ఎనభై లక్షల రూపాయల ఫండ్‌ కలెక్షనే టార్గెట్‌

ఎనభై లక్షల రూపాయల ఫండ్‌ కలెక్షనే టార్గెట్‌

వీళ్లిద్దరివి రెండు వేరు వేరు దారులు. కానీ, ఈ ఇద్దరి గమ్యం ఒక్కటే. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడ పిల్లల చదువు. అందుకోసం విరాళాలు సేకరించేందుకు తొలి అడుగువేశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే... చిన్న వయసులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి రికార్డుకెక్కిన మలావత్‌ పూర్ణ, నాసా సైంటిస్ట్‌ కావ్య మన్యపు.

వీళ్లిద్దరూ కామారెడ్డి జిల్లాకు చెందిన వాళ్లే. హిందుస్థాన్‌ యునిలివర్‌‌ (హెచ్‌. యు. ఎల్‌) వాళ్ల ‘ప్రాజెక్ట్‌ శక్తి’లో భాగంగా రూరల్‌ ఏరియాలో ఉంటున్న దాదాపు వంద మంది ఆడపిల్లలకు చదువు అందించేందుకు లక్ష డాలర్లు అంటే.. ఎనభై లక్షల రూపాయల ఫండ్‌ కలెక్షన్‌ టార్గెట్‌గా పెట్టుకున్నారు. హిమాలయాల్లో ఇప్పటివరకు ఎవరికీ తెలియని, ఎవరూ ఎక్కని 6,200 మీటర్ల (20,350 అడుగులు) ఎత్తున్న పర్వతాన్ని ఎక్కుతూ ఆ ఫండ్స్‌ సేకరిస్తారు. దానికోసం నెల ముందునుంచే ప్రాక్టీస్ చేస్తున్న వీళ్లు సోమవారం (ఆగస్ట్​ 8) ప్రయాణం మొదలుపెట్టారు.   

అంతా ఆడవాళ్లే...

ఆ పర్వతం పైన పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. దారిలేని పర్వతానికి కొత్త దారి కనిపెడుతూ ఎక్కాలి. పూర్తిగా సాహసాలతో కూడిన ఈ పర్వతం ఎక్కే టీంలో అందరూ ఆడవాళ్లే. ‘మగవాళ్ల తోడు లేకుండా ఆడవాళ్లు ఏం చేయలేరు. వాళ్లవల్ల ఏదీ కాదు. వాళ్లు ఏదీ సాధించలేరు’ అంటూ... ఆడవాళ్లు సాధించాలనుకునే లక్ష్యాలకు హద్దులు పెడుతుంటారు చాలామంది. అలాంటి మాటల్ని కొట్టిపడేస్తూ కేవలం ఆడవాళ్లతో ఈ మిషన్ జరుగుతోంది. కావ్య, పూర్ణ కాకుండా ఇంకో నలుగురు  ఉన్నారు. 

ప్రాజెక్ట్‌ శక్తి అంటే..

హెచ్‌. యు. ఎల్‌ సంస్థ సిఎస్‌ఆర్‌‌ (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా ప్రాజెక్ట్‌ శక్తిని ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశం... గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడవాళ్లకు చేతి వృత్తుల్ని నేర్పించి, ఆ వస్తువులతో బిజినెస్‌ చేయించడం, వాటితో మార్కెటింగ్‌ చేయించి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేయడంతో పాటు, ఆడపిల్లలకి చదువు చెప్పించడం.  

‘సెవన్ సమ్మిట్‌ ఛాలెంజ్‌ని (ఏడు ఖండాల్లో ఉన్న అతి పెద్ద పర్వతాల్ని ఎక్కడం) పూర్తిచేసినప్పుడు కూడా ఇంత ఎగ్జైట్‌మెంట్‌ లేదు. ఈ అడ్వెంచర్‌‌  చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రాజెక్ట్‌ శక్తిలో భాగమైనందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’ అని చెప్పింది పూర్ణ.

‘ఈ అడ్వెంచర్ చేయడంకోసం చాలా కష్టపడ్డా. ఒక సోషల్‌ కాజ్‌ కోసం మేం మొదలుపెట్టిన ఈ పని సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నా. ఇది పూర్తయ్యాక వేరే సోషల్ యాక్టివిటీలు చేయడానికి సిద్దంగా ఉన్నా’ అన్నది కావ్య.