పాక్‌కు గుడ్ బై.. ఇండియాకు జై: ఐపీఎల్‌లో ఆడనున్న పాకిస్తాన్ బౌలర్

పాక్‌కు గుడ్ బై.. ఇండియాకు జై: ఐపీఎల్‌లో ఆడనున్న పాకిస్తాన్ బౌలర్

క్యాష్ రిచ్‌గా పేరొందిన ఐపీఎల్‌లో ఆడాలనేది ప్రతి ఒక్క ఆటగాడి కల. ఈ టోర్నీలో ఆడితే ఖజానా నింపుకోవడమే కాదు.. రాత్రికి రాత్రే అంతర్జాతీయ స్టార్‌గా మారిపోవచ్చు. అందుకే ఈ మెగా టోర్నీలో ఆడటానికి విదేశీ ఆటగాళ్లు ఉత్సాహం చూపుతుంటారు. కానీ ఇండియా- పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడటం లేదు. ఈ క్రమంలో కొందరు పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటం కోసం పాక్ పౌరసత్వాన్నే వదులుకుంటున్నారు. 

పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ మహమ్మద్ అమీర్ త్వరలోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తనకు ఐపీఎల్‌లో ఆడాలని ఉందన్న అమీర్.. అందుకు మరో ఏడాది సమయం ఉందని తెలిపారు. 2016లో బ్రిటీష్ యువతి నర్జీస్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న అమీర్.. 2020 నుంచి  ఇంగ్లండ్‌లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఏడాది గడిస్తే అతనికి బ్రిటిష్ పౌరసత్వం లభించనుంది. తద్వారా ఐపీఎల్‌లో ఆడటానికి మార్గం సుగమం కానుంది.

ఈ విషయం గురుంచి అమీర్ మాట్లాడుతూ.." ఐపీఎల్ ఆడాలని నాకూ ఉంది. అందుకు ఇంకా ఒక సంవత్సరం సమయం మిగిలి ఉంది. కానీ ఆ సమయంలో ఎలా ఉంటుందో చెప్పలేను. రేపు ఏమి జరుగుతుందో నాకూ తెలియదు. 2024 ఐపీఎల్‌లో ఆడటానికి నా వంతుగా ప్రయత్నిస్తాను. ఏ చిన్న అవకాశం వచ్చినా దానిని ఉపయోగించుకుంటా.." అని చెప్పుకొచ్చారు. 

లెఫ్ట్ హ్యాండర్ బౌలరైన అమీర్.. ఒకానొక సమయంలో పాక్ జట్టులో కీలక బౌలర్. అలాంటిది స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా అమీర్‌పై.. పీసీబీ ఐదేళ్లు నిషేధం విధించింది. అనంతరం పీసీబీ అధికారులపై న్యాయ పోరాటం చేసిన అమీర్.. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు.