మునుగోడు అభ్యర్థిత్వంపై టీఆర్​ఎస్​లో డైలమా

మునుగోడు అభ్యర్థిత్వంపై టీఆర్​ఎస్​లో డైలమా
  • అధిష్టానం బుజ్జగించినా చల్లారని అసమ్మతి 
  • కూసుకుంట్లకు లీడర్ల సహాయ నిరాకరణ
  • పరిశీలనలో ఇతర ఆశావహుల పేర్లు
  • కంచర్ల కృష్ణారెడ్డితో కేసీఆర్​ సంప్రదింపులు, గంటన్నర చర్చలు
  • టికెట్​ ఎవరికిచ్చినా గెలుపు కోసం పనిచేయాలన్న కేసీఆర్
  • 20న సభలో అభ్యర్థిని ప్రకటించే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: మునుగోడు బై పోల్​లో ఎవర్ని నిలబెట్టాలనే దానిపై టీఆర్​ఎస్​లో డైలమా కొనసాగుతున్నది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ చీఫ్​, సీఎం కేసీఆర్​ ఖరారు చేసినట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి నియోజకవర్గ గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. వివిధ రూపాల్లో తమ అసమ్మతిని తెలుపుతున్నారు. దీంతో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు స్వయంగా కేసీఆర్​ ప్రగతిభవన్​కు పిలిపించి మాట్లాడినప్పటికీ సీన్​ మారకపోవడం గులాబీ టీమ్​కు తలనొప్పిగా మారింది. టీఆర్ఎస్ లో అసంతృప్తులు ఎవరూ లేరని, ఆశావహులు మాత్రమే ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడిన గంటల వ్యవధిలోనే దాదాపు మూడు వందల మంది చౌటుప్పల్​లోని ఓ ఫంక్షన్​ హాల్​లో రహస్యంగా మీటింగ్​ పెట్టుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దని వీరందరూ తీర్మానం చేశారు. ఆయనకు తప్ప ఎవరికైనా టికెట్​ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంత బుజ్జగించినా అసమ్మతి చల్లారకపోవడంతో అభ్యర్థి ఎంపికను టీఆర్​ఎస్​ పెండింగ్​లో పెట్టింది. 

కృష్ణారెడ్డికి ప్రగతిభవన్​ పిలుపు

కూసుకుంట్లపై వ్యతిరేకత వస్తుండడంతో ఇతర ఆశావాహుల పేర్లనూ టీఆర్​ఎస్​ హైకమాండ్​ పరిశీలిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నల్గొండ ఎమ్మెల్యే  కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి ప్రగతిభవన్ నుంచి పిలుపు అందింది. వెంటనే హైదరాబాద్​ చేరుకున్న కృష్ణారెడ్డి దాదాపు గంటన్నర సేపు కేసీఆర్​ తో చర్చలు జరిపారు. కృష్ణారెడ్డి మునుగోడు టికెట్​ను ఆశిస్తున్నారు. స్వయంగా కేసీఆర్ ఆహ్వానించటంతో.. టీఆర్​ఎస్​ ఆయనను బరిలోకి దింపుతుందనే ప్రచారం జరిగింది. కానీ, టికెట్​పై​కేసీఆర్  స్పష్టమైన హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మునుగోడులో ఈ నెల 20న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని, బై ఎలక్షన్​ టికెట్​ ఎవరికిచ్చినా గెలిపించేందుకు కృషి చేయాలని కృష్ణారెడ్డికి కేసీఆర్​ సూచించినట్లు తెలిసింది. 

వీళ్లలో ఎవరికో..!

మునుగోడు టికెట్​ రేసులో రెడ్డి కమ్యూనిటీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బీసీ కమ్యూనిటీ నుంచి కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ పేర్లు టీఆర్​ఎస్​ పరిశీలనలో ఉన్నాయి. వీరిలో ఎవరిని ఎంపిక చేస్తారనే సస్పెన్స్​ మరికొన్ని రోజులు కొనసాగనుంది. ఈ నెల 20న జరిగే సభలో అభ్యర్థి పేరును కేసీఆర్​ ప్రకటించే అవకాశాలున్నాయని 
పార్టీ  వర్గాలు తెలిపాయి.