సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లోనే అభివృద్ధి లేదు

సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లోనే అభివృద్ధి లేదు
  • పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లోనే అభివృద్ధి ఏమాత్రం జరగలేదని, సీఎం దత్తత గ్రామాల్లోనే పనులు అంతంత మాత్రమే చేపట్టిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తుందని పీసీసీ  కార్యనిర్వహక అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లిలో ఈ నెల 24, 25తేదీన అంటే రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారాల్లో చేపట్టనున్న 48 గంటల దళిత గిరిజన దండోరా నిరసన కార్యక్రమ ఏర్పాట్లను కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవిలతో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమ వేదిక, వాహనాల పార్కింగ్, కార్యకర్తలు కూర్చోడానికి చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు పేదలకు అందిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. దళితులపై ప్రేమ కురిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వారికి చేసింది ఏమిటని వారు నిలదీశారు. 
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడి అభ్యున్నతికి కృషి చేసిందని, కేంద్రంలో సోనియాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారం చేపడుతుందని వారు జోస్యం చెప్పారు. రాష్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వంపై విసిగి వేసారి ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ దళిత నాయకులు, జిల్లా అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్, నియోజకవర్గ బాధ్యులు హరివర్ధన్ రెడ్డి, జంగయ్య యాదవ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.