మంత్రి కంటే ఎక్కువ డెవలప్ చేశామంటున్న ఎమ్మెల్యేలు

మంత్రి కంటే ఎక్కువ డెవలప్ చేశామంటున్న ఎమ్మెల్యేలు
  • ఎన్నో పనులు చేశాం.. చాలా ఫండ్స్ తెచ్చామంటున్న మంత్రులు

హైదరాబాద్, వెలుగు: అధికార పార్టీలో నేతల మధ్య అభివృద్ధిలో పొల్చుకోవడం పెరుగుతున్నది. ఇది కాస్త మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారింది. మొన్నటి దాకా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలే అభివృద్ధి చేసుకున్నారనే విమర్శ ఉండేది. ఇప్పుడు జిల్లాల్లో సంబంధిత మంత్రి కంటే.. తామే ఎక్కువ డెవలప్ చేశామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గానికి ఏమేం చేసింది చెప్తూ సంబంధిత జిల్లా మంత్రి నియోజకవర్గం కంటే ఏం ఎక్కువున్నాయో ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కొంతమంది మంత్రులు జిల్లాలో అందరు ఎమ్మెల్యేల కంటే తామే ఎక్కువ చేశామని సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాలకు వెళ్తున్న టైంలో ఏం చేశారని జనాలు నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేలు మంత్రులతో.. మంత్రులు ఎమ్మెల్యేలతో పోల్చుకుంటూ కామెంట్స్​ చేస్తున్నారు. ఇది ఎలక్షన్లలో ఎటుదారిస్తుందోననే చర్చ జరుగుతోంది.

ఒక్కో జిల్లాలో ఒక్కోలా

నిజామాబాద్ జిల్లాలో మంత్రి నియోజకవర్గం కంటే.. తానే ఎక్కువ డెవలప్ చేశానని ఆ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యకర్తలతో చెప్పుకున్నారు. సీఎం తనకు చాలా దగ్గర అని.. అందులో భాగంగానే నియోజవకర్గంలో ఎక్కువ పనులు చేయించానని.. మంత్రి తనతో పోటీలో కూడా లేరని పేర్కొన్నట్లు  తెలిసింది. ఇది కాస్త మంత్రి చెవిన పడింది. దీంతో ఆయన జిల్లాకు ఏమేం తెచ్చారో చెప్పుకుంటూ వస్తున్నారు. తన నియోజకవర్గ ప్రజలకు ఏమేం అందాయి? రోడ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కాలేజీ ఏర్పాటు వంటివన్నీ లెక్కలు తెప్పించుకుని ప్రసంగాలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇద్దరు మంత్రుల కంటే తానే చాలా బెటర్ అని ఒక ఎమ్మెల్యే అందరి ముందే అంటున్నారు. 

తాను చేసినంతలో సగం కూడా ఆ మంత్రులిద్దరూ కలిపి చేయలేకపోయారని ఇటీవల మీడియా చిట్​చాట్​లో చెప్పుకున్నారు. అందులో ఒక మంత్రి.. తాను బీసీగా ఉండి చాలామందికి హెల్ప్ చేశానని.. నియోజకవర్గంలో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసినట్లు పేర్కొంటున్నారు. జిల్లా ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కాదనకుండా అన్ని పనులు చేయిస్తే.. తనకంటే ఎక్కువ చేశామని ఎలా అంటున్నారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా అని మండల స్థాయి లీడర్ల సమావేశంలో సదరు మంత్రి వాపోయారు. ఉమ్మడి వరంగల్​, ఖమ్మం జిల్లాల్లోనూ ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య డెవలప్​మెంట్ వార్ నడుస్తున్నది.