నేటితో ముగుస్తున్న 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం

నేటితో ముగుస్తున్న 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం
  • ప్రొటెం చైర్మన్​గా రాజేశ్వర్​రావును నియమించే చాన్స్

హైదరాబాద్‌‌, వెలుగు: శాసన మండలికి స్థానిక సంస్థల కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్న12 మంది సభ్యుల కాలపరిమితి మంగళవారంతో ముగియనుంది. వీరిలో ఏడుగురు తిరిగి మండలికి ఎన్నికవగా, మిగతా ఐదుగురికి పోటీ చేసే అవకాశం దక్కలేదు. పదవీకాలం ముగిసే వారిలో ప్రస్తుత ప్రొటెం చైర్మన్‌‌ వి.భూపాల్‌‌ రెడ్డి కూడా ఉన్నారు. పురాణం సతీశ్‌‌(ఆదిలాబాద్‌‌), నారదాసు లక్ష్మణ్‌‌రావు(కరీంనగర్‌‌), వి. భూపాల్‌‌రెడ్డి(మెదక్‌‌), బలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం), తేరా చిన్నపరెడ్డి(నల్గొండ) పదవీకాలం పూర్తి కానుంది. వీరి స్థానంలో దండె విఠల్‌‌, ఎల్. రమణ, యాదవరెడ్డి, తాతా మధు, ఎంసీ కోటిరెడ్డి ఎన్నికై మండలిలో అడుగు పెట్టనున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కల్వకుంట్ల కవిత(నిజామాబాద్‌‌), కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌‌ రెడ్డి(మహబూబ్‌‌నగర్‌‌), పోచంపల్లి శ్రీనివాస్‌‌ రెడ్డి(వరంగల్‌‌), శంభీపూర్‌‌ రాజు, పట్నం మహేందర్‌‌ రెడ్డి(రంగారెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌‌10న నిర్వహించిన ఎన్నికల్లో భానుప్రసాద్‌‌రావు, ఎల్‌‌.రమణ (కరీంనగర్‌‌), దండె విఠల్‌‌ (ఆదిలాబాద్‌‌), యాదవరెడ్డి (మెదక్‌‌), తాతా మధు(ఖమ్మం), ఎంసీ కోటిరెడ్డి(నల్గొండ) గెలుపొందారు. తర్వలోవీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలి ప్రొటెం చైర్మన్‌‌గా నిజామాబాద్‌‌కు చెందిన డాక్టర్‌‌ రాజేశ్వర్‌‌ రావును నియమించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఆయన 2007 నుంచి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కౌన్సిల్‌‌లో ఆయనే సీనియర్‌‌ కావడంతో ఆయన పేరు ప్రకటించడం లాంఛనమేనని సమాచారం.