అమెరికా రిజల్ట్ ఇంకా తేలలే..పూర్తి ఫలితాలకు వారం పట్టొచ్చు

అమెరికా రిజల్ట్ ఇంకా తేలలే..పూర్తి ఫలితాలకు వారం పట్టొచ్చు
  • కొన్ని కౌంటీలకు ఇంకా అందని పోస్టల్​ బ్యాలెట్లు
  • అరిజోనాలో కౌంటింగ్​ కాకున్నా రిజల్ట్​ ప్రకటన
  • తుపాకులు పట్టుకుని కౌంటింగ్​ సెంటర్​ను
    ముట్టడించిన ట్రంప్​ మద్దతుదారులు
  • నేడు మళ్లీ ప్రకటిస్తామన్న అరిజోనా ఆఫీసర్లు
  • అలాస్కాలో ఇంకా సగం కూడా కాని లెక్కింపు
  • పెన్సిల్వేనియా, నార్త్​కరోలినా రిజల్ట్స్​
    వచ్చే వారమేనంటున్న ఆఫీసర్లు
  • కీలకంగా మారిన జార్జియా, నెవడ స్టేట్స్​

అమెరికా ఎన్నికలు అయిపోయి రెండ్రోజులవుతోంది. ఒక్కరోజులో తేలిపోవాల్సిన విన్నర్​.. ఇప్పటికీ తేలలేదు. ఇంకొన్ని రోజులూ తేలేలా లేదు. బైడెన్​వైపే మొగ్గు ఉందని ట్రెండ్స్​ చెబుతున్నా.. ఆరు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి వేరేగా ఉంది. ఎలక్షన్​ డే నాటికే అందాల్సిన పోస్టల్​ బ్యాలెట్లు కొన్ని రాష్ట్రాలకు ఇంకా చేరనేలేదు. కొన్ని కౌంటీల్లో వాటి కౌంటింగ్​మొదలు కానే లేదు. దీన్నే ప్రెసిడెంట్​ ట్రంప్​ వ్యతిరేకిస్తున్నారు. ఎలక్షన్​ డే తర్వాత వచ్చిన పోస్టల్​ బ్యాలెట్లను ఎట్లా కౌంట్​ చేస్తారంటూ అభ్యంతరం చెప్పారు. జార్జియా, పెన్సిల్వేనియా, మిషిగన్​, విస్కాన్సిన్​ కోర్టులకెళ్లారు.  దీంతో ఫైనల్​ ఫలితాలు వెల్లడయ్యేందుకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే అరిజోనాలో రిజల్ట్​ ప్రకటించడంతో ట్రంప్​ సపోర్టర్లు రోడ్డెక్కారు. అక్కడి కౌంటింగ్​ సెంటర్​లోకి తుపాకులతో దూసుకెళ్లారు. ప్రతిగా బైడెన్​ మద్దతుదారులూ నిరసనలు చేపట్టారు. ట్రంప్​ కోర్టులకెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఫాసిస్ట్​ అంటూ నినాదాలు చేశారు. ట్రంప్​ దిగిపోవాలంటూ బ్యానర్లు చేతబట్టి ఆందోళనలు చేశారు. మొత్తంగా అమెరికా ఎన్నికల ఫలితాలు అయోమయంగా మారిపోయాయి. 

వాషింగ్టన్అమెరికా ప్రెసిడెన్షియల్​ రేసులో డెమొక్రాట్​ క్యాండిడేట్​ జో బైడెన్​ ముందున్నారు. మ్యాజిక్​ ఫిగర్​ 270కి ఆయన దగ్గరగా ఉన్నారు. 538 ఎలక్టోరల్​ ఓట్లకుగానూ బైడెన్​కు 253 వచ్చాయి. ట్రంప్​కు 214 దక్కాయి. నిజానికి ముందు అరిజోనా రిజల్ట్​ తేలకపోయినా తేలినట్టు ప్రకటించారు. బైడెన్​కే దక్కిందని తేల్చేశారు. మొత్తం 264 సీట్లు వచ్చాయని చూపించారు. కానీ, తర్వాత ఇంకా రిజల్ట్  రాలేదని ప్రకటించారు. ఆ స్టేట్​ కలిపి ఆరు స్వింగ్​ స్టేట్స్​ ఇప్పుడు ప్రెసిడెంట్​ ఎవరో తేల్చడంలో కీలకంగా మారాయి. ఆ రాష్ట్రాల్లోనే ఇంకా కౌంటింగ్​ సాగుతోంది. లేటవుతోంది. రెండు రాష్ట్రాల్లో శుక్రవారం నాటికి రిజల్ట్స్​ వచ్చే అవకాశం ఉంది. మిగతా మూడు రాష్ట్రాల్లో ఈ వారం చివర్లో లేదంటే వచ్చే వారం రిజల్ట్స్​ వస్తాయని అంటున్నారు. ఇదీ ఆ స్వింగ్​ స్టేట్స్​లో పరిస్థితి…

జార్జియాలో ఇయ్యాల

జార్జియాలో ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​, జో బైడెన్​ల మధ్య హోరాహోరీ సాగుతోంది. ఇద్దరికి ఓట్లలో కొద్ది తేడా మాత్రమే ఉంది. ట్రంప్​కు అక్కడ 49.6 శాతంతో 24 లక్షల 32 వేల 799 ఓట్లు పోలయ్యాయి. అయితే, ట్రంప్​కు జస్ట్​ 0.4 శాతం ఓట్ల దూరంలో బైడెన్​ ఉన్నారు. ఆయనకు 49.2 శాతంతో 24 లక్షల 14 వేల 651 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం ఇంకా లెక్కించాల్సి ఉన్న ఓట్లు ఒక శాతమే ఉండడం.. ట్రంప్​కు 23 వేల పైచిలుకు లీడ్​ ఉండడంతో గెలుపు అవకాశాలు ట్రంప్​కే ఎక్కువ అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 60 వేల ఓట్లను లెక్కించాల్సి ఉందని జార్జియా సెక్రటరీ ఆఫ్​ స్టేట్​ బ్రాడ్​ రాఫెన్​స్పెర్జర్​ చెప్పారు. శుక్రవారం వరకు రిజల్ట్​ తేలదని తేల్చి చెప్పారు.

నెవాడలో ప్రతి ఒక్కరికీ పోస్టల్​ బ్యాలెట్లు

ఈ రాష్ట్రంలోనూ నువ్వా నేనా అన్నట్టే ఉంది ట్రంప్​, బైడెన్​ మధ్య పోటీ. ప్రస్తుతం ఇద్దరికీ ఓట్లలో ఉన్న తేడా 1 శాతం. బైడెన్​కు మొత్తంగా 6 లక్షల 3 వేల 807 ఓట్లు రాగా.. ట్రంప్​కు 5 లక్షల 92 వేల 020 ఓట్లు పోలయ్యాయి. బైడెన్​ 11,787 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్​కు 49.5, ట్రంప్​కు 48.5 శాతం ఓట్లు నమోదయ్యాయి.6,03,807 ఇంకా లెక్కించాల్సి ఉన్న ఓట్లు 2 లక్షలకు పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బైడెనే లీడ్​లో ఉన్నా.. ట్రంప్​ ఆయన్ను దాటేసే చాన్స్​ ఉందని చెబుతున్నారు. నిజానికి నెవాడ రిజల్ట్​ను బుధవారమే ప్రకటించాల్సి ఉన్నా.. సాధ్యం కాలేదని అధికారులు చెప్పారు. ఇన్​పర్సన్​ ఓట్లను మొత్తం లెక్కించినా.. పోస్టల్​ ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదన్నారు. బుధవారం చాలా వరకు పోస్టల్​ ఓట్లు అందాయని, వాటిని లెక్కించేందుకు టైం పడుతుందని చెబుతున్నారు. ఇంకా లెక్కబెట్టాల్సిన ఓట్లు ఎన్ని ఉన్నాయో ఇప్పుడే చెప్పలేమని నెవాడ సెక్రటరీ ఆఫ్​ స్టేట్​ ఆఫీస్​ ప్రకటన విడుదల చేసింది. ఇన్​పర్సన్​ ఓటింగ్​కు అవకాశమున్నా.. ప్రతి ఒక్కరికీ పోస్టల్​ బ్యాలెట్​ పంపించామని పేర్కొంది. వచ్చే ఈనెల 12కు గానీ పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు.

