తెలంగాణ జాబ్స్ స్పెషల్

తెలంగాణ జాబ్స్ స్పెషల్

రాజ్యాంగంలో ఎక్కడా ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్​ ప్రస్తావన లేదు. బి.పి. మండల్​ కమిషన్​ సూచన మేరకు 27శాతం రిజర్వేషన్ల అమలుకు వి.పి.సింగ్​ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ తర్వాత వచ్చిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం మండల్​ కమిషన్​ సూచించిన 27శాతం రిజర్వేషన్​ కోటాలోనే ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించడంతో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో  ఉద్యోగాల్లో ఓబీసీల రిజర్వేషన్ అమలులోకి వచ్చింది. 

మొదటి వెనకబడిన తరగతుల కమిషన్​ను 1953లో కాకా కలేకర్​ చైర్మన్​గా నియమించారు.  ఆ తర్వాత1979లో మొరార్జీ దేశాయ్​ ప్రభుత్వం రెండో వెనకబడిన తరగతుల కమిషన్​ను పార్లమెంట్​ సభ్యుడైన బి.పి.మండల్​ అధ్యక్షతన నియమించింది. ఆర్టికల్​ 34ను అనుసరించి సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతుల వారి పరిస్థితులను పరిశోధించి వారి అభ్యున్నతికి తగిన సూచనలు ఇవ్వమని ఆదేశించింది. ఈ కమిషన్​ తన నివేదికను ప్రభుత్వానికి 1980లో సమర్పించింది. 3743 కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులుగా కమిషన్​ గుర్తించింది. ఈ కులాల వారు మొత్తం జనాభాలో షెడ్యూల్డ్​ కులాలు, షెడ్యూల్డ్​ తెగల వారిని మినహాయించగా 52 శాతం ఉన్నారు. ఇతర వెనకబడిన తరగతులకు ప్రభుత్వం 27శాతం ఉద్యోగాలను రిజర్వు చేయాలని, తద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అందరికీ కలిపి 50శాతం రిజర్వేషన్లు ఉంటాయని కమిషన్​ పేర్కొన్నది. 

10 ఏళ్ల తర్వాత వి.పి.సింగ్​ ప్రభుత్వం ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. ఇందులో 1991లో వచ్చిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం రెండు మార్పులను ప్రవేశపెట్టింది. ఇతర వెనకబడిన తరగతులకు కేటాయించిన 27శాతం కోటాలో ఆర్థిక స్థితిగతులను బట్టి పేద వర్గాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. 1992లో ఇందిరా సహాని వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా కేసులో వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లను కలిగించడానికి దోహదపడిన ప్రఖ్యాత మండల్​ కేసును సుప్రీంకోర్టు విచారించింది. ఇతర ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి సూచించిన 10శాతం అదనపు రిజర్వేష్లను కోర్టు తిరస్కరించింది. కొన్ని షరతులపై ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ల రాజ్యాంగబద్ధతను ఆమోదించింది. 

సుప్రీంకోర్టు తీర్పు అమలు

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వెనకబడిన తరగతుల రిజర్వేషన్​ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఓబీసీల్లో క్రిమిలేయర్​ గుర్తించడానికి రామ్​నందన్​ కమిటీని నియమించింది. ఈ కమిటీ 1993లో సమర్పించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది.  1993లో జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్​ను చట్టం ద్వారా పార్లమెంట్​ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్​ ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి ప్రజల్లో ఏదైన వర్గానికి వెనకబడిన తరగతుల్లో చేర్చడంలో తక్కువ ప్రాతినిధ్యం లేదా ఎక్కువ ప్రాతినిధ్యం లేదా అసలు ప్రాతినిధ్యం కల్పించలేదన్న ఫిర్యాదులను పరిశీలిస్తుంది. 102వ రాజ్యాంగ సవరణ చట్టం, 2018 వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్​కు రాజ్యాంగ హోదా కల్పించి దాని విధులను విస్తరించింది. ఇందుకోసం సవరణ చట్టం ప్రకరణ 338–బిను రాజ్యాంగంలో చేర్చింది. 50శాతం సీలింగ్​ను అతిక్రమించి 69శాతం రిజర్వేషన్లను కేటాయించిన తమిళనాడు రిజర్వేషన్స్​ ఆక్ట్​(1994)ను న్యాయ సమీక్షకు అతీతంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్​లో చేర్చడానికి 1994లో 76వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. 

ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు 

రిజర్వేషన్లు 50శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడం కోసం 103వ రాజ్యాంగ సవరణ చట్టం–2019 చేశారు. ఈ నిబంధన అమలులోకి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సివిల్​ సర్వీస్​ పోస్టులు, సర్వీసుల్లో ఆర్థిక బలహీన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు మంజూరు చేస్తూ 2019లో ఉత్తర్వు జారీ చేసింది. ఈ ప్రయోజనాన్ని పొందే ఆర్థిక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఏ రిజర్వేషన్​ పథకం కిందికి రారు. శాస్త్ర, సాంకేతిక పోస్టులు ఈ రిజర్వేషన్​ పరిధి నుంచి మినహాయించారు. 

  •  సంబంధిత గ్రూప్​–ఎ సర్వీసుల్లో దిగువ గ్రేడ్​ కంటే ఈ పోస్టులు ఎగువ గ్రేడ్​లో ఉండాలి.
  • కేబినెట్​ సెక్రటేరియట్​ ఆర్డర్​, 1961 అనుసరించి ఈ పోస్టులను శాస్త్ర లేదా సాంకేతిక పోస్టులుగా వర్గీకరించారు. ఈ శాస్త్ర సాంకేతిక పోస్టులకు నేచురల్​ సైన్సెస్​ లేదా ఎగ్జాక్ట్​ సైన్సెస్​ లేదా అప్లయిడ్​ సైన్సెస్​ లేదా టెక్నాలజీలో విద్యార్హతలు కలిగి, సదరు పరిజ్ఞానంతో విధులు నిర్వహించాలి. 
  • పరిశోధనలు నిర్వహించడం లేదా పరిశోధనలకు మార్గదర్శకత్వాన్ని, సూచనలను అందించడం ఈ పోస్టుల ఉద్దేశం.  

జాతీయ బీసీ కమిషన్​

102వ రాజ్యాంగ సవరణ చట్టం – 2018 ప్రకారం ఆర్టికల్​ 338బిను చేర్చుతూ జాతీయ బీసీ కమిషన్​కు రాజ్యాంగబద్ధత కల్పించారు. గతంలో ఉన్న జాతీయ బీసీ కమిషన్​ చట్టం–1993ను తొలగించడమైంది. 

నిర్మాణం: ఈ కమిషన్​లో ఒక చైర్మన్​, ఒక వైస్​ చైర్మన్​, ముగ్గురు సభ్యులు ఉంటారు. 

అర్హతలు: వీరి అర్హతలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. చైర్మన్​గా నియమించబడే వ్యక్తికి సుప్రీంకోర్టులో గానీ హైకోర్టులో గానీ పనిచేస్తున్న న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి లేదా న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వారై ఉండవచ్చు. 

రాజీనామా/ తొలగింపు: చైర్మన్​, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. అభియోగాలు మోపబడిన చైర్​పర్సన్​, సభ్యులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో  విచారణ జరిపి రాష్ట్రపతి తొలగిస్తారు. 

కాలపరిమితి: చైర్మన్​, సభ్యులందరి కాలపరిమితి మూడేండ్లు. 

విధులు: బీసీ కులాల్లో చేర్చాల్సిన లేదా తొలగించాల్సిన కులాలను సూచించడం, బీసీల స్థితిగతులు అధ్యయనం చేయడం, క్రిమిలేయర్​ పరిమితిని సూచించడం(ప్రస్తుతం 8 లక్షలు), ఈ కమిషన్​కు సివిల్​ కోర్టుకు ఉండే అధికారులు ఉంటాయి. తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.