చైనా బ్రాండ్లు నిషేధించినా ఎఫెక్ట్ ఏమీ ఉండదు

చైనా బ్రాండ్లు నిషేధించినా ఎఫెక్ట్ ఏమీ ఉండదు

చాలా బ్రాండ్ల టీవీలు ఇండియాలోనే తయారీ
చైనా నుంచి దిగుమతులు చాలా తక్కువ

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ కార్యక్రమంలో భాగంగా విదేశీ టీవీల దిగుమతులను మోడీ గవర్నమెంటు నిషేధించింది. మనదేశంలో టీవీల తయారీని ఎంకరేజ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం డొమెస్టిక్ టీవీ మార్కెట్‌‌పై పెద్దగా ఎఫెక్ట్ చూపే అవకాశాలు కనిపించడంలేదు. దాదాపు అన్ని కంపెనీలూ మనదేశంలోనే టీవీలను అసెంబుల్ చేస్తున్నాయి. పూర్తిగా విదేశాల్లో తయారైన టీవీలను మాత్రమే బ్యాన్ చేశారు. టీవీల విడిభాగాలను ఎప్పటి మాదిరే దిగుమతి చేసుకోవచ్చు. అయినప్పటికీ టీవీలను విదేశాల నుంచి కొనుగోలుచేసి తీసుకురావాలంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి లైసెన్సు తీసుకోవాలి. ఈ మేరకు గత నెల 20న కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇండియాలో టీవీల మార్కెట్ విలువ దాదాపు రూ.80 వేల కోట్ల దాకా ఉంటుందని 2018 నాటి లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో దిగుమతుల విలువ పదో వంతు కూడా లేదు. శామ్‌‌సంగ్, ఎల్‌‌జీ, షావోమీ, సోనీ వంటి పెద్ద బ్రాండ్లు ఇండియాలోనే టీవీలను తయారు చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు లోకల్ కంపెనీలతో అవుట్‌‌ సోర్సింగ్ విధానంలో టీవీలను తయారు చేయించి అమ్ముతున్నాయి.

ఉదాహరణకు ఫ్రెంచ్ టీవీ కంపెనీ థామ్సన్ తన బ్రాండ్ లైసెన్సును నోయిడాకు చెందిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌‌కు ఇచ్చింది. ఇదే కంపెనీ ఇండియాలో థామ్సన్ టీవీలను తయారు చేసి అమ్ముతుంది. చైనాతో ఇటీవల సరిహద్దుల్లో ఘర్షణలు మొదలయ్యాక, అక్కడి టీవీలు మనదేశానికి రాకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడి కంపెనీల పెట్టుబడులపైనా ఆంక్షలు విధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇండియాకు రూ.5,500 కోట్ల విలువైన టీవీలను చైనా ఎగుమతి చేసింది. నేరుగా చైనా నుంచి వచ్చిన దిగుమతుల విలువ ఇంకా తక్కువ ఉంటుంది. చైనాలో తయారైన వస్తువులు ముందు ఇతర దేశాలకు వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఇండియా కంపెనీలు కొంటున్నాయి. గత కొన్నేళ్లుగా చైనా ఎల్‌‌సీడీ టీవీల దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయని గవర్నమెంటు చెబుతున్నది. 24 ఇంచులు లేదా అంతకంటే పెద్ద టీవీలు ఎక్కువగా వియత్నాం నుంచి వస్తున్నాయి. చైనా ప్రొడక్టులను బ్యాన్ చేయడం వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదని, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు ఉన్న ఇతర దేశాల నుంచి తెప్పించుకోవచ్చని ఎక్స్‌‌పర్టులు అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి డైరెక్టుగా దిగుమతి అయిన టీవీల విలువ రూ.607 కోట్లు కాగా, వియత్నాం నుంచి రూ.2,018 కోట్ల విలువైన టీవీలు వచ్చాయి.

For More News..

ఆన్‌‌లైన్ కంపెనీల్లో జాబ్స్ జోరు

రూ.లక్ష కోట్లతో మారనున్న రైతు లైఫ్

ట్విట్టర్ చేతికి టిక్‌టాక్‌?