మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకే పడతాయి

మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకే పడతాయి

కోవర్టు రాజకీయాలకు మునుగోడు ప్రజలు బుద్ధి చెప్తారని బండి సంజయ్ అన్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కిష్టాగూడెంలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని..మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని..ప్రజల మీద నమ్మకంతో రాజగోపాల్ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని చెప్పారు.

మునుగోడు ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదని..తెలంగాణ భవిష్యత్తు తెలిపే ఎన్నిక అని  బండి సంజయ్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్ గెలుపుతో కేసిఆర్ అహంకారం కొంచెం తగ్గిందన్న ఆయన..మునుగోడు గెలుపుతో మొత్తం బద్దలవుతుందని చెప్పారు.  

సీఎం కేసీఆర్ సభకు వెయ్యి రూపాయలు ఇచ్చి ప్రజల్ని తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చిందని బండి సంజయ్ ఆరోపించారు. 21న మునుగోడులో జరిగే అమిత్ షా సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. దుబ్బాక, హుజూరాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీకి ఓటేశారని.. మునుగోడులోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడతాయని చెప్పారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని.. ఆ పార్టీ నేతలే పరస్పరం విమర్శించుకోవడం విడ్డూరమన్నారు. కమ్యూనిస్టులు టీఆర్ఎస్ ఫాలోవర్లు అని విమర్శించారు.