RRR ఎఫెక్ట్.. థియేటర్ల ముందు ముళ్ల కంచెలు

RRR  ఎఫెక్ట్.. థియేటర్ల ముందు ముళ్ల కంచెలు

స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్‌కు పండగ. ఇక స్టార్ హీరోల కాంబినేషన్.. అంటే ఆ హీరోల అభిమానులకు డబుల్ ట్రీట్. అయితే మూడు గంటలు... ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ను ఓ థియేటర్‌లో బంధించి పెట్టడం కష్టమే. అలాంటి సినిమాయే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఫ్యాన్స్‌ను అలరించే దృశ్యాలు సినిమాలో బోల్డన్ని ఉన్నాయి. ఆరంభం నుంచి చివరి దాకా ప్రేక్షకులను కట్టిపడేసేలా సినిమా ఉందని ఇప్పటికే ఓ మంచి టాక్ ఉంది.  పాటలు, ట్రైలర్లకు నానా హంగామా చేస్తున్న ఈ ఫ్యాన్స్‌ను రిలీజ్‌ రోజు తట్టుకోవడం కష్టమని థియేటర్ ఓనర్లు భావించారు. 

అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. తమ థియేటర్‌  స్క్రీన్స్‌ ముందు ముళ్ళ కంచెను కొందరు ఏర్పాటు చేస్తే.. మరి కొందరు సినిమా స్క్రీన్‌ ముందు మేకులకు దిగ్గొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పెద్ద థియేటర్లు ఇప్పుడు ఇలాంటి ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఆధునిక హంగులతో కట్టుకున్న థియేటర్‌ నిర్మాతలు... తాజాగా ముళ్ళ కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఏపీలో విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్‌లో స్క్రీన్ ముందు మేకులను, ఫెన్సింగ్‌లను అమర్చారు. స్క్రీన్‌కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండేందుకే ఇలా ఏర్పాటు చేశామని యజమానులు చెబుతున్నారు. అభిమానులు సహకరించాలని వారు కోరుతున్నారు.