యాదాద్రిలో వడ్ల కొనుగోలుకు కసరత్తు

యాదాద్రిలో వడ్ల కొనుగోలుకు కసరత్తు

అవసరాలకు లక్ష.. సీఎంఆర్​కు 3 లక్షలు.. బయటకు 2 లక్షల టన్నులు!

యాదాద్రి, వెలుగు :  యాసంగి వడ్ల కొనుగోలుపై యాదాద్రి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి 2,84,694 ఎకరాల్లో వరి సాగు చేశారు. పూర్తిగా దొడ్డు రకాలే సాగు చేయడంతో ఎకరానికి 20 క్వింటాళ్లకు మించి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ లెక్కన జిల్లాలో 6 లక్షల టన్నులకు పైగా దిగుబడి రానుంది. 

300 పైగా కొనుగోలు సెంటర్లు

జిల్లాలో వచ్చేనెల 15 నుంచి వడ్లను కొనుగోలు చేయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 300కు  పైగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్​ 220 సెంటర్లు ఏర్పాటు చేయనుండగా ఐకేపీ 78 సెంటర్లు ఏర్పాటు చేయనుంది. కొనుగోలు చేసే వడ్ల కోసం 1.20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం కాగా,  సివిల్​ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ వద్ద 70 లక్షల బ్యాగులు స్టాక్​ ఉన్నట్టు సమాచారం.

మిగతా బ్యాగుల కోసం ఇండెంట్​పెట్టినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈసారి 6 లక్షల టన్నుల వడ్లు దిగుబడి వస్తుండగా, ఇందులో రైతుల అవసరాలకు పోను 5 లక్షల మెట్రిక్​ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అయితే జిల్లాలో సీఎంఆర్​ మిల్లులు 44 మాత్రమే ఉన్నాయి. వాటిలో స్టోరేజీ సామర్థ్యంతో సరిగా లేకపోవడం, మిల్లింగ్​ కెపాసిటీ తక్కువ కారణంగా సకాలంలో బియ్యం అందించడం లేదు.  గతంలో 4.23 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసి.. జిల్లాలోనే సీఎంఆర్​కు ఇవ్వడం వల్ల జిల్లా యంత్రాంగం ఇబ్బందులెదుర్కొంది.

అందుకే మార్కెట్​కు వచ్చే ఐదు లక్షల టన్నుల్లో మూడు లక్షల టన్నులే జిల్లాలోని సీఎంఆర్​ మిల్లులకు ఇచ్చి.. మిగతా రెండు లక్షల టన్నులను ఇతర జిల్లాల్లోని సీఎంఆర్​ మిల్లులకు పంపించాలని జిల్లా ఆఫీసర్లు చూస్తున్నారు. ఇదిలా ఉండగా బియ్యం డిమాండ్​ పెరుగుతుండడంతో బహిరంగ మార్కెట్​లో మద్దతు ధరకు సమానంగా వడ్లను ప్రైవేట్​ మిల్లర్లు కొనుగోలు చేసే అవకాశముందని అంటున్నారు.