
ఎండాకాలంలో చెమట ఎక్కువ పడుతుంది. ఈ చెమట స్కిన్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ముఖ్యంగా వేసవిలో తామర, అథ్లెట్పూట్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. అయితే చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్లని చిన్న సమస్య అనుకుంటారు. దాంతో వీళ్ల నుంచి మరొకరికి ఈ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అందుకే వీటికి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు డెర్మటాలజిస్ట్‌లు. ఈ సీజన్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు వాళ్లు చెప్తున్న జాగ్రత్తలివి...
ఫంగల్ ఇన్ఫెక్షన్లు అన్ని సీజన్లలో వస్తాయి. అయితే, ఇవి ఎండాకాలంలో ఎక్కువ కనిపించడానికి కారణం చెమట ఎక్కువగా పట్టడమే. మరో విషయం ఏంటంటే... చెమట వల్ల వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్లు చర్మం మీదనే వస్తాయి. చర్మం లోపలికి వెళ్లవు. అంతేకాదు వీటికి డయాగ్నసిస్ అవసరం చాలా తక్కువ. లక్షణాల్ని బట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్లను ఈజీగా గుర్తించొచ్చు. వీటికి ట్రీట్మెంట్ కూడా ఈజీనే.
ఫంగస్ వల్ల వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్లలో తామర, సుబ్యం (తెల్లమచ్చలు), అథ్లెట్ ఫూట్... అనేవి ముఖ్యమైనవి. తామరని ‘రింగ్ వార్మ్’ అంటారు. ఇది తల నుంచి పాదాల వరకు శరీరంలోని ఏ భాగంలోనైనా రావొచ్చు. తల మీద కనిపించే తామరని ‘టినియా క్యాపిటిస్’, ముఖం మీద వస్తే ‘టినియా ఫేసియి’, శరీర భాగాల మీద కనిపిస్తే ‘టినియా కార్పోరిస్’ అని అంటారు. తామర గుండ్రంగా ఉండి దురద పెడుతుంది. రోజు రోజుకు సైజ్ పెరుగుతుంది. అంతేకాదు శరీరంలోని ఇతర భాగాలకి వ్యాపిస్తుంది కూడా. అందుకని తామరని తొందరగా గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే ఒకరి నుంచి మరొకరికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. యాంటీ ఫంగల్ క్రీమ్, లోషన్ లేదా పౌడర్ వాడినా కూడా తామర తొందరగా తగ్గిపోతుంది.
సుబ్యం
దీన్ని ‘టినియా వెర్సికోలర్’ అంటారు. ఇందులో తెల్ల సుబ్యం, నల్ల సుబ్యం అని రెండు రకాలు ఉంటాయి. చెమట ఎక్కువగా పట్టడం వల్ల వీపు, ఛాతీ మీద, బాహుమూలాల్లో తెల్లమచ్చలు వస్తాయి. ఈ మచ్చలు దురద పెట్టవు. పొడిగా ఉంటాయి. సుబ్యం తగ్గడానికి లోషన్ వాడాలి. దీంతోపాటు బాహుమూలాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.
డయాబెటిస్ ఉన్నవాళ్లు
డయాబెటిస్ ఉన్నవాళ్లు తొందరగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. వీళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువ. ఎందుకంటే వీళ్ల చెమటలో చక్కెర ఉంటుంది. దీంతో ఫంగస్ సంఖ్య పెరిగి, ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువైపోతుంది. అందుకని వీళ్లు షుగర్‌ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉంటే యాంటీ ఫంగల్ మెడిసిన్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ తీవ్రతని బట్టి డాక్టర్ చెప్పినంత వరకు ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయాలి.
గుర్తుపెట్టుకోవాల్సినవి
ఈ సీజన్లో తడి బట్టలు వేసుకోవద్దు.
మరీ బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా శరీరానికి గాలి తగిలేలా వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. బాహుమూలాల్లో చెమట పట్టకుండా చూసుకోవడమే కాకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు చిన్నగా కత్తిరించుకోవాలి. యాంటీ ఫంగల్ గుణాలున్న వెల్లుల్లిని తప్పని సరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి.
అథ్లెట్ ఫూట్
ఈ ఇన్ఫెక్షన్లో కాలివేళ్లు చెడిపోతాయి. అంటే.. వేళ్ల మధ్యలోని చర్మం నల్లగా లేదా తెల్లగా అవుతుంది. చర్మం దురద పెడుతుంది. వేళ్ల మధ్య చర్మం తెగిపోయి నొప్పి పుడుతుంది. కాలి వేళ్లు ఎప్పుడూ చెమట పట్టి ఉండే వాళ్లలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. వీళ్లు ఉపయోగించిన టవల్ వాడినా, వీళ్లు వేసుకున్న దుస్తులు ఇతరులు వేసుకున్నా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే... ఈకాలంలో పాదాలు తడిగా లేకుండా చూసుకోవాలి. బిగుతు షూ, చెప్పులు వేసుకోవద్దు. రెండు రకాల షూ ఉంటే బెటర్. బిగుతుగా ఉండే సాక్స్‌లు వేసుకోవద్దు. ఏరోజుకారోజు ఉతికిన సాక్స్‌లు వాడాలి.
–డాక్టర్.స్వప్న ప్రియ, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్.