వర్చువల్ వరల్డ్‌‌‌‌నే నిజమైన ప్రపంచమనుకుంటున్నరు

వర్చువల్ వరల్డ్‌‌‌‌నే నిజమైన ప్రపంచమనుకుంటున్నరు

బీటెక్ చదువుతున్న షాలిని..  అన్ని సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు పోస్ట్‌‌‌‌లు పెడుతూ చాలా యాక్టివ్‌‌‌‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ షాలినికి లోపల ఒకరకమైన డిప్రెషన్  వేధిస్తోంది. తన పోస్ట్‌‌‌‌లకు లైక్స్ రావట్లేదని, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో ఫాలోవర్లు పెరగట్లేదన్న బెంగ పట్టుకుంది. నిజానికి ఇలాంటి సిచ్యుయేషన్‌‌‌‌ను ఫేస్ చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ సోషల్ మీడియా డిప్రెషన్‌‌‌‌ను ఎదుర్కొనేదెలా?

సోషల్‌‌‌‌ మీడియాకు ఇంతలా అడిక్ట్ అవ్వడం వల్ల యూత్‌‌‌‌లో లోన్లీనెస్ పెరుగుతోంది. వర్చువల్ వరల్డ్‌‌‌‌నే నిజమైన ప్రపంచమనుకోవడం వల్ల డిప్రెషన్ బారిన పడుతున్నారు. ఇలాంటి డిప్రెషన్, యాంగ్జైటీ కేసులు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. దీని గురించి సైక్రియాటిస్ట్ డా. జ్యోతిర్మయిని అడిగితే.. దీన్నెలా గుర్తించాలి? ఎలా బయటపడాలి? అనే విషయాలు వివరించారు.
“ డిప్రెషన్‌‌‌‌తో బాధ పడేవాళ్లకు రెండు కారణాలుంటాయి. నిరాశ, నిస్సహాయతల వల్ల డిప్రెషన్‌‌‌‌ రావొచ్చు. అలాగే అవమానించడం, కించపరచడం లాంటివి కూడా డిప్రెషన్‌‌‌‌కు కారణమవ్వొచ్చు. సోషల్ మీడియాకు ఎక్కువగా అడిక్ట్ అవ్వడం వల్ల ‘బ్లాక్ అండ్ వైట్ థింకింగ్’లో పడిపోతారు. అంటే..  ‘అనుకున్నది జరిగితే ఓకే. లేకపోతే నా వల్ల ఉపయోగం లేద’ని ఫీలవ్వడం. ఇలాంటి ఆలోచన వల్ల ఒంటరితనం, కుంగుబాటు పెరుగుతాయి. 

వర్చువల్ మాయ

గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్ పెరిగాయి. ప్రతీ ఒక్కరూ తమ గుర్తింపుని సోషల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌లోనే  ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫేస్‌‌‌‌బుక్, ట్విట్టర్, స్నాప్‌‌‌‌చాట్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్ లాంటి వాటిలో సెలబ్రిటీలు యాక్టివ్‌‌‌‌గా ఉండడం చూసి టీనేజీ పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు. అందుకే లైక్స్, వ్యూస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.  ఇలాంటి వాళ్లు పూర్తిగా వర్చువల్ ప్రపంచంలోనే జీవిస్తుంటారు. అనుకున్న విధంగా వ్యూస్, లైక్స్ రాకపోతే తాము పూర్తిగా ఫెయిల్ అయ్యామని భావిస్తారు. తమకంటూ ఎవరూ లేరని ఒక నిర్ణయానికొస్తారు. ఇదే డిప్రెషన్‌‌‌‌కు మూలం.    

ఇదొక్కటే సొల్యూషన్

సోషల్ మీడియా డిప్రెషన్‌‌‌‌ తగ్గించాలంటే ముందుగా స్క్రీన్ టైం తగ్గించాలి. రోజులో ఎక్కువ టైం మొబైల్‌‌‌‌కు కేటాయించడం వల్ల మైండ్ అంతా వర్చువల్ వరల్డ్‌‌‌‌లోనే తిరుగుతుంటుంది. ‘ఎవరెవరు ఏం చేస్తున్నారు? నా ఫోటోకి లైక్స్ ఎన్ని వచ్చాయి? కామెంట్స్ ఏం వచ్చాయి?’ అన్న ఆలోచనలు ఎక్కువవుతాయి. ఇవన్నీ చివరకు డిప్రెషన్ బారిన పడేస్తాయి. అందుకే గ్యాప్ లేకుండా వచ్చే నోటిఫికేషన్స్‌‌‌‌ను ఆఫ్ చేయాలి. రోజులో కొంత టైం మాత్రమే మొబైల్‌‌‌‌ వాడాలి. ముఖ్యంగా పిల్లలకు చిన్న వయసు నుంచే స్క్రీన్ టైం కంట్రోల్ చేయాలి. పేరెంట్స్ కూడా మొబైల్ వాడకాన్ని తగ్గించాలి. అవుట్‌‌‌‌డోర్ యాక్టివిటీస్‌‌‌‌కు పిల్లల్ని ఎక్కువగా అలవాటు చేస్తే.. మొబైల్ మాయలో పడకుండా చూసుకోవచ్చు.

ట్రీట్మెంట్ ఇలా..

డిప్రెషన్ వేధిస్తుందని గుర్తించినప్పుడు వేరొకరి సాయాన్ని తీసుకోవడానికి వెనుకాడకూడదు.  ఎందుకంటే కొందరిలో పుట్టుకతోనే సైకియాట్రిక్ డిజార్డర్స్ ఉండే అవకాశం ఉంది. వాటి కారణంగా కూడా డిప్రెషన్ మొదలవ్వొచ్చు. ఇలాంటి వారిని గుర్తించగలిగితే సరైన ట్రీట్మెంట్‌‌‌‌తో డిప్రెషన్‌‌‌‌ తగ్గించొచ్చు. యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్, బిహేవియరల్ థెరపీతో ఎలాంటి కుంగుబాటునైనా నయం చేయొచ్చు”

సపోర్ట్ ఇవ్వాలి

సోషల్ మీడియా డిప్రెషన్‌‌‌‌ను ఎదుర్కోవాలంటే వాస్తవ ప్రపంచానికి దగ్గరవ్వడం ఒక్కటే మార్గం. సక్సెస్ లేదా ఐడెంటిటీని రియల్ వరల్డ్‌‌‌‌లో వెతికే ప్రయత్నం చేయాలి. అలాగే డిప్రెషన్‌‌‌‌లో ఉండేవాళ్లకి చుట్టుపక్కల వాళ్ల సపోర్ట్ చాలా అవసరం.  డిప్రెషన్‌‌‌‌లో ఉన్నవాళ్ల లక్షణాలు వెంటనే గుర్తించొచ్చు. వాళ్లు ఒంటరిగా, బాధ పడుతూ కనిపిస్తారు. కోపం, విసుగు లాంటివి కనిపిస్తాయి. ఎవరితో కలవడానికి ఇష్టపడరు. ఈ లక్షణాలతో ఎవరైనా కనిపిస్తే వాళ్లని ప్రేమతో పలకరించాలి. వాళ్లని మాట్లాడించాలి.  మనసు విప్పి మాట్లాడితే డిప్రెషన్  దాదాపుగా తగ్గిపోతుంది. ‘నేను ఒంటరిని కాను’ అనే భావన కలుగుతుంది.

లైఫ్‌‌స్టైల్ ఇలా..

రోజువారీ లైఫ్‌‌‌‌స్టైల్‌‌‌‌ను మార్చడం ద్వారా కూడా డిప్రెషన్‌‌‌‌ కంట్రోల్ చేయొచ్చు. సోషల్ మీడియా డిప్రెషన్‌‌‌‌తో బాధపడుతున్నవాళ్లు.. టైంకు నిద్రపోవడం, రోజూ కొంత వ్యాయామం చేయడం, టైంకు తినడం లాంటి అలవాట్లు ఫాలో అయితే మెదడులో హార్మోన్స్ బ్యాలెన్స్‌‌‌‌డ్‌‌‌‌గా ఉంటాయి. డిప్రెషన్ ఆటోమెటిక్‌‌‌‌గా తగ్గుతుంది. 

డా।। కె. జ్యోతిర్మయి, 
ఎం.డి, కన్సల్టెంట్​ సైకియాట్రిస్ట్​
హైదరాబాద్​