బయటకు కనిపించని ఊరు

బయటకు కనిపించని ఊరు

జిభి.. హిమాచల్ ప్రదేశ్​లో ఉన్న తీర్థన్​ లోయలో ఉంది. ఏపుగా పెరిగిన పైన్​ చెట్లతో నిండిన దట్టమైన అడవి ప్రాంతం. అయితేనేం స్వచ్ఛమైన నీటి చెలమ, ప్రశాంత వాతావరణంలో దేవాలయాలు, సేదతీరేందుకు చెట్ల మీద కట్టిన ఇండ్లు, టూరిస్ట్​ల కోసం హాస్టళ్లున్నాయి. అంతకుమించి మనసుకు హాయి గొలిపే ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి జిభిలో. హోం స్టేల కోసం అక్కడ కట్టిన ఇండ్లు చూస్తే విక్టోరియా కాలానివా? అన్నట్టు ఉంటాయి. ఎందుకంటే వాటిని విక్టోరియన్ స్టైల్​లో కట్టారు. ఇక్కడ తిండికి లోటు లేకుండా మంచి కెఫెలు కూడా ఉన్నాయి. ఇక్కడికి అక్టోబర్​ నుంచి మే మధ్యలో ఎప్పుడైనా వెళ్లొచ్చు. మంచులో ఎంజాయ్ చేయాలనుకునేవాళ్లు జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య వెళ్లొచ్చు. తీర్థన్ లోయలో ఉన్న జిభిలో ప్రధానమైంది తీర్థన్​ నది. నదికి ఇరువైపులా జిప్ లైన్​ ఉంది. జిభి మొత్తం చూడాలంటే నాలుగు లేదా ఐదు రోజులు పడుతుంది.
జలోరి పాస్
జిభికి 12 కిలో మీటర్ల దూరంలో జలోరి పాస్ ఉంటుంది. దాదాపు మూడు వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది జలోరి పాస్. అక్కడికి వెళ్లే దారిలో పచ్చని పైన్​ చెట్లు కనిపిస్తాయి. మధ్య మధ్యలో పురుగు పుట్రా, రకరకాల పక్షులు పలకరిస్తాయి. పై వరకు వెళ్లాక, అక్కడ నిలబడితే ప్రకృతిని మనసారా ఆస్వాదించొచ్చు. అక్కడి నుంచి కనుచూపు మేర కనిపించే అద్భుత దృశ్యాలన్నీ మనసును పులకరింపజేస్తాయి. 
ఉత్తర హిమాలయాల శిఖరాలలో కులు, సిమ్లా జిల్లాల మధ్య జలోరి పర్వత మార్గం ఉంది.  బాలీవుడ్ మూవీ ‘‘యే జవానీ హై దివానీ’’లో కనిపించే మంచు కొండ జిభిలోనిదే. ఇక్కడ నటులు రణబీర్ కపూర్, దీపికా పదుకొనే పర్వతాల మధ్య ట్రెక్కింగ్ కూడా చేశారు. ఈ దారి మార్చి రెండో వారంలో తెరుస్తారు. మంచు కారణంగా డిసెంబర్‌లో మూసివేస్తుంటారు. సముద్ర మట్టానికి10,800 అడుగుల ఎత్తులో ఉన్న జలోరీ పాస్, షోజా నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన రహదారి ఇరుకుగా, ఎగుడుదిగుడుగా ఉంటుంది. కొన్నిసార్లు కారు నడపడం చాలా కష్టమవుతుంది. చలికాలంలో మంచు కారణంగా వెహికల్స్ జారిపడే ప్రమాదం ఉంది. జలోరీ పాస్ ట్రెక్. జూన్ మధ్య నుండి అక్టోబర్ మధ్య వరకు ధైర్యంగా చేయొచ్చు. జలోరి పాస్​ నుంచి దగ్గర్లో ఉన్న సెరోల్సర్ సరస్సు, బుధి నాగిన్ ఆలయానికి వెళ్లొచ్చు. 


జిభి జలపాతం
జిభి జలపాతం దట్టమైన అడవిలో దాక్కుని ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు జలపాతాన్ని కవర్ చేస్తాయి. ఊరిలోపలికి వెళ్లి చూస్తే జలపాతం కనిపిస్తుంది. దాని పై నుంచి జాలువారే నీళ్ల సవ్వడి సంగీతంలా అనిపిస్తుంది. జలపాతానికి దగ్గర్లో చిన్న చిన్న చెక్క వంతెనలు కట్టారు. జలపాతాన్ని చూడ్డానికి వెళ్లినవాళ్లు అక్కడికి దగ్గర్లోనే కూర్చుని నీటి సవ్వడి, పక్షుల కిలకిలరావాలు, పిల్లగాలుల్ని ఎంజాయ్ చేస్తారు. 
ఇక్కడ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఉంది. ఇక్కడి నుండి జిభికి వెళ్లడానికి గంట ప్రయాణం. ఆ పార్క్​కి దగ్గర్లో బోలెడు గెస్ట్ హౌస్​లు ఉన్నాయి. వాటిలో బస చేస్తే హిమాలయన్ కల్చర్​ను తెలుసుకోవచ్చు. ఆ ఇండ్లకు దగ్గరలో తీర్థన్ నది పారుతూ ఉంటుంది. 
సెరొల్సర్ సరస్సు
జలోరి పాస్​ నుంచి దాదాపు ఆరు కిలో మీటర్ల దూరంలో ఉంది ఈ సరస్సు.  ఈ సరస్సు కూడా అడవి మధ్యలో ఉంది. జలోరి పాస్ నుండి సరస్సుకి నడిచి వెళ్తుంటే ఆ ఫీల్​ చాలా బాగుంటుంది. ఈ సరస్సులో ఆడుకోవచ్చు, అక్కడ కూర్చుని నేచర్​ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్రదేశం బుధి నాగిన్ దేవత కొలువై ఉన్న ఆలయానికి ప్రసిద్ధి చెందింది. దేవతకు వంద మంది కుమారులు ఉన్నారని, ఆమె ఈ ప్రదేశానికి సంరక్షకురాలిగా ఉందని నమ్ముతారు. 

చైనీ కోతి
దీన్ని పహడి ఆర్కిటెక్చర్ స్టైల్​లో కట్టారు. ఇది 1500 ఏండ్ల నాటి చరిత్ర దీని సొంతం.  నలభై మీటర్ల ఎత్తులో కలప టవర్ ఉంది. ఇక్కడ నుండి విశాలమైన ఆ ప్రదేశం అందాలను చూడవచ్చు. ఈ కోట భూగర్భంలో ఒక రహస్య సొరంగం కూడా ఉంది. దాని రహస్యాలు తెలుసుకోవాలంటే సొరంగం లోపలికి వెళ్లి చూడొచ్చు. చక్కటి కలపతో తయారు చేయబడిన ఈ కోట, చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కోట శ్రీకృష్ణ దేవాలయంగా వాడుకలో ఉంది. 
శృంగ రిషి టెంపుల్
ఇది 500 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ టెంపుల్​కు భక్తులు చాలా మంది వస్తారు. ఈ ఆలయం చుట్టూ పచ్చని చెట్లు, రంగురంగుల పూలతో ప్రశాంత వాతావరణాన్ని తలపిస్తుంది.
నేషనల్ పార్క్
గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్​ని1984లో ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్​లలో ఒకటి. 754 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 181 జాతుల పక్షులు, 31 జాతుల పశువులు ఉన్నాయి.  
రఘుపుర్ కోట
ఈ కోట జలోరి పాస్​కు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంది. దీన్ని తీర్థన్​ లోయలో మండి రాజవంశానికి చెందిన పాలకులు కట్టించారు. శత్రువుల నుంచి రక్షించుకోవడానికి దీన్ని కట్టారు. అయితే, ఇది ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. పడిపోయిన శిథిలాలు మాత్రం అప్పటి చరిత్రను గుర్తుచేస్తాయి. ఇక్కడికి చేరుకోవాలంటే జలోరి పాస్​ నుంచి రెండు గంటలు నడవాలి. దట్టమైన ఓక్ చెట్ల దారిలో కోట శిథిలాలు కనిపిస్తాయి. 

