుపెట్టాడు. చెంపల వెంబడి కన్నీళ్ళు ధారగా కారుతున్నాయి.నేను అతనివైపు చూసి “ఏంది తమ్ముడు? మొగోనివయ్యుండి ఏడుస్తున్నవ్?” అని అన్నా.
“మొగోడైతే ఏడవద్దా? నాకు ఏడుపొస్తుంది, ఏడుస్తున్న. అయితే ఏందిప్పుడు? “సరే సరే! ఏడిస్తే మాత్రం బండొస్తదా జెప్పు?”“నీకేం దెల్సన్నా నా బాధ. ఆ బండి నేనెంత కష్టపడి కొన్ననో దెల్సా? రెండ్నెల్ల ముందు మా నాయనకి తెల్వకుండ మా అమ్మ నగలు అమ్మిచ్చిన డబ్బులతో కొన్న.

ఈ విషయం తెలిశి మా నాయిన తాగొచ్చి మాయమ్మని ఎట్ల కొట్టిండో దెల్సా అన్న? ఆ దెబ్బలకి తట్టుకోలేక జరం గూడొచ్చింది. హైదరాబాద్​ల కోచింగ్ ఎగ్గొట్టి ఏడ ఇంటికొస్తనోనని ఈ విషయం నాక్కూడ జెప్పలే. మా పక్కింటోడు ఫోన్ జేశి చెప్తే అమ్మని జూశిపోదమనొచ్చిన. సచ్చినోడు ఎట్ల కొట్టిండో ఏందో అన్నం గూడ ముట్టొస్తలేదు అమ్మకి. ఓ దిక్కు హాస్పిటల్ పోదమే అంటే వద్దంటుంది. ఇంగ కనీసం బ్రెడ్ అయినా తింటదేమోనని హోటల్​కొచ్చిన, మీవోడేమొ బండెత్తుకవోయిండు. గిప్పుడీ బండి వోయినట్టు నాయినకి దెలిస్తే తాగొచ్చి అమ్మని మళ్ళీ కొడతడు” అని తన బాధనంతా చెప్పుకున్నాడు.

“అసలీ పరిస్థితిల బైకెందుకు కొన్నవ్ తమ్ముడు?” “డిగ్రీ అయిపోయినాక గ్రూప్ వన్ కోచింగ్ కోసమని నాయినని డబ్బులడిగితే ఇయ్యనన్నడు. పౌరుషం కొద్ది గొడవవడి ఒక రోజు హైదరాబాదొచ్చి కోచింగ్ల జాయిన్ అయిన. కానీ నేను తెచ్చుకున్న పైసలు సరిపోక అమ్మనడిగితే, ఉన్న నగలమ్మి డబ్బులు వంపింది. అందుల కొన్ని డబ్బులు వెట్టి ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కుని రోజు కోచింగ్ పోతానే స్విగ్గి, జొమాటోలో ఫుడ్ డెలివరీ జేశి ఏదో కొన్ని డబ్బులు సంపాదించుకుంటున్నా అన్న”“మరి మీ నాయినంత కొడుతున్నప్పుడు మీ యమ్మ ఆయన్నొదిలేశి నీతోపాటు సిటీల బతకొచ్చుగా?”“ఎన్నోసార్లు చెప్పిన నాతోపాటు సిటీకొచ్చేయమని. కానీ అమ్మ ఇనదు. సంపాదించిందంత తాగుడికి తగలేశి ఆమెని, ఇంటిని పట్టించుకొకవోయినా ఇంగా ఆయనకే వండిపెట్టి, సేవలు జేస్తది. మొగుడు తిట్టినా, కొట్టినా పతియే ప్రత్యక్షదైవం అని ఏండ్ల తరబడి గుడ్డిగ బతికేటోళ్ళకి ఏమని చెప్తం? ఎంతని చెప్తం? ఆ బ్రహ్మదేవుడొచ్చి జెప్పినా వినరన్నా యీళ్ళు” అని చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు.

“సారీ తమ్ముడు.” ఇంతలో ఆ కుర్రాడు ఒక పొలంలోని పెద్ద వేపచెట్టు వైపు చూసి “అన్నా! నా బైక్” అని అరిచాడు. పరిగెత్తుకుంటూ ఆ వేపచెట్టు దగ్గరకి చేరుకున్నాం. బైక్ చూడగానే ఆ కుర్రాడి కళ్ళలో గ్రూప్ వన్ ఎగ్జామ్ పాసయినంత ఆనందం కనపడింది. మా శ్రీనుగాడు ఆ చెట్టుకిందున్న నవారు మంచంలో నిద్రపోతూ కనిపించాడు. వాన్ని నిద్ర లేపుదామని దగ్గరికెళ్ళి చూస్తే మంచం పక్కనే వాడు పొద్దున్నుండి తాగింది, తిన్నది వాంతి చేసుకున్నది కనిపించింది. ఎంత తట్టి లేపినా మూలుగుతూ మెలికలు తిరుగుతున్నాడు తప్ప లేవడంలేదు. ఇంక లాభం లేదని వాడిని అమాంతం పైకి లేపా. వాడి ప్యాంట్ జేబు నుండి ఫోన్ కింద పడింది. మంచం మీద కూర్చోబెట్టి ఫోన్ తీసి చూశా. వాడి భార్య ఫోన్ చేస్తుంది. ఎత్తకూడదనుకున్నా. కానీ అప్పటికే ఒక ముప్పై మిస్డ్ కాల్స్ ఉండడంతో ఫోన్ కాల్ ఎత్తా.

తను మాట్లాడేలోపే “శ్రీనుగాడు పండుకున్నడమ్మ” అని చెప్పా. అటువైపు నుండి ఏడుపు మొదలైంది. “హలో? ఏమైందమ్మ?” “ఏడున్నడన్నా వాడు? మధ్యాన్నం నుండి ఫోన్ జేస్తుంటే ఎత్తకుండ తాగి పండుకున్నడా? లేపన్నా వాన్ని.” “గిప్పుడు లేశే పరిస్థితిల లేడు. ఏమైనా అర్జెంట్ ఉందా?” “పిల్లగాడు ఇంట్ల జారిపడితే నెత్తికి దెబ్బ తాకిందన్నా. ఒక్కదాన్నే ఏంజేయాలో తెల్వక అప్పట్నుండి ఆయనకి ఫోన్ జేస్తున్న. వేరే అన్నకి ఫోన్ జేశినాగూడ ఎత్తుతలేడు. మీ ఫోన్ నెంబర్లేవి నాకాడ లేవన్న.” “అయ్యో! బాబుకెట్లుందిప్పుడు? హాస్పిటల్కి తీస్కపోయినవా?”
“ఎట్లనోగట్ల నేనే తీస్కపోయి కట్టు గట్టించిన. గిప్పుడు బాగనే ఉన్నడు. జర వాడు లేశినాక నాకు ఫోన్ చెయ్యమని చెప్పన్నా.” ‘ఊ’ కొట్టి ఫోన్ పెట్టేసా.“ఏమైందన్న?” ఆ కుర్రాడు నా ముఖంలో మార్పు చూసి అడిగాడు.

కొన్ని క్షణాలు శ్రీనుగాడి మొహంకేసి చూసి గట్టిగా నిట్టూర్చా.“ఏంలే తమ్ముడు. అందరి తాగుబోతుల కథలు ఇంచుమించు ఒక్కటే అని ఈరోజే మెల్లమెల్లగా అర్థమైతుంది.”“హ్మ్! అసలు ఈ తాగినోళ్ళంతా ఇట్ల శిత్తిరిబిత్తిరి చేష్టలు ఎందుకు జేస్తరన్నా?”“ఈ లొల్లేందో ఇన్నేండ్ల కెళ్ళి తాగుతున్న నాకే అర్థం కాలే. ఇంగ నీకేం చెప్త చెప్పు?”“అంతేలే అన్న! సమస్య మనది కానప్పుడు మన కండ్లకన్నీ మామూలుగనే కనవడ్తయ్. అదే సమస్య మనకొచ్చినప్పుడే దాని అసలు నొప్పేందో తెలుస్తది.”ఆ మాట చెవిన పడ్డాక ఎవడో సలాకితో వాత పెట్టినట్టనిపించింది. తిరిగి మాట్లాడడానికి నా దగ్గర ఏ సమాధానం లేకపోయినా ఆ కుర్రాడు చెప్పిన దాన్లో నిజం ఉందనిపించింది. మనదికాని సమస్య మనకెప్పుడైనా చులకనే. చేసేదేంలేక మౌనంగా తల ఊపా. ఆ కుర్రాడి సాయంతో బైక్ మీద శ్రీనుగాడిని మాకు విడిదిగా ఇచ్చిన ఇంటి వద్దకి తీస్కపోయాం. వాన్ని అక్కడే ఒక రూమ్​లో పడుకోబెట్టి ఆ కుర్రాడికి ‘థ్యాంక్స్’, ‘ సారీ’ రెండూ చెప్పి పంపించేశా.

రాత్రికెప్పుడో శ్రీనుగాడు మత్తునుండి తేరుకున్నాడు. వాడు చేసిన ఘనకార్యాలేవీ వాడికస్సలు గుర్తులేవంట. ఇంతలో మిగిలిన స్నేహితులు ఇంకో రౌండు కోసం కొత్త విస్కీ బాటిల్ పట్టుకొని రూమ్ లోపలికి నడిచారు. ఆ బాటిల్​ని చూడగానే శ్రీనుగాడి నిద్ర ముఖం మళ్ళీ కళకళలాడింది. వాడి ముఖంలో తాగుబోతు తేజస్సు చూశాక సాయంత్రం ఆ కుర్రాడు చివరిగా నాతో అన్నమాట మళ్ళీ గుర్తుకొచ్చింది. నా ముఖం మీద వెర్రి నవ్వొకటి పుట్టింది. బుద్ధంటూ ఉంటే  జీవితంలో మళ్ళీ తాగొద్దురా బాబూ అనిపించింది. ఒక పక్క వాళ్లు తాగుతుంటే నేను మాత్రం బుద్ధిగా కొబ్బరి నీళ్ళు తాగి మందులు వేసుకుని పడుకున్నా.

ఈ హాస్పిటల్ వార్డ్​ ఎప్పుడూ ఖాళీగానే ఉంటుందని చెప్పి పంపించింది మా అమ్మ. కానీ, నా దరిద్రం కొద్ది ఊర్లో ఉన్న పేషెంట్స్​అందరూ ఈ రోజే వచ్చివాలారు. వార్డు మొత్తం సందులేకుండా కిటకిటలాడిపోతుంది. ఏకాకిలా బిక్క మొహం వేసుకుని నా వంతు కోసం ఎదురుచూస్తూ ఓ కుర్చీలో కూర్చున్నా. ఇంతలో ఒక నర్స్ నా పేరు పిలిచి లోపలికి రమ్మంది.

“అంతేలే అన్న! సమస్య మనది కానప్పుడు మన కండ్లకన్నీ మామూలుగనే కనవడ్తయ్. అదే సమస్య మనకొచ్చినప్పుడే అసలు నొప్పేందో తెలుస్తది.” ఆ మాట చెవిన పడ్డాక ఎవడో సలాకితో వాత పెట్టినట్టనిపించింది. తిరిగి మాట్లాడడానికి నా దగ్గర ఏ సమాధానం లేకపోయినా ఆ కుర్రాడు చెప్పిన దానిలో నిజం ఉందనిపించింది. మనదికాని సమస్య మనకెప్పుడైనా చులకనే. తేలికనే.

– దినేష్ ఫోన్​: 9493780714