రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట.. ఆర్టీఐ కింద ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వెల్లడి

రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట.. ఆర్టీఐ కింద ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వెల్లడి

రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట
ఆర్టీఐ కింద ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదంట! రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మిన కేసులు కూడా నమోదు కాలేదంట! ఈ మేరకు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థ ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టగా సమాచారం ఇచ్చింది. ఆ వివరాలను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ రాజేంద్ర పల్నాటి శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయా? లేవా? ఉంటే ఏయే జిల్లాలో ఎన్ని ఉన్నాయి? ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మిన కేసులు ఎన్ని నమోదు అయ్యాయి? ఆ షాపులను సీజ్ చేశారా? ఎక్కడెక్కడ ఎంత జరిమానా విధించారు? తదితర ప్రశ్నలతో ఎక్సైజ్ కమిషనర్​కు ఆర్టీఐ కింద అప్లికేషన్ పెట్టినట్టు ఆయన తెలిపారు. దానికి జిల్లాల వారీగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ల నుంచి తనకు సమాధానం వచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకు 28 జిల్లాల సమాచారం అందిందని పేర్కొన్నారు.

రంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్‌‌‌‌నగర్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌‌‌‌గిరి, నిర్మల్, మంచిర్యాల, వరంగల్ రూరల్, ఆదిలాబాద్, జగిత్యాల, భూపాలపల్లి తదితర జిల్లాల నుంచి సమాచారం వచ్చిందని వెల్లడించారు. అయితే అధికారులందరూ తప్పుడు సమాచారమే ఇచ్చారని తెలిపారు. ‘‘రాష్ట్రంలో వేల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి. కానీ ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదని సమాధానం ఇచ్చారు. పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లెటర్ లో పేర్కొన్నారు” అని చెప్పారు.

ఇది పెద్ద జోక్ : ఆకునూరి

అబద్ధాల పరిపాలన రాష్ట్రంలో ఉన్నట్టు ప్రపంచంలో ఎక్కడా లేదని రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. రాష్ట్రంలో బెల్ట్​ షాపులు అసలే లేవన్న సర్కారు సమాధానంపై ఆయన శుక్రవారం మండిపడ్డారు. ‘‘ఇది అతిపెద్ద జోక్​. రాష్ట్రంలో బెల్ట్​షాపులు లేని గ్రామం, బస్తీ లేనే లేదు. 50 వేల బెల్ట్​షాపులున్నా.. లేవని అబద్ధం చెప్పుడేంది? ఇంత అబద్ధాల పరిపాలన ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఆబ్కారీ మంత్రి అయినా మీడియాకు కరెక్ట్​ సమాచారం చెప్పాలి. లేదంటే మీ శాఖే నవ్వులపాలవుతుంది” అని ఆయన ట్వీట్​ చేశారు.

మరోవైపు మంత్రి కేటీఆర్ అమెరికా టూర్​పైనా మురళి సెటైర్లు వేశారు. ‘‘అమెరికాలోని నెవెడాలో సివిల్​ ఇంజినీర్లకు ఏం చెప్తారు? రూ.1.2 లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సింది పోయి 3 లక్షల ఎకరాలకే ఇస్తున్నామని చెప్తారా? భగీరథ కింద ఇచ్చిన నల్లాలు చూడండి ఎంత బాగున్నాయో అని చూపిస్తారా?’’ అని ఎద్దేవా చేశారు.