రూ. లక్ష కట్టలేదని 15 కుటుంబాల వెలి

రూ. లక్ష కట్టలేదని 15 కుటుంబాల వెలి
  •         నిరుపేదలకు గుదిబండగా ఇంటింటి సర్వే
  •        టీఆర్ఎస్ ఉప సర్పంచ్​పై కలెక్టర్​కు బాధితుల ఫిర్యాదు

ఆసిఫాబాద్, వెలుగు: రూ.లక్ష ఇవ్వనందుకు 15 కుటుంబాలను అధికార పార్టీ ఉప సర్పంచ్​ వెలి వేశారంటూ బాధితులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ గ్రామస్థులకు 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇంటి స్థలాలు అందజేసింది. అక్కడ పక్కా ఇళ్లు కట్టుకుని 15 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే ఈ నిరుపేదలకు గుదిబండగా మారింది. ఇటీవల ఉప సర్పంచ్ సోనేలే పురుషోత్తం నేతృత్వంలోని బృందంగా గ్రామంలో పంచాయతీ పెట్టారు. కుటుంబానికి ఒక గుంటనే ఉచితంగా ఇస్తామని, మిగతా ఖాళీ స్థలానికి పంచాయతీలో  రూ.1.10 లక్షలు కట్టాలని తీర్మానించారు. దీనికి అంగీకరించకుంటే భూమిని ఇతరులకు అమ్ముతామని హెచ్చరించారు. రూ. 50 వేలు కడతామని చెప్పినా వినిపించుకోలేదు. రూ. 1.10 లక్షలు కట్టకపోతే ఇండ్లు ఖాళీ చేసి గ్రామం నుంచి వెళ్లాలంటూ పంచాయతీలో తీర్మానించారు. తమ వద్ద అంత డబ్బు లేదని, ఇండ్లు ఖాళీ చేయబోమంటూ బాధితులు చెప్పడంతో 15 కుటుంబాలను కులం నుంచి వెలి వేశారు. రెండు మాసాలుగా వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఎవరూ వెళ్లకపోగా ప్రతి ఒక్కరూ వీరికి దూరంగా ఉంటున్నారు. దీంతో బాధితులు న్యాయం కోసం జిల్లా కలెక్టర్, డీఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు.