రాజన్న కోడెలకు పచ్చిగడ్డి వేస్తలేరు.. దాణా పెడ్తలేరు

రాజన్న కోడెలకు పచ్చిగడ్డి వేస్తలేరు.. దాణా పెడ్తలేరు
  • పచ్చిగడ్డి వేస్తలేరు.. దాణా పెడ్తలేరు.. ఎండు గడ్డితోనే సరి 
  • అరటిపండ్లు, పూలదండలు తిని ఆకలి తీర్చుకుంటున్న మూగజీవాలు 
  • కోడె మొక్కులతో ఏటా 10 కోట్లకు పైనే ఆదాయం వస్తున్నా.. 
  • వాటి సంరక్షణను పట్టించుకుంటలే 

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలోని కోడెలు సరిపడా మేత లేక బక్కచిక్కిపోతున్నాయి. వాటికి కేవలం ఎండుగడ్డి మాత్రమే పెడుతుండడంతో, రోజూ అది తినలేక... భక్తులు ఇచ్చే అరటిపండ్లు, పూలదండలు తింటూ ఆకలి తీర్చుకుంటున్నాయి. కోడె మొక్కుల ద్వారా ఏటా కోట్లల్లో ఆదాయం వస్తున్నా, అధికారులు మాత్రం వాటి ఆలనాపాలనా సరిగా చూసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాటికి కనీసం పచ్చిగడ్డి కూడా పెడ్తలేరనే ఆరోపణలు ఉన్నాయి. రాజన్న ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. నిజ కోడె మొక్కుల రూపంలో ఏటా దాదాపు 2 వేల వరకు కోడెలు ఆలయానికి వస్తుంటాయి. వీటిలో 300 కోడెలను దేవస్థానంలో ఉంచి, మిగిలిన వాటిని ‘‘తెలంగాణ గోశాల ఫెడరేషన్’’ ద్వారా వివిధ జిల్లాల్లోని గోశాలలకు తరలిస్తుంటారు. 

ప్రస్తుతం దేవస్థానం వద్ద 300 కోడెలు, 80 ఆవులు ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. వీటి సంరక్షణ కోసం రెండు గోశాలలు నిర్వహిస్తున్నారు. ఆలయ సమీపంలోని గోశాలలో 100 వరకు, బస్టాండ్ ఏరియాలోని తిప్పాపూర్​గోశాలలో 200 వరకు కోడెలు, ఆవులను ఉంచుతున్నారు.

మూడు షిఫ్టుల్లో కోడెలకు డ్యూటీ... 

ఆలయ సమీపంలోని గోశాలలో 100 కోడెలను ఉంచుతున్న ఆఫీసర్లు.. వాటిని మూడు షిఫ్టుల్లో భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయంలోకి తీసుకొస్తున్నారు. సొంతంగా కోడె తెచ్చి కట్టేస్తే (నిజ కోడె మొక్కు) రూ.1,016, ఆలయంలోని కోడెలను కట్టేస్తే రూ.200 టికెట్ తీసుకుంటున్నారు. టికెట్ తీసుకున్నాక కోడెను గుడిచుట్టూ తిప్పి కట్టేసేందుకు భక్తులకు అవకాశం ఇస్తారు. ఇందుకోసం ఆలయంలోని కోడెలను మూడు షిఫ్టుల్లో పని చేయిస్తున్నారు. ఉదయం 5 నుంచి10 గంటలు, 10 నుంచి సాయంత్రం 4గంటలు,  4 నుంచి రాత్రి 9 గంటల దాకా ఆలయంలో ఉంచుతున్నారు. ఇలా షిఫ్టులో ఉన్న టైమ్ లో కోడెలకు ఎలాంటి మేత పెట్టడం లేదు. ఎండాకాలం​కావడంతో మధ్యాహ్నం షిఫ్టులోని కోడెలు నీరసించిపోతున్నాయి. ఆకలికి తాళలేక భక్తులు ఇచ్చే అరటిపండ్లు, వాటి మెడలో వేసే పూలదండలను తింటున్నాయి. పూలదండలు జీర్ణం కాక అనారోగ్యానికి గురవుతున్నాయి. దీంతో టెంపుల్​లో తిరగలేని స్థితికి చేరిన కోడెలను ఆఫీసర్లు ముందుగా టెంపుల్​సమీపంలోని గోశాలకు, అక్కడి నుంచి తిప్పాపూర్​ గోశాలకు, ఆ తర్వాత ప్రైవేట్ గోశాలలకు తరలించి చేతులు
 దులుపుకుంటున్నారు. 

15 రోజులే పచ్చిగడ్డి.. అదీ అరకొరే.. 

కోడెల సంరక్షణ కోసం ఏటా రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. మేతగా రోజూ 3 టన్నుల ఎండుగడ్డి, 3 టన్నుల పచ్చిగడ్డి, 100 కిలోల ప్రొటీన్​దాణా ఇస్తున్నట్లు చెబుతున్నారు. కానీ రెండు గోశాలల్లో ఎండుగడ్డి తప్ప పచ్చిగడ్డి మచ్చుకైనా కనిపించడం లేదు. ఇక ప్రొటీన్​దాణా ఎప్పుడిస్తున్నారో కూడా తెలియడం లేదు. ఎండుగడ్డి సరఫరా కోసం రూ.7.50 లక్షలకు, పచ్చిగడ్డి కోసం రూ.10 లక్షలకు ప్రైవేట్​వ్యక్తులకు టెండర్లు అప్పగించారు. కాంట్రాక్ట్ ఇచ్చే టైమ్​లో పచ్చిగడ్డి సరఫరా చేసే వ్యక్తికి కనీసం గడ్డిని పండించే భూమి ఉందా? లేదా? అని కూడా పరిశీలించలేదని తెలుస్తోంది. దీంతో పచ్చిగడ్డి రెగ్యులర్​గా రావడం లేదని గోశాల వర్కర్లు చెబుతున్నారు. పచ్చిగడ్డి తెచ్చినప్పుడే టన్నుకు రూ.3,400 చొప్పున చెల్లిస్తున్నామని అంటున్నారు. దీంతో కాంట్రాక్టర్​ నెలలో సగం రోజులే పచ్చిగడ్డి తెస్తున్నాడని, అది కూడా సరిపడా తేవడం లేదని తెలుస్తోంది. ఫలితంగా కోడెలకు ఎండుగడ్డే దిక్కవుతోంది. అసలే ఎండాకాలం కావడం, దాణా, నీళ్లు కూడా సరిగ్గా లేకపోవడంతో నీరసించిపోతున్నాయి. 

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నం.. 

కోడెల సంరక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాటికి ఎండుగడ్డి, పచ్చిగడ్డి, దాణా అందిస్తున్నాం. ఎండాకాలం కావడంతో కోడెలు కొంత అలసిపోతున్న మాట వాస్తవం. అందుకే ఈసారి ప్రత్యేకంగా మంచి ప్రొటీన్​ఉండే కార్న్​సైలేజ్​ ఫీడ్​అందించాలని నిర్ణయించాం. ఇందుకోసం టెండర్​ పిలుస్తున్నాం. 
- శ్రీనివాస్,​ ఏఈవో