కలెక్షన్​ వస్తలేదని బస్సులు బంద్​ పెడ్తరా

కలెక్షన్​ వస్తలేదని బస్సులు బంద్​ పెడ్తరా
  • కామారెడ్డి జడ్పీ మీటింగ్​లో సమస్యలపై ఆఫీసర్లను నిలదీసిన సభ్యులు
  • 8 శాఖలపై చర్చతో ముగిసిన సమావేశం

కామారెడ్డి , వెలుగు:  జిల్లాలో సర్కారు బళ్లపై పర్యవేక్షణ లోపించిందని, తరుచూ మిడ్​ డే మిల్స్​ వికటించి ఫుడ్​ పాయిజనింగ్​తో స్టూడెంట్స్​ ఆసుపత్రుల పాలవుతున్నా ​బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జడ్పీ సభ్యులు ఆఫీసర్లను నిలదీశారు. టీచర్లను ఇష్టారీతిన డిప్యూటేషన్​పై పంపుతున్నారని, దీంతో కొన్ని బళ్లలో టీచర్లు లేక చదువులు సాగుతలేవని, అయినా విద్యాధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు. కామారెడ్డి జడ్పీ మీటింగ్​ చైర్​పర్సన్​ దఫేదర్​ శోభ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్​ మీటింగ్​ హాల్​లో జరిగింది. సమావేశానికి కలెక్టర్​ జితేష్​ వి పాటిల్, జుక్కల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్​ షిండే, జాజాల సురేందర్​, ఆయా శాఖల ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కారు బళ్లలో సమస్యలను సభ్యులు లేవనెత్తారు. మాచారెడ్డి మండలం భవానిపేటలో ఇటీవల మిడ్​ డే మీల్స్​ వికటించిన 30 మందికి పైగా స్టూడెంట్స్​ఆసుపత్రి పాలైన విషయాన్ని జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి ప్రస్తావించారు.

గతంలో కూడా ఈ స్కూల్​లో ఇలాగే ఫుడ్​పాయిజనింగ్​ జరిగిందని, అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీఈవో రాజును నిలదీశారు. మిగిలిన మండలాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, కొన్నిచోట్ల మధ్యాహ్న భోజనం వండేందుకు అసలు బియ్యమే లేవని రాంరెడ్డి చెప్పారు. స్కూళ్లలో విద్యా ప్రమాణాలు బాగా దిగజారాయని, చదువు చెప్పడంలో టీచర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. పెద్దకొడప్​గల్​ మండలంలో చాలా టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయని , ఉన్న కొద్దిమందిని కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియాలకు డిప్యూటేషన్లపై పంపిస్తున్నారని ఎంపీపీ ప్రతాప్​రెడ్డి ప్రస్తావించారు. కొందరు టీచర్లు మూడు, నాలుగు ఏండ్లుగా డ్యూటీ కి రాకున్నా జీతాలు మాత్రం తీసుకుంటున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్, టీచర్ల వ్యవహారంపై ఎంక్వైరీ చేయించి, చర్యలు తీసుకుంటామన్నారు. మిడ్​ డే మిల్స్​ను కో అర్డినేటర్లు పర్యవేక్షణ చేసేలా చూడాలని డీఈవోను ఆదేశించారు. 

అర్హులకు పింఛన్లు రాలే

ఇటీవల కొత్తగా ఆసరా పింఛన్లు శాంక్షన్​ చేసినప్పటికీ అర్హులైన చాలా మందికి పింఛన్లు రాలేదేని పలువురు టీఆర్​ఎస్​జడ్పీటీసీలు, ఎంపీపీలు సభ దృష్టికి తెచ్చారు.  ఎంపీడీవోల ద్వారా అప్లై చేసుకున్న వాళ్లకు మాత్రమే వచ్చాయయని, మీ సేవాలో అప్లయ్​ చేసుకున్న వారిలో చాలా మందికి మిస్​అయ్యాయని చెప్పారు. పింఛన్​ కార్డులు శాంక్షన్​ చేశాక కొంత మంది పేర్లను తొలగించారని, ఇలా ఎందుకు జరిగిందని డీఆర్​డీవోను ప్రశ్నించారు. దీంతో పింఛన్లు రాని అర్హులను గ్రామాల వారీగా గుర్తించి, లిస్టులు తయారుచేయాలని కలెక్టర్​ఆఫీసర్లకు సూచించారు. ఇందు కోసం స్పెషల్​ డ్రైవ్​ చేపట్టాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లి అర్హులైన అందరికీ పింఛన్​వచ్చేలా చూస్తామని జుక్కల్​ ఎమ్మెల్యే హన్మంతుషిండే హామీ ఇచ్చారు. 

జుక్కల్​ ఏరియా నుంచి బస్సులెవ్వి?

జుక్కల్​ ఏరియా నుంచి జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్సులు ఎందుకు నడిపించడం లేదని డీఎం మల్లేశంను ఎమ్మెల్యే హన్మంతుషిండే ప్రశ్నించారు. కొద్ది రోజులు నడిపించామని, కానీ డీజిల్​పైసలు కూడా రానందున రద్దు చేశామని డీఎం అన్నారు. మరి ప్రజలు జిల్లా కేంద్రానికి ఎలా రావాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మరో రూట్ లోనైనా బస్సు నడిపించేందుకు ప్రయత్నించాలన్నారు. మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, బీర్కుర్, లింగంపేట, రాజంపేట మండలాలకు బస్సుల సమస్యపై సభ్యులు డీఎంను ప్రశ్నించారు. కలెక్షన్​టార్గెట్​రీచ్​కావడం లేదనే సాకుతో బస్సులు బంద్​పెట్టడం సరికాదన్నారు. మీటింగ్​కు ఆర్​ఎం ఎందుకు రాలేదని, జడ్పీ అంటే ఆర్టీసీ ఆఫీసర్లు చులకన భావంతో చూస్తున్నారని సభ్యులు పేర్కొనగా, ఆర్​ఎంపై చర్యలకు సిఫారస్సు చేస్తానని కలెక్టర్​ హామీ ఇచ్చారు. కేవలం 8 శాఖలపై చర్చించి మీటింగ్​ ముగిసినట్లు ప్రకటించారు. సమావేశంలో జడ్పీ సీఈవో సాయాగౌడ్​, లైబ్రరీ చైర్మన్​ పున్న రాజేశ్వర్ పాల్గొన్నారు.

దళితబంధుపై రగడ

దళితబంధు అర్హులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం గ్రామాలవారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కాంగ్రెస్​ పార్టీ జడ్పీ ఫ్లోర్​ లీడర్​,  రామారెడ్డి జడ్పీటీసీ నారెడ్డి మోహన్​రెడ్డి సూచించారు. ఆయన మాట్లాడుతుండగానే  పక్కనే ఉన్న జడ్పీ కో అప్షన్​ మెంబర్​ మాజీద్​ ఖాన్​ మోహన్​రెడ్డి చేతిలోంచి మైకు లాక్కున్నారు.  దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.  జడ్పీ వైస్​చైర్మన్​ ప్రేమ్​కుమార్​ కల్పించుకొని దళితుల గురించి మట్లాడేటప్పుడు అడ్డుచెప్పడం సరికాదన్నారు.  ఏ పార్టీ అధికారంలో ఉన్నా  అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు.  జుక్కల్​  ఎమ్మెల్యే హన్మంతుషిండే మాట్లాడుతూ.. విడతల వారీగా ప్రతి దళిత ఫ్యామిలీకి దళితబంధు వస్తుందని చెప్పారు.  వచ్చే నెలలో ప్రతి నియోజక వర్గంలో 500 ఫ్యామిలీలకు ఇస్తామని చెప్పారు. గత 70 ఏండ్లు పాలించిన  పార్టీలు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని,  కేసీఆర్​ దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్​ అన్నారు.  పార్టీలకు అతీతంగా స్కీమ్లు అమలు చేస్తున్నామని చెప్పారు.