టీఆర్ఎస్​ఎమ్మెల్యేలపై ప్రజల ఒత్తిడి 

టీఆర్ఎస్​ఎమ్మెల్యేలపై ప్రజల ఒత్తిడి 

టీఆర్ఎస్​ఎమ్మెల్యేలపై ప్రజల ఒత్తిడి 

ఆదిలాబాద్​లో రాస్తారోకో

ఆదిలాబాద్/సంగారెడ్డి/శివ్వంపేట, వెలుగు: నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే రోడ్డు బాగు పడుతుందంటూ ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఆరు గ్రామాల ప్రజలు ఆదివారం నిపాని గ్రామం వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాస్తారోకో చేపట్టారు. జందాపూర్ నుంచి కరంజీ వరకు 46 కిలోమీటర్ల దూరం ఉంటుందని, 33 కిలోమీటర్ల రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా మారిందన్నారు. మునుగోడు వెళ్లిన నేతలకు ఇక్కడి ప్రజల సమస్యలు పట్టడం లేదని, వెంటనే బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. అప్పుడే రోడ్డు బాగు పడుతుందన్నారు.  

అందోల్, జహీరాబాద్​ ఎమ్మెల్యేలకు ఫోన్​
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుకు మనియార్ పల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అక్రమ్ షా ఆదివారం ఫోన్ చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కోరారు. మీ రాజీనామాతో మునుగోడు తరహాలో తమకు లబ్ధి చేకూరుతుందని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ను అడిగి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే మాణిక్ రావు అతడికి సర్దిచెప్పారు. అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు అల్లాదుర్గం మండలం మాందాపూర్ గ్రామం నుంచి కృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేసి రాజీనామా కోరాడు. ఎమ్మెల్యే క్రాంతి ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టానని చెప్పారు. అతని ఊరు, పేరు అడిగి రేపు వచ్చి మాట్లాడుతానని బదులిచ్చారు. 

రాజీనామా కోరిన వ్యక్తిపై ఫిర్యాదు
నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్ రెడ్డికి శనివారం ఫోన్​ చేసి పదవికి రాజీనామా చేయాలని కోరిన బీజేపీ శివ్వపేట మండలం ఉసిరికపల్లి ప్రధాన కార్యదర్శి అశోక్​పై టీఆర్ఎస్​ నాయకులు ఆదివారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. 

ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు
రాజీనామా చేస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందంటూ రెండు రోజుల క్రితం మెదక్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డికి రామాయంపేటకు చెందిన స్వామి ఫోన్​ చేశాడు. ఆదివారం ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు స్వామికి ఫోన్​చేసి బెదిరించారు. సారీ అంటూ వాయిస్​ మెసేజ్​ పెట్టాలని హెచ్చరించాడు.