డబుల్​ ఇండ్ల కోసం అడిగితే దాడి

డబుల్​ ఇండ్ల కోసం అడిగితే దాడి
  • మరిపెడ మండలంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్​ను ప్రశ్నించిన  యువకులు 
  • బయటకు తీసుకువెళ్లి కొట్టిన బీఆర్​ఎస్​ నాయకులు

మరిపెడ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మతండాలో డోర్నకల్​ ఎమ్మెల్యే రెడ్యానాయక్​ను శుక్రవారం పలువురు మహిళలు నిలదీశారు. తాగునీరు, కరెంట్​సమస్యలు పరిష్కరించాలని, డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. తర్వాత సోమ్లా తండాలో ఎమ్మెల్యే రెడ్యానాయక్​ మాట్లాడుతుండగా గ్రామ యువకులు డబుల్ ​ఇండ్ల కోసం ఎమ్మెల్యేను ప్రశ్నిస్తుండగా బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకున్నారు.

సమావేశంలో కావాలనే గొడవ చేయడానికి వచ్చారని ఆరోపిస్తూ మరిపెడ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు  తాళ్లపెల్లి శ్రీనివాస్, మరికొందరు కలిసి ఇద్దరు యువకులను దూరంగా తీసుకువెళ్లి దాడి చేశారు. దీంతో పోలీసులు సదరు యువకులను వేరేచోటికి తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే గ్రామస్తులకు 40 ఇండ్లు ఇప్పిస్తానని వాగ్దానం చేసి సభ ముగించి వెళ్లిపోయారు. దాడికి గురైన యువకులు మాట్లాడుతూ తమపై దాడి చేసిన బీఆర్ఎస్ ​లీడర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేశారు. 

ఏం చేశావని మా ఊరికి వచ్చినవ్​? 

  • ఎమ్మెల్యే రాజయ్య నిలదీత

రఘునాథపల్లి, వెలుగు : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంలో జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని పర్యటిస్తున్న రాజయ్యకు చుక్కెదురైంది. శుక్రవారం రామన్నగూడెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. ‘నువ్వు ఎమ్మెల్యే గా గెలిచి మా ఊరిలో ఏం అభివృద్ధి చేసినవ్?’ అని ప్రశ్నించారు. డెవలప్​ చేయని నీకు తమ గ్రామానికి వచ్చే అర్హత లేదన్నారు.

రఘునాథపల్లి మండలం  నుంచి పాలకుర్తి మండలం వరకు వెళ్లే  లింక్ రోడ్డును గబ్బేట, కోడూర్, రామన్నగూడెం మీదుగా వేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్​తో కలిసి గబ్బేట గుట్టల మధ్యలోంచి కోతులాబాద్​మీదుగా వేసి తమ గ్రామ వెనుకబాటుకు ఎమ్మెల్యే కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని ఆపారు. అయినా, అలాగే మాట్లాడుతుండడంతో రాజయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు.