గవర్నర్ కు వీఆర్ఏల వినతిపత్రం

గవర్నర్ కు వీఆర్ఏల వినతిపత్రం

హన్మకొండ :  తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరుతూ.. వీఆర్ఏలు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు వినతి పత్రం అందించారు. తమ సమస్యలను పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వివరించారు. తమకు పే స్కేల్ ప్రకారం వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్ సాక్షిగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని VRA ల హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మీ కోరారు. గవర్నర్ సమయం ఇచ్చి తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారని, న్యాయం జరిగేలా చూస్తామని  హామీ ఇచ్చారని తెలిపారు. 

ఈటల తండ్రికి నివాళి
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను గవర్నర్ తమిళి సై పరామర్శించారు. కమలాపూర్ కు వెళ్లిన గవర్నర్ ఈటల తండ్రి మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఈటల రాజేందర్ తండ్రి మ‌ల్లయ్య సిద్దిపేటలోని ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచారు. బుధవారం మధ్యాహ్నం కమలాపూర్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. మల్లయ్యకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ రెండో కుమారుడు. 

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కుటుంబానికి ఆర్థికసాయం


బాసర ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళి సై సూచించారు. గత నెలలో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ సంజయ్ కిరణ్ కుటుంబాన్ని గవర్నర్ పరామర్శించారు. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. 

విద్యార్థులు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని, ఛాలెంజెస్ను ఫేస్ చేయాలని గవర్నర్ సూచించారు. కరోనా తరువాత చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తున్నారని.. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, మెడికల్ సౌకర్యాలు మెరుగుపర్చాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు.