మేనేజ్మెంట్ సీట్ల కోసం జోరుగా బేరాలు

మేనేజ్మెంట్ సీట్ల కోసం జోరుగా బేరాలు

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు పేద విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో ఉన్నత విద్యకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు దూరమౌతున్నారు. ఇంజనీరింగ్ విద్య అంటే హైదరాబాద్ నగరమే అనే రీతిలో కాలేజీలు వ్యవహరిస్తున్నాయి. అ కాలేజీలకు అధికారులు అండగా ఉంటూ వారు చెప్పినట్లు నడుస్తున్నారనే అరోపణలు వస్తున్నాయి. ఒక పక్క ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తికాకముందే.. మరోపక్క ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మేనేజ్ మెంట్  కోటా సీట్ల బేరం జోరుగా సాగిస్తున్నాయి. తక్కువ ర్యాంకు ఉన్న వాళ్ళను గుర్తించి వారి నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్  సైన్స్  కోర్సు పేరుతో అడ్డూ అదుపూ లేకుండా పిండేస్తున్నాయి. కేవలం మేనేజ్ మెంట్  కోటా సీట్ల అమ్మకం కోసం దాదాపు అన్ని కాలేజీలు ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసుకున్నాయి. ఎంక్వైరీ కోసం వచ్చే వారికి, తల్లిదండ్రులకు ఫోన్లు చేసి.. సీట్లు అయిపోతున్నాయని చెబుతూ వల వేస్తున్నాయి. ముందే బుక్  చేసుకుంటే 20 వేల రూపాయల నుంచి 25 వేల వరకు రాయితీ ఇస్తామంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా  అధికారులు తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్  కాలేజీల్లో.. మేనేజ్ మెంట్  సీట్లు 35 వేల వరకు ఉన్నాయి. ఈ ఏడాది వందకు పైగా కాలేజీలు మెకానికల్, సివిల్ విభాగాల్లో సీట్లు తగ్గించుకుని, కంప్యూటర్  సైన్స్, ఆర్టిఫీషియల్  ఇంటెలిజెన్స్, సైబర్  సెక్యూరిటీ, డేటా సైన్స్  కోర్సుల సీట్లు పెంచుకున్నాయి. ఆ సీట్లకున్న డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్  సైన్స్  సంబంధిత కోర్సు చేయించాలని ఆశిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు.. టాప్  కాలేజీల యాజమాన్యాల దగ్గర సీట్ల కోసం క్యూ కడుతున్నారు. ఎంసెట్  ఫలితాలు వెల్లడైన మరుక్షణం నుంచే కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా పీఆర్వోలు.. ఏజెంట్లను, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకున్నాయి. వాళ్ళు 40 వేల ర్యాంకు పైన వచ్చిన విద్యార్థుల ఫోన్  నంబర్లు సంపాదించి, సీటు కోసం ఎర వేస్తున్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ప్రభుత్వం.. అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరికాదంటున్నారు టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు. జేఎన్టీయూ కాలేజీల్లో ఫ్యాకల్టీ, సౌకర్యాలపై తనిఖీలు చేస్తున్న టైంలో కౌన్సిలింగ్ నిర్వహించడం.. ప్రభుత్వం వర్సిటీలను విస్మరించటమే అవుతుందంటున్నారు. వర్సిటీల అధికారులు., ఉన్నత విద్యామండలి అధికారుల మధ్య సమన్వయ లోపంతో.. విద్యార్థులు నష్టపోతున్నారంటున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నా.. ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జేఎన్టీయూ తనిఖీల రిపోర్ట్ వెంటనే బయట పెట్టాలంటున్నారు టెక్నికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు.


షెడ్యూల్ కంటే ముందే రూల్స్ కు విరుద్ధంగా.. మేనేజ్మెంట్ సీట్ల అడ్మిషన్లు చెల్లవన్నారు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి. కాలేజీలు ఏమైన అడ్మిషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఉన్నత విద్యామండలి విధివిధానాలు ప్రకటించిన తర్వాత అడ్మిషన్లు తీసుకోవాలని లింబాద్రి తెలిపారు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సులే కాకుండా సాంప్రదాయ కోర్సులను కూడా చదవాలని జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ విద్యార్థులు  సరిగా నిర్ణయం తీసుకుని.. వారికి నచ్చిన కోర్సులను ఎంచుకుని చదువాలని.. కంప్యూటర్ కోర్సులతో పాటు అన్ని కోర్సులకు మార్కెట్ లో మంచి స్కోప్ ఉందన్నారు. జేఎన్టీయూ నిర్వహిస్తున్న కాలేజీల తనిఖీలు దాదాపు పూర్తయ్యాయని.. కొన్ని కాలేజీల్లో సీట్లు తగ్గే అవకాశం ఉందన్నారు మంజూర్ హుస్సేన్. విద్యార్థులు అందోళన చెందకుండా కౌన్సిలింగ్ ప్రకియ పూర్తి చేసుకోవాలని.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఇంజనీరింగ్ ఫీజులు ఉంటాయని లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలో సగానికి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు రాజకీయ నాయకులవే ఉన్నాయి. దీంతో వాళ్లు చెప్పినట్లు ప్రభుత్వం, యూనివర్సీటీల అధికారులు వింటున్నారని మండిపడుతున్నారు విద్యావేత్తలు. ఇంజనీరింగ్  సీట్ల పేరుతో కోట్ల రూపాయిల దందా చేస్తూ.. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యావేత్తలు.