హైపర్ లూప్ ట్రైన్: గంటకు 1200 కిలోమీటర్ల స్పీడ్‌‌తో జర్నీ

హైపర్ లూప్ ట్రైన్: గంటకు 1200 కిలోమీటర్ల  స్పీడ్‌‌తో జర్నీ


హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రైలులో వెళ్లాలంటే దాదాపు ఒక రోజంతా జర్నీలోనే సరిపోతుంది. ఒక వేళ బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చినా నాలుగైదు గంటల సమయం పడుతుంది. అదే ఇప్పుడు అమెరికాలో వర్జిన్ హైపర్‌‌‌‌లూప్ కంపెనీ పనులు చేపడుతున్న ఈ ‘హైపర్‌‌‌‌లూప్’ ట్రావెల్ సిస్టమ్‌‌లో అయితే కేవలం గంటన్నరలోపే ఢిల్లీలో ఉండొచ్చు. ఇక్కడ ట్రైన్‌‌తోనే పోల్చడానికి కారణం.. ఇది కూడా ఒక రైల్వే సిస్టమ్ లాంటిదే. హైపర్‌‌‌‌లూప్ అనేది అయస్కాంత శక్తితో పని చేసే వ్యాక్యూమ్ ట్రైన్. దీనిలో గంటకు 1200 కిలోమీటర్ల స్పీడ్‌‌తో దూసుకెళ్లొచ్చు.

టెస్ట్ రన్ సక్సెస్

2014లో స్పేస్‌‌ఎక్స్ మాజీ సైంటిస్ట్ జాష్ జిగెల్, సారా లూషియన్ కలిసి ఈ వర్జిన్ హైపర్‌‌‌‌లూప్ కంపెనీని ప్రారంభించారు. అడ్వాన్స్డ్ ట్రావెల్ సిస్టమ్‌‌ డెవలప్ చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థ నాటి నుంచి వర్క్ చేస్తోంది. 2019 నాటికి ప్రయోగాలు ఒక కొలిక్కి వచ్చాయి. దీంతో అమెరికాలోని లాస్‌‌ వెగాస్‌‌ సమీపంలో ఉన్న నెవడా ఎడారిలో హైపర్‌‌‌‌లూప్ కన్‌‌స్ట్రక్షన్‌‌ను ఆ కంపెనీ మొదలుపెట్టింది. ట్రైన్ పట్టాల మీద నడిచినట్టే.. హైపర్‌‌‌‌లూప్ ట్రావెల్ సిస్టమ్‌‌లో కూడా భారీ ఐరన్ ట్యూబ్‌‌ ట్రాక్‌‌లా ఉంటుంది. దానిలోనే చిన్న  సైజు మెట్రో కోచ్‌‌లాంటివి హైస్పీడ్‌‌తో దూసుకెళ్తాయి. దీనిలో ఒకేసారి 28 మంది ప్రయాణం  చేసే వీలుంటుంది. గత ఏడాది నవంబర్‌‌‌‌లో హైపర్‌‌‌‌లూప్‌‌లో టెస్ట్ రన్‌‌ కూడా నిర్వహించి, ఆ సంస్థ సక్సెస్ అయింది.
పక్కా సేఫ్
ఈ హైపర్‌‌‌‌లూప్ సిస్టమ్‌‌లో గంటకు 1200 కిలోమీటర్ల స్పీడ్‌‌తో దూసుకెళ్లొచ్చని కంపెనీ కో ఫౌండర్, సీఈవో జిగెల్ చెబుతున్నారు. అయితే ఇది పబ్లిక్ ట్రావెల్‌‌కు అందుబాటులోకి రావడానికి ఇంకా ఆరేండ్ల వరకు టైమ్ పట్టొచ్చు. 2027 నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ మొదలవుతాయని జిగెల్ తెలిపారు. అమెరికాలోని నెవడాలో ప్రయోగాత్మకంగా అర కిలోమీటర్ హైపర్‌‌‌‌లూప్ సిస్టమ్ ట్యూబ్ నిర్మాణం చేశామని, దీనిలో గత ఏడాదిలో నిర్వహించిన టెస్ట్‌‌ రన్‌‌లో సేఫ్టీని చెక్ చేశామని తెలిపారు. కేవలం 15 సెకన్ల టైమ్‌‌లోనే ఈ 500 మీటర్ల జర్నీ పూర్తయిందని, టెక్నికల్‌‌గా హై సేఫ్టీతో ఉందని చెప్పారు. గాలి లేని వ్యాక్యూమ్ ట్యూబ్‌‌లో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ, లో ప్రెజర్ సాయంతో ఇందులో 1200 కిలోమీటర్ల స్పీడ్ జర్నీ చేయగలమని, ఒక రకంగా విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతిని ఇది ఇస్తుందని చెప్పారు. అయితే ఎటువంటి శబ్ధం రాకుండా, పొల్యూషన్ లేకుండా ప్రయాణం సాగుతుందన్నారు. న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌‌కు దీనిలో అర గంటలోపే వెళ్లిపోవచ్చని, కమర్షియల్ ఫ్లైట్‌‌తో పోల్చుకుంటే ఇది రెండింతల వేగమని, హైస్పీడ్ ట్రైన్ల కంటే నాలుగింతల స్పీడ్ జర్నీ అని జిగెల్ అన్నారు.

1960లోనే అనుకున్నా..

ఇలాంటి హైస్పీడ్ ట్రావెల్ సిస్టమ్ ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నదే. దాదాపు వందేండ్ల క్రితమే రాకెట్ సైంటిస్ట్ రాబర్ట్ గడర్డ్ ఈ తరహా ఆలోచనను ప్రతిపాదించారు. అలాగే 1960లో ఎయిరో ట్రైన్ డెవలప్ చేయాలని ఫ్రాన్స్‌‌కు చెందిన కొన్ని కంపెనీలు ప్రయత్నించి, సరైన ఫండింగ్‌‌ లేక ఆ ప్రాజెక్ట్‌‌ను పక్కన పడేశాయి. ఈ ఆలోచనపై 2013లో స్పేస్‌‌ ఎక్స్ సంస్థ ఫౌండర్ ఎలన్ మస్క్ దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్‌‌పై ఆ సంస్థలో ఉండగా పని చేసిన సైంటిస్ట్ జిగెల్ 2014లో వర్జిన్ సంస్థ సహకారంతో వర్జిన్ హైపర్‌‌‌‌లూప్ అనే సంస్థను దాని సబ్సిడరీగా ప్రారంభించారు.

ఇండియాపై ఫోకస్

‘ఇండియాలో జనాభా చాలా ఎక్కువ. ఎన్ని రకాల ట్రాన్స్‌‌పోర్ట్ సిస్టమ్స్ ఉన్నా నిత్యం రద్దీగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ ప్రాజెక్ట్‌‌ను ఇండియాలో చేపట్టాలన్నది తమ టాప్ ప్రయారిటీలో ఉంది’ అని వర్జిన్ హైపర్‌‌‌‌లూప్ కంపెనీ చెబుతోంది. అలాగే పెద్దగా ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ లేని సౌదీ అరేబియాపైనా తమ ఫోకస్ ఉందని వెల్లడించింది. ఫ్యూచర్ ట్రావెల్‌‌నే మార్చేసే వ్యవస్థగా ఈ శతాబ్దపు చరిత్రలో నిలిచిపోతుందని జిగెల్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ పనులు యూఎస్‌‌తో పాటు దుబాయ్‌‌లోనూ ఒకేసారి చేపట్టనున్నట్లు తెలిపారు. కాగా, ఈ తరహా ట్రాన్స్‌‌పోర్ట్ సిస్టమ్‌‌పై వర్జిన్‌‌ హైపర్‌‌‌‌లూప్‌‌తో పాటు ఎలన్ మస్క్ కంపెనీ, మరో రెండు మూడు సంస్థలు కూడా పని చేస్తున్నాయి.