నత్తనడకన మన ఊరు మన బడి పనులు

నత్తనడకన మన ఊరు మన బడి పనులు

హైదరాబాద్, వెలుగు:  సర్కారు బడుల్లో వసతుల కల్పన కోసం చేపట్టిన మన ఊరు మనబడి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల తెలంగాన పౌరస్పందన వేదిక బడుల్లో పలు అంశాల్లో సర్వే నిర్వహించారు. టీచర్ల కొరత, మన ఊరు మనబడి, పారిశుద్ధ్యం, మిడ్డెమిల్స్ తదితర అంశాల్లో ఆన్ లైన్ సర్వే  చేపట్టారు. సర్వే వివరాలను వేదిక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, కార్యదర్శి రాధేశ్యాం మీడియాకు వెల్లడించారు. 33 జిల్లాల్లో 1639 స్కూళ్లలో నవంబర్ 1 నుంచి 15 వరకూ సర్వే నిర్వహించారు. సర్వేలో వచ్చిన లోపాలపై, టీచర్ల కొరత లేదంటున్న విద్యాశాఖ డైరెక్టర్ స్పందించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. మన ఊరు మనబడి స్కీమ్ పనులు వేగవంతంచేయాలనీ, సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా అందించే భోజనంపై డీఈఓలు రివ్యూ చేయాలని కోరారు. 

  • 1639 బడుల్లో 910 స్కూళ్లు మన ఊరు మన బడి స్కీమ్లో ఎంపికయ్యాయి. కానీ వీటిలో 277 బడుల్లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదనీ, కేవలం 14 స్కూళ్లలోనే వందశాతం పనులు పూర్తయినట్టు తేలింది. 65 బడుల్లో 75% వర్క్, 87 స్కూళ్లలో 50%, 317 స్కూళ్లలో 25% పనులు పూర్తయ్యాయి. 
  • సర్వేలో పాల్గొన్న 88శాతం స్కూళ్లలో మిడ్డెమిల్స్ ఏజెన్సీల ద్వారా బడుల్లోనే వండి పిల్లలకు భోజనం అందిస్తున్నారు. రోజూ 92–100% పిల్లలు వేడివేడి భోజనం చేస్తున్నారు. కానీ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా సరఫరా అవుతున్న బడుల్లో 30–60% వరకూ మాత్రమే పిల్లలు భోజనం చేస్తున్నారు. ఉదయం సప్లై చేసిన అన్న మధ్యాహ్నాం తినడంతో రుచిఉంటడం లేదని స్టూడెంట్లు చెప్పారు. 
  • 1639 స్కూళ్లలో 1043 బడుల్లో టీచర్ల కొరత ఉన్నట్టు తేలింది. ఎస్జీటీలు 498 మంది, 266 ఎస్ఏ సోషల్, 191 ఎస్ఏ బయోలజీ, 138 ఎస్ఏ తెలుగు, 132 ఎస్ఏ హిందీ, 109 ఎస్ఏ మ్యాథ్స్, 108 ఎస్ఏ ఇంగ్లిష్, 73 ఎస్ఏ ఫిజిక్స్ టీచర్లు అవసమరని గుర్తించారు. 
  • బడుల్లో క్లీనింగ్, ఇతర పారిశుద్ధ్యపనులకోసం 47శాతం స్కూళ్లలో టీచర్లు, హెడ్మాస్టర్లు తమసొంత ఖర్చుతో చేయిస్తున్నారు.