ఏమేం చేయొచ్చు?
క్యాంప్​లు వేయడానికి అనువుగా ఉంటుంది. పచ్చికబయళ్లలో హాయిగా సేదతీరొచ్చు. రాత్రుళ్లు చలిమంటలు వేసుకుని కూర్చోవచ్చు.  రాతి కొండల మీద హైకింగ్ చేయొచ్చు. రోడ్డుకి రెండు పక్కల దట్టమైన పచ్చని చెట్లు, చాలా ఎత్తులో ఉంటాయి. వాటి మధ్య హైకింగ్ చేస్తుంటే ఒత్తిడి నుంచి రిలీఫ్​ వస్తుంది. మనసుకు హాయిగా ఉంటుంది. జిభిలో చేపలు పట్టడం బాగా ఎంజాయ్​ చేయొచ్చు. ఫ్రెష్​ వాటర్​ సరస్సుల్లో రంగురంగుల చేపలు కనువిందు చేస్తాయి. వాటిని చూడ్డమే కాదు, అక్కడి అధికారుల​ పర్మిషన్​ తీసుకుని చేపలు పట్టుకోవచ్చు కూడా. జిభి లోయ పక్షులకు నిలయం అంటే అతిశయోక్తి కాదు. అన్ని రకాల పక్షులు ఉంటాయి ఇక్కడ.  వలస పక్షులు, అంతరించిపోతున్న, ఎప్పుడూ కనిపించనివి... ఇలా చాలా ఉన్నాయి. అవి అటు ఇటూ ఎగురుతూ ఉంటే, కళ్లముందు అందాల కనువిందే. 

చరిత్ర
ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, నదులు, సరస్సులు దట్టమైన అడవి.. వెరైటీ కల్చర్​. కులు జిల్లాలోని సెరాజ్ ప్రాంతంలోని అద్భుతమైన ప్రాంతాలలో ఒకటైన బంజర్ లోయ. బంజర్​ లోయలోనిదే తీర్థన్​ లోయ కూడా. అక్కడి వాళ్లకు ‘ఫాగులి’ చాలా ప్రత్యేకమైన పండుగ. కులు జిల్లాలోని సెరాజ్ ప్రాంతంలో జరుపుకుంటారు. ఈ వేడుక నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ నాలుగు రోజుల్లో చుట్టుపక్కల గ్రామస్తులు గుమిగూడి వివిధ గ్రామాల గుండా దేవతా మూర్తులను ఊరేగిస్తూ డాన్స్​లు చేస్తూ, మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇందులో భాగంగానే డ్రమ్మింగ్ డాన్స్ చేస్తారు. అందులో రకరకాల స్థానిక సంగీత వాయిద్యాలు వాయిస్తారు. ఈ పండుగ విష్ణువుకు అంకితం చేశారు. ప్రజలు శీతాకాలం తర్వాత వసంతకాలపు పని కాలాన్ని స్వాగతిస్తూ ఈ పండుగ చేస్తారు. డాన్స్ చేయడానికి గడ్డితో తయారు చేసిన బట్టలు కట్టుకుంటారు. 
 

ఎలా వెళ్లాలి?
కులుకి దగ్గర్లో ఉన్న భుంటుర్ ఎయిర్​ పోర్ట్​లో దిగి, అక్కడి నుంచి అద్దెకు కార్ తీసుకుని వెళ్లొచ్చు. ట్రైన్​లో అయితే సిమ్లా రైల్వేస్టేషన్​లో దిగి, అక్కడి నుంచి కార్​ అద్దె​కు తీసుకుని వెళ్లాల్సిందే. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే.. ఢిల్లీ నుంచి అట్ వెళ్లి, అక్కడ జిభి బస్​ఎక్కాలి. ఢిల్లీ నుంచి కార్​లో వెళ్తే జర్నీ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు.