తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వ దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. ఈ రద్దీ వల్ల ఈ నెల 1, 7, 8, 14, 15 తేదీల సర్వదర్శనం టైమ్‌స్లాట్‌ టోకెన్ల (ఎస్‌ఎస్‌డీ) జారీని టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

పవిత్రమైన పురటాసి మాసంలో రెండో శనివారంతో పాటు వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతి, తిరుమలకు వెళ్లే రహదారులు, పార్కింగ్‌ ప్రాంతాలన్నీ భక్తులు, వాహనాలతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఒకటి, రెండు కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లలో భక్తులు కిటకిటలాడుతున్నారు. క్యూలైన్లు నందకం విశ్రాంతి భవనం వరకు 5 కిలోమీటర్లకు పైగా విస్తరించాయి. 

శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 55వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 34 వేల మంది కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. వసతి దొరక్క చాలామంది ఫుట్‌పాత్‌లపైనే సేద తీరుతున్నారు. రద్దీ దృష్ట్యా గురువారం (సెప్టెంబర్ 28) నుంచి క్యూలైన్లలోని భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ టీటీడీ అందిస్తోంది. 2 వేల 500 మంది  శ్రీవారి సేవకులు వివిధ షిప్టుల్లో సేవలందిస్తున్నారు.