మెదక్లో ఎక్కడబడితే అక్కడే చెత్తను తగులబెడుతున్రు

మెదక్లో ఎక్కడబడితే అక్కడే చెత్తను తగులబెడుతున్రు
  • పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలు 
  • మున్సిపల్​పట్టణాల్లో పరిస్థితి ఇదీ.. 
  • పట్టించుకోని అధికారులు 

మెదక్, సంగారెడ్డి, వెలుగు :  మెదక్ మున్సిపల్ పరిధిలో 32 వార్డులు ఉండగా రోజూ ఇల్లు, షాప్ ల నుంచి దాదాపు 23 టన్నుల చెత్త పోగవుతోంది. పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరించి ట్రాక్టర్ల ద్వారా డంప్ యార్డ్ కు తరలిస్తున్నప్పటికీ అక్కడ సెగ్రిగేషన్ చేయకుండా ఇష్టారీతిగా తగులబెడుతున్నారు. దీంతో దట్టమైన పొగ వెలువడి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తోంది.  కాలుష్యం, పొగతో తారకరామానగర్​ కాలనీ, ఇందిరాపురి కాలనీ, మిలిట్రీ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు, స్పోర్ట్స్​ స్టేడియం వైపు పొద్దున వాకింగ్ కు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా చెత్త తగులబెడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. సమీపంలోని పొలాల్లో రైతులు వరి కొయ్యలు తగులబెట్టడం వల్ల నిప్పు రవ్వలు ఎగిరివచ్చి డంప్​ యార్డులో పడటంతో చెత్త తగులబడుతోందని మున్సిపల్​ అధికారులు చెబుతున్నారు. ఒకటిరెండు సార్లు అలా కాలిపోయి ఉంటుందని, మిగతా సమయాల్లో కావాలనే తగలబెడుతున్నారన్న విమర్శలున్నాయి. రోజుల తరబడి డంప్​యార్డులో పెద్ద మొత్తంలో చెత్త తగులబడుతున్నా, పొగతో జనం ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్​ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం 5వ వార్డు కౌన్సిలర్​ విషయాన్ని లోకల్​బాడీ అడిషనల్ కలెక్టర్​దృష్టికి తీసుకెళ్తేగానీ మున్సిపల్​అధికారుల్లో చలనం రాలేదు. అడిషనల్​కలెక్టర్​ఆదేశాలతో మున్సిపల్​ చైర్మన్, వైస్​ చైర్మన్, కమిషనర్, శానిటరీ ఇన్స్​పెక్టర్లు డంప్​ యార్డును సందర్శించారు. 

సంగారెడ్డి పట్టణంలో...

జిల్లా వ్యాప్తంగా 8 మున్సిపాలిటీలు, 647 గ్రామ పంచాయతీలు ఉండగా చెత్త డంపింగ్ యార్డుల ఏర్పాటు జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. మున్సిపాలిటీల చెత్త పంచాయతీలో పారబోయొద్దని, గ్రామాల్లోని చెత్తను మున్సిపాలిటీల సరిహద్దుల్లో వేయొద్దని.. ఇలా ఎక్కడి వాళ్లు అక్కడ గొడవలు చేస్తూ ధర్నాలకు దిగి డంపింగ్ యార్డుల నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. చెత్త పారబోత సమస్య కారణంగా గతంలో మున్సిపల్ ఆఫీసుల ముందు చెత్త ట్రాక్టర్లు రోజులకొద్ది నిల్వ ఉంచిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా సంగారెడ్డికి కూత వేటు దూరంలో ఉన్న కంది పంచాయతీ పరిధిలో సేకరించిన చెత్తను కాశీపూర్ వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసు వెనకాల అసైన్డ్ భూమిలో పారబోసి తగలబెడుతున్నారు. తద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వచ్చేవారు భరించలేని దుర్గం వస్తుందని వాపోతున్నారు. పైగా పక్కనే మైనార్టీ గురుకుల పాఠశాల ఉండడంతో దట్టమైన పొగ కమ్ముకుని వాయు కాలుష్యంతో కూడిన గాలి, వాసనతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. నేషనల్ హైవే పక్కన ఉన్న హోటళ్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లలోని చెత్తాచెదారం అంతా ఇక్కడే పారబోస్తున్నారు. ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్యన నాలుగు ఎక్స్ కవేటర్లు, 5 ట్రాక్టర్లతో ఓ గుంత తీసి అందులో ఈ చెత్తంతా వేసి పూడ్చేస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల వ్యవసాయం దెబ్బతింటుందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.

మెదక్, సంగారెడ్డి మున్సిపల్ పట్టణాల్లో చెత్తను ఎక్కడబడితే అక్కడే తగులబెడుతున్నారు. దట్టమైన పొగలు వ్యాపిస్తూ, వాయు కాలుష్యంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో రోజురోజుకూ ఈ సమస్య పెరుగిపోతోందని పలువురు ఆందోళన చెందుతున్నారు.