‘గొడుగు’ వెనుక పెద్ద కథే ఉంది

‘గొడుగు’ వెనుక పెద్ద కథే ఉంది

రాబోయేది వర్షాకాలం. బయటకు వెళ్లాలంటే తోడుగా గొడుగు ఉండాల్సిందే. లేకపోతే తడిసి ముద్దవడం ఖాయం. ఎంత రెయిన్​కోట్స్​ ఉన్నా.. మొన్నమొన్నటి దాకా ఎండలో, వానలో కాపాడింది గొడుగే. అందుకే ఇప్పటికీ దీని ప్రాముఖ్యం తగ్గలేదు. ఎన్ని వచ్చినా మనదేశంలో అయితే గొడుగులదే హవా. అలాంటి అంబ్రెల్లా వెనక పెద్ద కథే ఉంది. 

‘అంబ్రెల్లా’ అనే పదం లాటిన్​ భాష నుంచి వచ్చింది. లాటిన్​లో ‘అంబ్ర’ అంటే నీడ అని అర్థం. నిజానికి మొదట గొడుగులను తయారుచేసింది ఎండ బారి నుంచి కాపాడేందుకు. అందువల్లే దీన్ని ‘అంబ్ర’ అనేవాళ్లు. అయితే, రానురాను వానలో తడవకుండా ఉండేందుకు కూడా గొడుగు చక్కని సాధనమైంది. గొడుగును ‘పారసోల్​’ అని కూడా అంటారు. ఇది ఇటాలియన్​ పదం. దీని అర్థం కూడా  ‘ఎండ నుంచి రక్షణ’ కావడం గమనార్హం.   
చైనాలో నాలుగు వేల ఏండ్ల కిందటే గొడుగులు వాడిన ఆధారాలున్నాయి. అలాగే అంతకంటే ముందే ప్రాచీన ఈజిప్టులో వీటి వాడకం ఉన్నట్లు తెలుస్తోంది. 

  • ఈజిప్టులో బయటపడిన పురాతన విగ్రహాలు, చిత్రాల్లో గొడుగు ఉంది. అప్పట్లో వీటిని రకరకాల పక్షుల ఈకలు, తామర ఆకులతో తయారుచేసేవారని వీటిని చూస్తే తెలుస్తోంది. వీటిని రాజులు, దేవుళ్లు/దేవతలకు ఎండ పడకుండా చేసేందుకు, గౌరవసూచకంగా వాడేవారు. 
  • ప్రాచీన చైనాలో రాజులకు ఎండ తగలకుండా పట్టుతో తయారుచేసిన గొడుగులను సేవకులు పట్టుకునేవారు. అందుకే అప్పటి చైనా చిత్రాల్లో రకరకాల పూలు, పక్షులు, ప్రాంతాలను చిత్రీకరిస్తూ సిల్క్​తో తయారుచేసిన పారసోల్స్​ కనిపిస్తాయి.
  • చైనాలో తయారయ్యే ఆయిల్​‌‌‌‌–పేపర్​ గొడుగులకు వెయ్యేండ్ల  హిస్టరీ ఉంది. హాన్​ వంశీయుల కాలంలో మొదట వాడుకలోకి వచ్చిన ఈ రకం గొడుగులు స్థానిక కళాకారుల నైపుణ్యాన్ని చెప్తాయి. వీటిని వెదురు, బంక, పట్టు, ఈకలు, ఆకులు వంటి వాటిని వాడి తయారుచేస్తారు. చైనీస్​ సినిమాలు చూస్తే ఈ గొడుగులు కనిపిస్తాయి. 
  • మొదట్లో గొడుగును ఆడవాళ్లు మాత్రమే వాడే వస్తువుగా భావించేవారు. అయితే, యూరప్​ సామాజిక వేత్త జొనాస్​ హాన్వే 1750లో మొదటిసారి గొడుగుతో లండన్​ వీధుల్లో తిరిగాడు. దీంతో ఆ తర్వాత క్రమంగా మగవాళ్లు కూడా గొడుగు వాడడం మొదలుపెట్టారు. 
  • బ్రిటన్​ వ్యాపారవేత్త జేమ్స్​ స్మిత్​ 1830లో లండన్​ వేదికగా ‘జేమ్స్​ స్మిత్​ అండ్​ సన్స్’ పేరుతో మొట్టమొదటి  మోడర్న్​ గొడుగుల దుకాణం ప్రారంభించాడు. ఇది ఇప్పటికీ ఉంది.  చేతితో తయారుచేసిన పలు రకాల గొడుగులు ఇక్కడ ఉంటాయి. 
  • తలపైన టోపీలా ధరించే గొడుగును కనుగొన్నట్లు1880లో ఒక పుకారు వచ్చింది. రాబర్ట్​ డబ్ల్యూ ప్యాటన్​ అనే ఆయన మెక్సికోలో పురాతన శిలాజాలు, లోహాల కోసం వెతుకుతున్నప్పుడు ఈ టోపీ గొడుగును గుర్తించినట్లు చెప్పాడు. 
  • గొడుగులను ఉంచడానికి ఉపయోగపడే స్టాండ్​లపై 1885లో విలియం సి.కార్టర్​ పేటెంట్​ పొందాడు.
  • బీచ్​ల్లో ఉపయోగించే గొడుగుల్లో ఫ్రాంక్​ఫోర్డ్​ మంచి పేరు పొందింది. ఇది గట్టిగా ఉండడంతోపాటు అంత తేలికగా గాలికి ఎగిరిపోదు.  దీన్ని 1940లో తయారుచేశారు. 

  • జ్యూస్​ ఉన్న గ్లాసుల మీద చిన్న చిన్న గొడుగులను ఉంచడాన్ని 1959లో హవాయిలోని ఓ హోటల్​ వెయిటర్​ మొదలుపెట్టాడు. తాను తయారుచేసిన ప్రత్యేక జ్యూస్​ మిశ్రమాల్లో వీటిని టూత్​ పిక్​లుగా వాడేందుకు తయారుచేశాడు.  
  • కుక్కలు వర్షంలో తడవకుండా ఉండేందుకు1965లో కెన్నెత్​ వార్త్​  ప్రత్యేకమైన గొడుగులు తయారుచేశాడు.  
  • ఫోల్డబుల్​ గొడుగును 1969లో బ్రాడ్​ఫోర్డ్​ ఇ.ఫిలిప్స్​ కనుగొన్నాడు. 
  • పర్యావరణానికి అనుకూలమైన గ్రీన్​ అంబ్రెల్లాను 2011లో వేన్​ హెమింగ్వే రూపొందించాడు. 22.5శాతం ప్లాంట్​ మెటీరియల్​తోపాటు, వృథాగా పారేసిన కోక్​ బాటిల్స్​తో తయారుచేశాడు. 
  • ఒక కప్ప చిన్న ఆకును గొడుగులా పట్టుకొని ఉన్న చిత్రాన్ని 2013లో నేషనల్​ జియోగ్రాఫిక్​ ఛానెల్​ ఫొటోగ్రాఫర్​ ఒకరు ఫొటో తీశారు. ఇది అప్పట్లో ప్రపంచాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే గొడుగుల వాడకంపై సరికొత్త చర్చకు దారితీసింది. 
  • హాంకాంగ్​కు​ స్వయంప్రతిపత్తిని కోరుతూ, చైనాకు నిరసనగా 2014లో స్థానికులు జరిపిన ఉద్యమంలో గొడుగుది  ఓ సరికొత్త రోల్​. ఆందోళనకారులపై చైనా పోలీసులు పెప్పర్​ స్ప్రే చల్లితే.. దాని నుంచి రక్షణకు వాళ్లు గొడుగులు వాడారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించింది. 
  • వర్షం పడే సూచనలు ఉంటే ముందుగానే తెలిపే ‘ఊంబ్రెల్లా’ అనే స్మార్ట్​ గొడుగును వెజూ కంపెనీ 2016లో తయారుచేసింది. దీన్ని బ్లూటూత్​ ద్వారా ఫోన్​కు కనెక్ట్​ చేసుకొని  అది పంపే మెసేజ్​లను తెలుసుకోవచ్చు. 
  • డ్రోన్​ ద్వారా ఎగిరే గొడుగును 2018లో జపాన్​లో ఆవిష్కరించారు. వర్షం పడేటప్పుడు తలపై ఎగురుతూ మనల్ని తడవనీయదు. చేత్తో పట్టుకోవాల్సిన అవసరమే లేదు. 
  • అమెరికాలోని న్యూ అర్లీన్స్​ నగరంలో పెళ్లి వేడుకలకు గొడుగులను తీసుకెళ్లడం ఒక ట్రెడిషన్​. 
  • అమెరికాలో గొడుగులపై దాదాపు 1,20,000 ల పేటెంట్లు ఉన్నాయి. అలాగే అక్కడి జనాభాలో సుమారు 45 శాతం మంది దగ్గర గొడుగులున్నాయి. అంతేకాదు, ఇక్కడ ఏటా సుమారు 33 మిలియన్​ (సుమారు 3 కోట్ల 30 లక్షల) గొడుగులు అమ్ముతారు.

వీధులపైన గొడుగులు
పోర్చుగల్​లోని అగ్యుడా నగరంలో ఏటా అగ్యుడా అగితాగ్యుడా ఆర్ట్​ ఫెస్టివల్​లో భాగంగా వీధుల్లో రంగు రంగుల, అందమైన గొడుగులు ఎగురుతుంటాయి. టూరిజం పెంచేందుకు ఇలా గొడుగులను గాల్లో వేలాడదీస్తారు. దాన్ని చూడడానికి దేశ, విదేశాల నుంచి ఇక్కడికి సందర్శకులు క్యూ కడతారు. 

కన్నుల పండుగ.. బో సంగ్​ ఫెస్టివల్​
థాయ్​లాండ్​లోని బో సంగ్​ (బోర్సంగ్​) గ్రామంలో ప్రతి ఏడు అంబ్రెల్లా ఫెస్టివల్​ కన్నుల పండుగగా జరుగుతుంది. చియాంగ్​ మైయి నగరానికి తూర్పున కూతవేటు దూరంలో ఉంటుంది బో సంగ్​. పండుగ రోజు రకరకాల రంగుల్లో వేలాది వెదురు గొడుగులు కనువిందు చేస్తాయి. ప్రతి షాపు దగ్గర వీటిని అలంకరిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్​ను చూడడానికి వేలాది మంది వెళ్తారు.  స్థానికులు, జానపద కథల ప్రకారం ఇక్కడి గొడుగుల తయారీకి వందల ఏండ్ల చరిత్ర ఉంది. అప్పట్లో థాయ్​లాండ్​ నుంచి బర్మాకు వేలాది మంది చదువుకోవడానికి వెళ్లేవారు.

అలాంటివాళ్లలో ‘ ఫ్రా ఇంతా’ ఒకరు. ఆయన ఒకసారి​ బర్మా నుంచి వస్తుండగా ఎండ నుంచి రక్షణకు అక్కడి వారు ఒక గొడుగు ఇచ్చారు. ఆయన ఆ గొడుగును తయారుచేసిన గ్రామానికి వెళ్లి వాటి తయారీని గమనించాడు.  అక్కడే ఉండి ఆ గొడుగులు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. తిరిగి సొంతూరు బో సంగ్​కు వచ్చాడు.  గ్రామాల్లో పంటల కాలం లేనప్పుడు ఆదాయం ఉండదు. ఆ టైంలో గొడుగులు తయారుచేసి ఆదాయం సంపాదించమని గ్రామస్థులకు నేర్పించాడు.  ఆ తర్వాత ఈ ఊరు గొడుగుల తయారీకి కేరాఫ్​ అడ్రస్ అయింది. అందుకే ఈ గ్రామంలో ఇప్పటికీ ఆయన విగ్రహం కనిపిస్తుంది. 

ఇవి కూడా చదవండి

ఈ ఊళ్లో ఇండ్లన్నీ ఒకేలా ఉంటాయి

జై భీమ్​ కోసం అడవిలో తిరిగా

స్ట్రాటజీ పాలిటిక్స్!