నార్త్​ కరోలినాలో 13 దాకా ఆగాల్సిందే..

నార్త్​ కరోలినా రిజల్ట్స్​కు మరో వారం పట్టే అవకాశం ఉందని స్టేట్​ ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. ఈ నెల 12 లేదా 13 దాకా రిజల్ట్స్​కు అవకాశమే లేదంటున్నారు. ఆయా తేదీలకు గానీ పోస్టల్​ బ్యాలెట్లు అందబోవని, అవి అందాక కౌంటింగ్​ చేస్తామని చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ట్రంప్​కు 27 లక్షల 32 వేల 84 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటిదాకా లెక్కించిన ఓట్లలో 50.1 శాతం ట్రంప్​కే పడ్డాయి. 48.7 శాతం మేర 26 లక్షల 55 వేల 383 ఓట్లు బైడెన్​కు పోలయ్యాయి. ఇంకా ఆరు శాతం దాకా ఓట్లను లెక్కపెట్టాల్సి ఉంది. ప్రస్తుతం బైడెన్​పై ట్రంప్​ 76,701 మెజారిటీతో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 15 ఎలక్టోరల్​ ఓట్లున్నాయి.

అలస్కాలో లెక్కబెట్టింది సగమే

మూడు ఓట్లున్న అలస్కాలోనూ కౌంటింగ్​ చాలా స్లోగా జరుగుతోంది. ఇప్పటిదాకా అక్కడ సగం ఓట్లనే లెక్కబెట్టారు. ట్రంప్​కు 62.1 శాతం మేర లక్షా 18 వేల 602 ఓట్లు పోలయ్యాయి. బైడెన్​కు 63,992 ఓట్లు వచ్చాయి. ఓట్​షేర్​ 33.5 శాతంగా ఉంది. ట్రంప్​ 54,160 ఓట్ల మెజారిటీతో ఉన్నారు.

అరిజోనా ట్విస్ట్​

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. నిజానికి రాష్ట్రంలో ఇప్పటికే ఫలితాలను ప్రకటించేశారు. బైడెన్​ ఆ రాష్ట్రాన్ని గెలుచుకున్నారు. 50.5 శాతంతో బైడెన్​కు 14 లక్షల 69 వేల 341 ఓట్లు వస్తే.. ట్రంప్​కు 48.1 శాతం మేర 14 లక్షల 951 ఓట్లు పోలయ్యా యి. ఇక్కడ ట్రంప్​ 68,390 ఓట్లు వెనకబడి ఉన్నారు.  తాజాగా అధికారులు ఓ బాంబ్​ పేల్చారు. అక్కడి మేరీకోపా కౌంటీలో కౌంటింగ్​ పూర్తవలేదని అరిజోనా స్టేట్​ సెక్రటరీ చెప్పారు. 2 లక్షల 75 వేలకు పైగా ఓట్లను లెక్కించాల్సి ఉందన్నారు. శుక్రవారం పొద్దున వరకు ఫలితాలు వెల్లడించేలా టార్గెట్ పెట్టారు. అయితే, ఈ వారం చివర్లో రిజల్ట్స్​ వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై ట్రంప్​ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాకులు పట్టుకుని మేరీకోపా కౌంటింగ్​ సెంటర్​ వైపు దూసుకొచ్చారు. ఓ ఆందోళనకారు డు లోపలికి వెళ్లిపోయాడు. దీంతో అధికారులు కౌంటింగ్​ను ఆపి సెంటర్​ను మూసేశారు. సిబ్బందితో సహా అందరినీ అందులోనే లాక్​ చేశారు. స్టేట్​లో ప్రస్తుతం ట్రంప్​, బైడెన్​ మధ్య ఉన్న తేడా కొంచెమే కాబట్టి.. రిజల్ట్​ తారుమారైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు.