
దాదాపు ఏడాదిగా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అన్నీ బంద్ అయినయ్. విదేశాలకు కొన్ని విమానాలే నడుస్తున్నాయి. కరోనా వల్ల ట్రావెలింగ్‌లో బోలెడు మార్పులు వచ్చాయి.. ఆయా దేశాల్లో రూల్స్, రెగ్యులేషన్స్ మారిపోయాయి. ఒకప్పుడు వేరేదేశం పోవాలంటే పాస్‌పోర్ట్ ఉండాలి, ఆ తర్వాత వీసా అప్రూవ్ అయితే వెళ్లిపోవచ్చు. కానీ, ఇప్పుడు దానికి వ్యాక్సినేషన్ పాస్‌పోర్ట్ తోడైంది. ‘అంటే.. సపరేట్‌గా పాస్‌పోర్ట్ తీసుకోవాలా’ అని అనుకుంటున్నారా? కాదు.. వ్యాక్సిన్ వేసుకున్నామని ఒక సర్టిఫికెట్ అన్నమాట. చాలా దేశాలు ఇప్పటికే దీనికి సంబంధించి పనులు మొదలుపెట్టాయి. డిజిటల్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకునే విధంగా యాప్స్ తయారు చేసేందుకు మన దేశంలోని టెక్ కంపెనీలు కూడా వర్క్ మొదలుపెట్టాయట.
కరోనా మహమ్మారిని తరిమికొట్టే పనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ మొదలైంది. దీంతో ఇప్పుడు ట్రావెలింగ్, ఫారిన్ పొయ్యేవాళ్ల సంఖ్య కూడా కాస్త పెరగడంతో వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ కంపల్సరీ అయ్యింది. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి రూల్స్ ప్రకారం క్వారంటైన్ అవ్వకుండా ఈ సర్టిఫికెట్ చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో అన్ని మొబైల్‌లోకి వచ్చేశాయి. అందుకే డిజిటల్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ లేదా హెల్త్ పాస్‌పోర్ట్ యాప్‌ను తయారు చేసేందుకు టెకీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఆ యాప్‌లో మన హెల్త్‌కు సంబంధించి ప్రతీ అప్‌డేట్ ఉంచేలా ప్రయత్నం జరుగుతోంది. ఆ యాప్‌లో కరోనా టెస్ట్, ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్ తదితర వివరాలు ఎంటర్ చేసేలా రూపొందిస్తున్నారు. దీంతో ట్రావెలర్స్, విజిటర్స్ హెల్త్ కండిషన్ ఈజీగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అన్ని దేశాల్లో ఇప్పుడు వ్యాక్సినేషన్ ఇంకా నడుస్తున్నందువల్ల ఇప్పుడే యూనివర్సల్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వచ్చే అవకాశాలు లేవని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
ఇప్పటికే కొన్ని దేశాల్లో..
టూరిస్టులను అట్రాక్ట్ చేసేందుకు, జాగ్రత్తలు తీసుకునేందుకు ఇప్పటికే చాలా దేశాలు ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ను ఇంట్రడ్యూస్ చేశాయి. డిజిటల్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇచ్చిన మొదటి దేశం ఐస్‌ల్యాండ్. వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన పనిలేదని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
డెన్మార్క్ ప్రభుత్వం వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ కంపల్సరీ చేస్తామంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. బ్రిటన్‌లో డిజిటల్ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ చూపించాల్సిన పనిలేదు. కానీ, డాక్టర్ సర్టిఫికెట్ మాత్రం అవసరం. వాటితో పాటు సింగపూర్, థాయిలాండ్, హంగెరీ, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా అమలు చేస్తున్నారు.
సైబర్ రిస్క్ ఎక్కువ
ఈ వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని సైబర్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. యాప్‌లో సరైన సేఫ్టీ మెజర్స్ లేకపోతే కష్టం అని, ఇన్ఫర్మేషన్ మిస్‌యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయని అంటున్నారు. అంతే కాకుండా వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లని వేరే రకంగా చూసినట్లు అవుతుందని అభిప్రాయ పడుతున్నారు.
“ కరోనా కారణంగా ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో పడింది. ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రావెలింగ్ రికవర్ అవ్వాలంటే వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపాలి. దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) హెల్త్ పాస్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీని ద్వారా అన్ని గవర్నమెంట్ ఎయిర్‌లైన్స్, ట్రావెలర్స్, ల్యాబ్స్‌ను కనెక్ట్ చేసి హెల్త్ స్టేటస్ తెలుసుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’, ‘స్విస్’ అనే ఎన్జీవో కూడా ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటితో ప్యాసింజర్ హెల్త్ కండిషన్ తదితర వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు” – బెనర్జీ, సీఏపీఏ ఇండియా సీనియర్ మేనేజర్