రష్యా నుంచి చమురును కొనుగోలు చేయొద్దని ఐరోపా దేశాలకు పదే పదే చెబుతున్న అమెరికా.... చమురు సరఫరా విషయంలో ఐరోపా సమాఖ్యతో అవగాహనకు వచ్చింది. అందులో భాగంగా ఈ ఏడాది అదనంగా 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల ద్రవ సహజ వాయువును ఈయూకి ఎగుమతి చేస్తామని తెలిపింది. దీంతో ఐరోపా.. రష్యాపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ . మరోవైపు మే 9 నాటికి యుద్ధాన్ని ముగించాలని రష్యా కోరుకుంటున్నట్లు ఉక్రెయిన్ వర్గాలను ఉద్దేశించి చెప్పాయి మీడియా సంస్థలు. రష్యా తమ పౌరుల్ని బలవంతంగా తీసుకెళ్తోందని ఆరోపిస్తుంది ఉక్రెయిన్. ఇప్పటివరకూ 4 లక్షల 2 వేల మంది ఉక్రెయిన్ వాసుల్ని వారి ఇష్టానికి విరుద్ధంగా తరలించిందని తెలిపింది ఉక్రెయిన్ ప్రభుత్వం. అందులో 84 వేల మంది చిన్నారులున్నారని చెప్పింది.
జీ-20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించేందుకు సిద్ధమవుతున్నామన్న అమెరికా వ్యాఖ్యలపై... స్పందించింది రష్యా. ప్రస్తుతం జీ20 నుంచి బయటకు వచ్చినా రష్యాకు జరిగే నష్టమేమీ లేదని పేర్కొంది. జీ-20 కూటమి ముఖ్యమైనదే.... కానీ, ప్రస్తుతం ఇందులోని చాలా దేశాలు తమపై ఆర్థిక ఆంక్షలు విధించినవే అని తెలిపారు క్రెమ్లిన్ ప్రతినిధి. కాబట్టి జీ 20 నుంచి రష్యాను తప్పించినా నష్టం ఏమీ లేదన్నారు.