మీ కుటుంబ అవినీతిని వదిలే ప్రసక్తే లేదు : బండి సంజయ్

మీ కుటుంబ అవినీతిని వదిలే ప్రసక్తే లేదు : బండి సంజయ్
  •  నీ కుట్రలను తిప్పికొడ్తం: బండి సంజయ్
  • బీఎల్‌‌ సంతోష్‌‌కు మీ లెక్క ఆస్తుల్లేవు.. విదేశాల్లో పెట్టుబడుల్లేవు..
  • ఎవడో కోన్ కిస్కా చెప్పాడని కేసులు పెట్టి అవమానిస్తావా? 
  • దివాళా తీసిన ఫైనాన్స్ సంస్థలా కేసీఆర్ పాలన
  • టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకొస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేస్తడు 
  • బీజేపీ శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘‘కేసీఆర్.. ఇక నీతో యుద్ధానికి సిద్ధం. నీ కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొడ్తం. నీ గడీల పాలనను బద్ధలు కొడ్తం. నీ కుటుంబ అవినీతిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో పేదల కోసం పని చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. తెలంగాణ సమాజాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుపు బీజేపీదేనని, గోల్కొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలన.. బోర్డు తిప్పేసిన, దివాళా తీసిన ఫైనాన్స్ సంస్థలా ఉందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు ఖాయమని, తెలంగాణ చేతికి చిప్ప తథ్యమని చెప్పారు. హైదరాబాద్ శివారులోని శామీర్ పేటలో ఆదివారం ప్రారంభమైన బీజేపీ మూడు రోజుల శిక్షణా తరగతులు మంగళవారం ముగిశాయి. తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో పలు రాజకీయ తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా నేతలను ఉద్దేశించి బండి సంజయ్ ముగింపు ఉపన్యాసం చేశారు. ‘‘దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అంతమైపోయింది. ఇక కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర పెట్టారు. 

ఈ పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని చూస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ గెలుపును ఆపలేరు. కేంద్రంలో బీజేపీ సర్కార్‌‌‌‌‌‌‌‌కు ఢోకా లేదు. అందుకే రాష్ట్రంలోనూ బీజేపీ పవర్‌‌‌‌‌‌‌‌లోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి వేగవంతం అవుతుంది’’ అని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత విద్య, వైద్యం, పేదలకు ఇండ్లు, రైతుకు పంట నష్టపరిహారం వంటి హామీలను పక్కాగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని రద్దు చేయబోమని, మరింత మెరుగ్గా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు
‘‘కేసీఆర్.. ఏం తప్పు చేశారని బీఎల్ సంతోష్ వంటి ప్రచారక్‌‌‌‌లను వేధిస్తున్నావ్? ఆయనకు మీ లెక్క ఆస్తిపాస్తుల్లేవు.. విదేశాల్లో మీలెక్క పెట్టుబడుల్లేవు.. బ్యాంకు ఖాతాల్లేవు.. ఎవడో కోన్ కిస్కా చెప్పారని కేసులు పెట్టి అవమానిస్తావా? నీ రాజకీయ లబ్ధి కోసం.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరకు బీజేపీలోని ప్రచారక్ వ్యవస్థనే కించపరుస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఖబడ్దార్! నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అంటూ సంజయ్ ఫైర్ అయ్యారు. దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తున్న ప్రధానిపై.. దేశం, ధర్మం కోసం కుటుంబాల్లేకుండా సేవ చేస్తున్న ప్రచారక్ లపై  కేసీఆర్ అనుచిత ఆరోపణలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.

అమరుల స్ఫూర్తితో టీఆర్ఎస్‌‌‌‌ను గద్దె దించాలి

‘‘తెలంగాణ కోసం టీఆర్ఎస్ చేసిన త్యాగమేంటి? సామాన్య ప్రజలు బలిదానం చేస్తే.. వాటిని తన ఖాతాలో వేసుకుని అధికారం చెలాయిస్తూ మోసం చేస్తున్న పార్టీ నీది. చనిపోయిన వాళ్లను టీఆర్ఎస్ కార్యకర్తలుగా చెప్పుకునే నీచ స్థాయికి దిగజారింది నీవు కాదా?” అంటూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను సంజయ్ నిలదీశారు. సిద్ధాంతం, విధానం, పద్ధతి లేని పార్టీ టీఆర్ఎస్ అని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. సుష్మా స్వరాజ్ మద్దతు లేకుంటే పార్లమెంట్‌‌‌‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేది కాదన్నారు. పార్లమెంట్‌‌‌‌లో జై తెలంగాణ అని విజయశాంతి గర్జిస్తుంటే.. సభకు రాకుండా ఇంటికే పరిమితమైన సిగ్గులేని నేత కేసీఆర్.. అని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పోరాటాలు చేస్తూ ఎందరో బలయ్యారని, టీఆర్ఎస్ మూర్ఖత్వపు పాలన అంతమయ్యే వరకు ప్రాణాలతో ఉండాలని మందాడి వంటి ఎందరో నేతలు పరితపించారని చెప్పారు. కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ గూండాల దాడికి ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల స్ఫూర్తితో టీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించేందుకు శక్తి వంచన లేకుండా పోరాడాలని క్యాడర్‌‌‌‌‌‌‌‌కు సంజయ్ పిలుపునిచ్చారు.

అప్పు చేసి వడ్డీలు కడ్తున్నరు

‘‘తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ ఉన్న స్టేట్.. కేసీఆర్ పాలనలో అడుక్కునే స్థాయికి దిగజారింది. పుట్టబోయే బిడ్డపై లక్షా 50 వేల అప్పు చేశారు. కేసీఆర్ పాలన పుణ్యమా అని ఏటా రూ.30 వేల కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నారు. అప్పు చేసి వడ్డీలు కట్టడానికే పరిమితమవుతారా? ఇదేనా బంగారు తెలంగాణ?’’ అని సంజయ్ ప్రశ్నించారు. పక్కనున్న కర్నాటక రూ.60 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే.. తెలంగాణ తెచ్చింది కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. సీఎం కుటుంబానికి కమీషన్లు, వాటా ఇస్తే తప్ప రాష్ట్రంలోకి పెట్టుబడులు, కంపెనీలు రాలేని పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి, రఘునందన్ రావు, సోయం బాపూరావు, ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. బాపూరావు, సంకినేని వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి బలపరిచారు. 

పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తుండు

కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదని సంజయ్ ఆరోపించారు. సంక్షేమ పథకాలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయన దుర్మార్గాలను గమనించిన కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తూ దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటున్నదని, కేసీఆర్ దాన్నీ తప్పు పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఈ నెల 26 నుంచి చేయబోతున్నామని, దీన్ని కేసీఆర్ అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ నియోజకవర్గంలోని అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు.